నెట్టిల్లు


Sun,November 17, 2019 01:00 AM

కలలు!.. చాలామందిని వెంటాడేవి ఇవే. సాధ్యం చేసుకొనేందుకు ప్రయత్నాలెన్నో. సమస్యలు, సంఘర్షణలు ఇంకెన్నో. అన్నిటినీ అధిగమిస్తే అవి నెరవేరడం పక్కా.. సినిమా దర్శకత్వం కోసం ఇలాంటి కలలు కని, కృషి చేస్తున్న ఎంతో మంది యువతది ఇదే కథ. అలాంటి వారు తీసిన లఘుచిత్రాల సమీక్షలే ఇవి.

మస్తీ

దర్శకత్వం: గజిని యోగి
నటీనటులు : సీతామహాలక్ష్మి, యోగేశ్
ఇషా, గౌతమ్ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. కలిసి తిరుగుతారు. గౌతమ్‌ను ఉద్యోగంలో పెట్టిస్తుంది ఇషా. ఇలా కొన్ని రోజుల తర్వాత ప్రేమ పెంచుకుంటాడు గౌతమ్. ఈ విషయాన్ని ఇషాకు చెప్పాలనుకుంటాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటాడు. అదే రోజు ఇషాను కలుస్తాడు. పుట్టిన రోజు కాబట్టి ఇషా పార్టీ ఇస్తుంది. ఆ సందర్భంలో ఆమె ప్రవర్తనను చూసి తను కూడా అతన్ని ప్రేమిస్తుందనుకుంటాడు గౌతమ్. కొద్ది సేపటి తర్వాత ఆమె అమెరికా వెళ్తున్నట్టు, రెండు నెలల్లో వస్తానని చెప్తుంది. దీనికి సరే అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఇషా అమెరికా వెళ్లకుండా అతనికి కనబడకుండా తిరుగుతున్నదని ఆలస్యంగా తెలుసుకుంటాడు. వెళ్లి అడుగుతాడు. ఇద్దరం కలిసి తిరిగాం, దాన్ని ప్రేమ అనుకుంటే ఎలా అంటుంది ఇషా. దానికి గౌతమ్ బాధపడతాడు. ఎందుకు అలా చేసింది? తర్వాత ఏం జరిగింది అనేది యూట్యూబ్‌లో చూడండి.
Masti

Total views 49,925+ (నవంబర్ 9 నాటికి) published on Nov 3, 2019

The Hunt

దర్శకత్వం: సాయితేజ
వ్యాపారస్తుని ఇంటిపై సీబీఐ రైడ్ జరుగుతుంది. అతని దగ్గరున్న ఎనిమిది వజ్రాలను ఎవరికీ తెలియకుండా బయట ఓ చెత్తకుప్పలో విసురుతాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాటిని సేకరించడానికి వెళ్తారు. కానీ అక్కడ రెండు వజ్రాలే దొరుకుతాయి. మిగతావాటి కోసం మనీష అనే ఎస్సైతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. 48 గంటల్లో ఈ కేసును ఛేదించాలి. మనీష తన టీమ్‌తో కేసు దర్యాప్తు మొదలుపెడుతుంది. 24 గంటలు గడిచినా ఎలాంటి ప్రోగ్రెస్ కనబడదు. పైఅధికారులు సీరియస్ అవుతారు. ఢిల్లీ నుంచి ఓ ప్రత్యేక అధికారిని పిలిపించి కేసు అప్పగిస్తారు. మనీషను అతనికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. 24 గంటల్లో ఆ అధికారి కేసును ఛేదిస్తాడు. వజ్రాలు ఎక్కడ ఉన్నాయి. ఎవరు తీశారు అనే వివరాలు అన్నీ కనుక్కుంటాడు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు ఉన్నతాధికారులు షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగుంటుందో మీరూ చూడండి. కథకు తగ్గ స్క్రీన్‌ప్లే ఉంది. మొదటినుంచి ఆసక్తికరంగా సాగుతుంది. చూడొచ్చు.
The-hunt

Total views 1,285+ (నవంబర్ 9 నాటికి) Published on Nov 8, 2019


నీతోనే ఎప్పటికీ..

దర్శకత్వం: వసంత్ కె. కరణం
నటీనటులు : లోమేశ్, శామ్యుల్, సూర్య
జాను సిద్దు కలిసి జీవిస్తారు. చాలారోజులు వారి ప్రయాణం కొనసాగుతుంది. అనందంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని ఘటన కలచివేస్తుంది. అది జానును ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఓ రోజు సిద్ధు, జాను ఒక హోటల్‌కు వెళ్తారు. మాట్లాడుతుండగానే సిద్ధు, జాను గొంతు కోసేస్తాడు. తర్వాత తెలుస్తుంది ఇది కల అని. ఈ కలలో జరిగినట్టే నిజ జీవితంలోనూ జరుగుతుందేమో అని జాను భయపడుతూ ఉంటుంది. దూరమవ్వడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఇక్కడ కథ కొంచెం వెనక్కి వెళ్తుంది. జాను కోసం వస్తున్న సిద్ధుకు రోడు ప్రమాదం జరుగుతుంది. కట్ చేస్తే ఏడాది. అభితో పెండ్లికి సిద్ధమవుతుంది జాను. అసలేం జరిగుంటుందో పూర్తిగా తెలియాలంటే యూట్యూబ్‌కెళ్లండి. చిన్న సైకలాజికల్, సందేశాత్మక కథను తగిన స్క్రీన్‌ప్లేతో చూపించారు. నిర్మాణం, పాటలు, డైలాగులు వెయిటేజీపెంచాయి.
Neethone-eppatiki

Total views 3,818+ (నవంబర్ 9 నాటికి) Published on Nov 8, 2019

నిర్ణయం

దర్శకత్వం: హేమంత్ సంగెపు
నటీనటులు : కార్తీక్, సింధు
గమ్యాన్ని ఎంచుకొని గాయపడ్డ ప్రేమలు, ప్రేమను ఎంచుకొని గమ్యాలకు పడిన కంచెలు.. ఈ సంఘర్షణలో నలిగిపోయే మనుషులు ఎంతమందో ఇలాంటి కథాశంతో నడిచే లఘుచిత్రం నిర్ణయం. కథ విషయానికి వస్తే విక్రమ్‌కు సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా మంచి ఫిలిమ్‌మేకర్ కావాలనుకుంటాడు. దీని కోసం ఉద్యోగాన్ని వదిలేసి మరీ ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో ప్రేమించిన రేణు అతనికి తోడుంటుంది. ఓ రోజు విక్రమ్‌ను రేణు ఆమె తండ్రికి పరిచయం చేస్తుంది. వివరాలు కనుక్కున్న ఆ తండ్రి అందరిలాగే సూటిపోటి ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడు. ఉద్యోగం చేయకుండా ఆసక్తులు, అభిరుచులు అంటూ తిరిగే వాళ్లంటే నచ్చదు అని చెప్పకనే చెప్తాడు. విక్రమ్‌కు అర్థం అవుతుంది. వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఏడాది తర్వాత. ఫిలిమ్ మేకింగ్‌లో విక్రమ్ బిజీగా ఉంటాడు. ప్రేమ ఏమైంది? ప్రేమను వదులుకున్నాడా? రేణు, విక్రమ్ పెండ్లి చేసుకున్నారా? దేని కోసం దేన్ని వదులుకున్నాడో యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది. కథకు తగ్గ వాతావరణం, నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణం బాగున్నాయి. చూడండి.
Nirnayam

Total views 1,972+ (నవంబర్ 9 నాటికి) Published on Nov 7, 2019

వినోద్ మామిడాల, సెల్: 7660066469

206
Tags

More News

VIRAL NEWS