ఆరని ఆఖండజ్యోతి గంభీరావుపేట సీతారామాలయం


Sun,November 17, 2019 01:20 AM

సుమారు ఆరువందల ఎనభై సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ ఆలయం. వందల ఏండ్లయినా ఇప్పటికీ చెక్కచెదరని నిర్మాణాలు దాని స్వంతం. కాకతీయులతో నిర్మితమైన ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహలతోపాటు రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, ఆనాటి కాలాన ఏర్పాటు చేసిన గంట, నిత్యం వెలుగుతూ ఉండే అఖండజ్యోతి ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నదీ ఆలయం.
Temple

తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజ వంశాలు పరిపాలించాయి. వారి పాలన కాలానికి అనుగుణం గా ఆయా ప్రాంతాల్లో పలు దేవా లయాలు నిర్మితమయ్యాయి. అలాంటి నిర్మాణాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలో గల అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి. కాకతీయ పాలకుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం అనేక ప్రత్యేకతలతో భక్తులను అలరిస్తున్నది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విగ్నంగా పూజలు సాగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. రాతి స్తంభాలతో నిర్మితమైన కల్యాణమంటపం, ఆలయంలోని తటాకం నాటి నిర్మాణశైలికి అద్దం పడుతున్నాయి. ఆలయం నిర్మించిన నాటినుంచి అంటే సుమారు 680 సంవత్సరాలుగా దేవాలయంలో నిరంతరాయంగా అఖండజ్యోతి వెలుగుతుండడం ఇక్కడి ప్రత్యేకత.

స్థల పురాణం..

ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల కాలంలో రాజ్యంలోని కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రాంతాలుగా పరిగణించేవారు. అక్కడ పలు నిర్మా ణాలు కూడా చేపట్టేవారు. అలాంటి వాటిలో గంభీరావుపేట వారికి ప్రధాన కేంద్రంగా ఉండేదట. దానితో ఈ ప్రాంతంలో వారు ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వేంకటరావు దేశాయి సంస్థానాధీశుడిగా ఉండేవాడు. దీంతో ఆలయం ఆయన పరిపాలన కిందికి వచ్చింది. దీంతో ఆయన సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానిక పెద్దలు చెబుతారు. ఆలయంలోని పూజ ఇత్యాది కార్యక్రమాలకు ఆలయానికి కూతవేటు దూరంలో సంస్థానాధీశుడి పేరు మీద వెంకటాద్రి చెరువును నిర్మించినట్లు చెబుతారు. ఆ చెరువునుంచి ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటికీ నీటిని తెచ్చే ఆచారం నేటికీ కొనసాగుతున్నది. ఈ ఆలయాన్ని దాదాపు క్రీస్తుశకం 1333లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఆలయంలోని గంటపై ఆ సంఖ్యలు చెక్కబడి ఉన్నాయి. కాకతీయుల కాలం నాటి ఈ గంట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడాన్ని మనం చూడవచ్చు. 16 స్తంభాలతో ఆ కాలంలో నిర్మితమైన కల్యాణమంటపం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నది.
Temple1

నిరంతరజ్యోతి ఈ నందాదీపం

ఆలయంలో నందాదీపం గత ఏడు వందల ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలు అందుకుందని పూర్వీకులు తెలుపుతున్నారు. ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే గ్రామస్తులు ఐశ్వర్యం, ధాన్యం, సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.
Temple2

313
Tags

More News

VIRAL NEWS