ఇడ్లీకి ఓ రోజుంది


Sun,November 17, 2019 01:07 AM

ఉదయం పూట మనం తినే టిఫిన్స్ దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, వడ.. ఇలా ఎన్ని వున్నా ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం ఇడ్లీనే. ఒంట్లో బాగాలేకపోయినా, జ్వరంతో బాధపడేవారికి కూడా సులభంగా జీర్ణం కాగల అమృత శక్తిగా ఇడ్లీని గుర్తిస్తారు. నీటి అవిరితో ఉడికే ప్రత్యేకత కల్గిన ఏకైన వంటకం ఇడ్లీ మాత్రమే. సాంబార్ ఇడ్లీ అంటే ఇక నోరూరాల్సిందే. తమిళనాడులో ప్రతిరోజు లక్షలాది మంది ఇడ్లీని తింటుంటారు. అక్కడే కాదు ఆంధ్రపదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ర్టాల్లో కోట్ల ఇడ్లీలను జనాలు తినేస్తున్నారు. ఇంతకీ ఇడ్లీ భారతీయ వంటకమేనా? ఇడ్లీల్లో ఎన్నిరకాలు ఉన్నాయో తెలుసా? అసలు ఇడ్లీ పేరుతో ఒక రోజుందని ఎంతమందికి తెలుసు?
Idly

ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అని భావిస్తాం. కానీ ఈ ఇడ్లీ అనేది ఇండోనేషియా నుండి ఇండియాకు వచ్చిందని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇది ఇండోనేషియాలో పుట్టిందని ఫుడ్ హిస్టోరియన్ అయిన కే.టి ఆచార్య వెల్లడించారు. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. 800-1200 సంవత్సరాల మధ్య ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. మనదేశంలో తొలిసారి కర్నాటకలో ఇడ్లీలను తయారు చేశారు. వాటిని ఇడ్డలిగే అని పిలిచేవారు. వీటిని సంస్కృతంలో ఇడ్డరికా అని పిలిచేవారట. అంటే ఉడికించిన పదార్థం అని.కైరోలోని అల్-అజహర్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న కొన్ని రచనల ప్రకారం.. దక్షిణ భూభాగంలో నివసించిన అరబ్ వ్యాపారులు ఇండియాకు రావడం ద్వారా ఇడ్లీని ఇక్కడ పరిచయం చేశారని తెలుస్తున్నది. వారు దక్షిణాది ప్రజలను వివాహం చేసుకుని స్థిరపడడం వల్ల ఇడ్లీ దక్షిణాది వంటకంగా పేరొంది. ముస్లిం వంటకాలైన హలీమ్‌లా కొంచెం ప్రత్యేకంగా కనిపించేందుకు రైస్ బాల్స్ (ఉడికించిన బియ్యం ఉండలు) తయారు చేసేవారట. క్రమేనా వాటిని గుండ్రంగా సన్నగా ప్రస్తుతం ఉన్న ఇడ్లీల రూపంలోకి మలిచి కొబ్బరి చెట్నీతో తినడాన్ని అలవాటు చేసుకున్నారట. 8వ శతాబ్దం నుంచి ఆ రైస్ బాల్స్.. ఇడ్లీ పేరుతో ప్రచారంలోకి వచ్చి దేశమంతా వ్యాపించాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఎప్పుడు పుట్టినా.. ఎక్కడ పుట్టినా.. ప్రపంచం మాత్రం ఇడ్లీ ఇండియాదేనని బలంగా నమ్ముతున్నది. భారతీయుల నమ్మకం కూడా అదే. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా గుర్తింపు ఉంది. మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలోకూడా విపరీతమైన గిరాకీ వున్న టిఫిన్ ఇడ్లీ మాత్రమే.

ఒక్క ఆలోచన: మన జీవన ప్రయాణంలో ఎవరెవరో తారస పడుతారు. ఒక్కోసారి మనకు టచ్ అయిన వ్యక్తి ఆలోచనలే మన జీవిత గమనాన్ని మార్చేస్తాయి. కోయంబత్తూర్‌కు చెందిన ఇనియవాన్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన అతడు బతుకుతెరువు కోసం హోటళ్లలో కప్పులు కడిగాడు, టేబుళ్లు తుడిచాడు. ఆ తర్వాత ఆటో నడుపుకోవడం మొదలుపెట్టాడు. చంద్రమ్మ అనే ఒకావిడ ఇంటి దగ్గర ఇడ్లీలు తయారుచేసి, వాటిని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకోవడానికి రోజూ ఇనియవాన్ ఆటో ఎక్కేది. ఆ ప్రయాణంలో ఆమె ఇడ్లీల తయారీ గురించీ, ఎలా తయారు చేస్తారు? వినియోగదారుల అభిరుచుల గురించీ ఎన్నో విషయాలు చెప్పేది. అలా వినీ వినీ తను కూడా ఓ ఇడ్లీ హోటల్ పెడితే బాగుంటుంది కదా అనుకున్నాడు. అంతే, ఓ మంచిరోజున ఆటో డ్రైవర్ వృత్తికి టాటా చెప్పేసి కోయంబత్తూర్ నుంచి చెన్నై వచ్చి మల్లిపూ ఇడ్లీ పేరుతో ఓ పాత పాకలో హోటల్ని ప్రారంభించాడు. అయితే దురదృష్ట వశాత్తు ఇనియవాన్ హోటల్ ప్రారంభించిన వెంటనే భారీ వర్షాలు మొదలయ్యాయి. పాకలోంచి నీరు కారడంతో సరకులూ ఇడ్లీ పిండీ అన్నీ తడిసిపోయాయి. అయినా నిరుత్సాహపడలేదు. వర్షాలు తగ్గాక మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు.

రెండువేల రకాలు: ఇడ్లీలు అందరూ చేస్తారు. కానీ, తను చేసే ఇడ్లీలు ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. అందుకే, ఇడ్లీని కొత్త రుచుల్లో తయారు చేయడం మొదలుపెట్టాడు. లేత కొబ్బరి, చాకొలెట్, బాదం, నారింజ గుజ్జు, మొక్కజొన్న పిండి... లాంటి రకరకాల పదార్థాలను ఇడ్లీ పిండిలో కలిపేవాడు. ఆ కొత్త రుచులు వినియోగదారులకూ నచ్చాయి. గిరాకీ బాగా పెరిగింది. ఇక, ఇనియవాన్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. అలా ఇప్పటివరకూ దాదాపు రెండు వేల కొత్తరకం ఇడ్లీలను సృష్టించాడు. అందులో 20కి పైగా రుచులకు పేటెంట్ కూడా ఉంది. ఇప్పుడతను ఎంత ఫేమస్ అంటే అతడి పేరే ఇడ్లీ మ్యాన్‌గా మారిపోయింది. బుల్లి బుల్లి గిన్నెల ఆకారంలోనూ, గణపతి, కలాం, మిక్కీమౌస్, కుంగ్‌పూ పాండా... ఇలా రకరకాల రూపాల్లో కూడా ఇడ్లీలను తయారు చేయడం అతడి ప్రత్యేకత. అతడు వండిన 125కిలోల ఇడ్లీ గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ప్రస్తుతం మల్లిపూ ఇడ్లీ సంస్థ 30 రుచుల్లో హోల్‌సేల్‌గా ఇడ్లీలను అమ్ముతున్నది.

ఇడ్లీ దినోత్సవం: ఇడ్లీ తయారు చేయడంలో ఇనియావాన్ చూపిన ప్రత్యేకత, ఇంతవరకు ఎవరూ తయారు చేయలేని రకాల్లో తయారు చేసిన ఘనత, తన పుట్టిన రోజున ఒకేసారి 44 కిలోలు, మరోసారి 125 కిలోల ఇడ్లీని తయారు చేయడం ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో తమిళనాడు కుకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇనియవాన్ పుట్టినరోజు అయిన మార్చి30 ని ప్రపంచ ఇడ్లీ డేగా ప్రకటించింది. గత నాలుగేండ్లుగా ఆయన జన్మదినాన ఇడ్లీడే గా ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇడ్లీలు ఆరోగ్యానికి మంచివి. కానీ చాలామందికి వాటి రుచి అంతగా నచ్చదు. అలాంటి పిల్లలకూ, పెద్దలకూ ఇడ్లీల్లో కొత్త రుచుల్ని పరిచయం చెయ్యడంతో పాటు ఇంకాస్త ఆరోగ్యకరమైన వెరైటీలనూ అందించాలనుకున్నా. మా పిల్లల విషయానికొస్తే వారికి పిజ్జా బర్గర్లంటే ఇష్టం. అందుకే, వారిని కొంతలో కొంతైనా అటునుంచి మళ్లించడానికి పిజ్జా ఇడ్లీ తయారుచేశా. రాగులూ జొన్నల్లాంటి రకరకాల చిరుధాన్యాలతోపాటు యాపిల్, నారింజ, బీట్రూట్, క్యారెట్, పుదీనా, మునగాకు... లాంటి పండ్లూ కూరగాయలతో తయారు చేసిన ఇడ్లీలు కూడా మా దగ్గర దొరుకుతాయి. కాస్త స్పైసీగా ఉండాలనుకునేవారు ఉప్మా ఇడ్లీ, సేమ్యా ఇడ్లీ, మసాలా ఇడ్లీలనూ తినవచ్చు అంటాడు ఇనియవాన్.

593
Tags

More News

VIRAL NEWS