మ్యారేజ్ హాల్స్ తెలుసు. ఫంక్షన్ హాల్స్ తెలుసు. కానీ ఈ స్టడీ హాల్స్ ఏంటి.. అద్దెకు దొరకడమేంటి అనుకుంటున్నారా? సర్కారీ నౌకరీ సాధించాలనుకునేవారికి స్టడీహాల్స్ రూట్ చూపిస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు.. లైబ్రరీలు కూడా ఇవ్వలేని ఫలితాలను ఇస్తున్నాయి. కాంపెటీటివ్ ఎగ్జామ్స్ రాసేవారిని రారమ్మని పిలుస్తున్నాయి. ఇవి ఏ ఢిల్లీలోనో కాదు.. మన హైదరాబాద్‌లో కాంపెటీటివ్ స్పిరిట్‌ను నింపుతున్న స్టడీ హాల్స్ కథా కమామీషు తెలుసుకోండి. దిల్సుఖ్నగర్.. అత్యంత రద్దీ ప్రదేశం. షాపింగ్ మాల్స్.. స్టడీ సర్కిల్స్.. కోచింగ్ సెంటర్స్.. సినిమా హాల్స్.. హోటల్స్.. రెస్టారెంట్స్‌తో నిత్యం సందడిగా కనిపిస్తుంది. రకరకాల పనుల మీద ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ఎవరి పని వాళ్లది. ఎవరి పరుగు వాళ్లది. ఆ పరుగుల్ని ఒకసారి జూమ్ చేసి చూస్తే.. పది మందిలో ఏడుగురు విద్యార్థులే ఉంటారు. వీళ్లలో కొందరు చదువుకుంటారు. మరికొందరు చదువుకొంటారు. ఏ జాబ్‌కు ప్రిపేరవ్వాలి? ఏ కోచింగ్ సెంటర్లో ట్రెయినప్ అవ్వాలి? లైబ్రరీకి ఎంత సమయం కేటాయించాలి? అనే ఆలోచనలే వాళ్ల మెదళ్లలో మెదులుతుంటాయి. సమయం ఉదయం 11 గంటలు. చేతిలో మెటీరియల్ పట్టుకొని స్టూడెంట్స్ గుంపుగా వెళ్తున్నారు. ఎక్స్క్యూజ్ మి.. సరూర్‌నగర్ ఎలా వెళ్లాలి అని అడిగితే.. టైం లేదు అన్నట్టుగా ఫేస్ టర్నింగ్ ఇచ్చాడొక అబ్బాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ? దిల్సుఖ్నగర్కి వచ్చేవాళ్లలో చాలామంది సినిమా.. షాపింగ్ అంటూ టైంపాస్ కోసమే వచ్చేవాళ్లు ఎక్కువ అనే అభిప్రాయం పటాపంచలు అయింది. రూట్ కూడా చెప్పే టైం లేదంటే వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిందే కదా? శ్రీనగర్ కాలనీ.. మహారాష్ట్ర బ్యాంక్‌కు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్. కో-స్టడీహాల్ అండ్ రీడింగ్ రూమ్స్ అనే బోర్డ్.. రెంట్ ఎ స్టడీ హాల్ అనే ఫ్లెక్సీ కనిపించాయి. స్టడీ హాల్స్ ఏంటి? రెంట్‌కు ఇవ్వడమేంటి? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దాదాపు 150 మంది సౌకర్యంగా కూర్చుని చదువుకునే హాల్ అది. ఒక్కో విద్యార్థి రుసుము చెల్లించి ఇక్కడే ప్రిపేర్ అవ్వొచ్చు. గ్రూప్-2 ఎగ్జామ్స్ కోసం ఏదైనా కోచింగ్ సెంటర్లో చేరితే షార్ట్ టర్మ్.. లాంగ్ టర్మ్ కోర్సులు ఉంటాయి. షార్ట్ టర్మ్నే తీసుకుంటే నాలుగు నెలలకు లక్ష రూపాయల పైమాటే. పైగా స్టడీ మెటీరియల్ బయటే తీసుకోవాలి. ఖాళీ క్లాసెస్ మాత్రమే వినేసి ఇంట్లోనో.. లైబ్రరీలోనో చదువుకోవాలి. కరెక్ట్‌గా చదువుకుందామనుకునే సమయానికి ఇంట్లో ఎవరో ఒకరు పిలిచి ఏదో ఒక పని చెప్తే ఇక ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? పోటీలో ఎలా నెగ్గగలుగుతాం? సరే ఏదైనా లైబ్రరీలోనైనా చదువుకుందాం అనుకుంటే.. పొద్దున ఎనిమిదింటికే దస్తీ వేసుకొని రెడీగా ఉంటున్నారు. సీటు దొరక్కుంటే ఏ చెట్టు కిందో కూర్చొని ప్రిపేరవ్వాలి. సరే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుందామా అంటే.. అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. కాంపెటీటివ్ స్పిరిట్ ఉన్నవాళ్ల కంటే ఆ అట్మాస్పియర్‌ను దెబ్బతీసేవాళ్లు ఎక్కువగా ఉంటారనేది స్టూడెంట్స్ అభిప్రాయం. ఇన్ని కష్టాలు వెంటాడితే ప్రిపేరయ్యేదెలా? ఉద్యోగం సంపాదించేదెలా? అనుకునేవారికి స్టడీ హాల్స్ మంచి వేదిక. గ్రూప్-2 ఫలితాల్లో చూశారు కదా! ఈసారి చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. డిప్యూటీ తహశీల్దార్లు.. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్.. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వంటి ఉద్యోగాలకు ఎంపికైన వేలాదిమందిలో మనకు తెలిసినవాళ్లు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారి గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనం కూడా కచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అని నిర్ణయించుకున్నవాళ్లు లేకపోలేదు. కాంపెటీటివ్ ఎగ్జామ్స్ రాయాలనే ఆలోచన ఉన్నవారు ఒక్కసారి ఈ స్టడీ హాల్స్‌ను పరిశీలించండి. అవి ఎందుకు? ఏం నేర్పుతాయి? కాంపెటీటివ్లో మీ స్థానం ఏంటి? అసలు పోటీ పరీక్షలకు మీరు సూటబులా? కాదా? వంటి విషయాలన్నీ తెలిసొస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అందరికీ ఉంటుంది. ఆశ ఉన్న అందరూ ఉద్యోగం కోసం చదువుతున్నారా? చదివిన అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? లోపం ఎక్కడున్నది? చదివే చదువులోనా? ఎంచుకున్న సబ్జెక్టులోనా? అవగాహన ఉంటే ఉద్యోగం అందరికీ వస్తుంది. ఇది ఎవరో అంటున్న మాట కాదు.. కాంపెటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్లే చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కొట్టడంలో స్టడీ హాల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నాయనేది వారి అభిప్రాయం. నెలకు రూ.1000 మాత్రమే కో-స్టడీ హాల్ అండ్ రీడింగ్ రూమ్స్‌లో ఏం చెప్తారు? అంటే ఏమీ చెప్పరు. అంతా మనమే నేర్చుకోవాలి. నెలకు రూ.1000 చెల్లించి 24 గంటలూ చదువుకోవచ్చు అంటున్నారు కో స్టడీ నిర్వాహకుడు జలంధర్. ఒక విద్యార్థికి సౌకర్యవంతమైన ఒక కుర్చీ.. టేబుల్.. డెస్క్ ఉంటాయి. ఏసీ సౌకర్యం ఉంటుంది. మంచి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. 24 గంటలు నీటి సరఫరా ఉంటుంది. ప్రిపరేషన్లో సాంకేతికత కూడా ముఖ్యం కాబట్టి ఫ్రీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. సంబంధిత స్టడీ మెటీరియల్.. న్యూస్ పేపర్స్ అందిస్తున్నారు. స్టడీ హాల్స్ ఇప్పటివరకు ఢిల్లీలోనే చూశాం. ఇప్పుడు ఆ ట్రెండ్ హైదరాబాద్‌లో నడుస్తున్నది. ముఖ్యంగా అమీర్‌పేట్.. దిల్‌సుఖ్‌నగర్‌లాంటి ప్రాంతాల్లో ఎన్నో స్టడీ హాల్స్ ఉన్నాయి. ఉద్యోగం సాధించాలి అనుకునేవారికి మేం మంచి అవకాశం కల్పిస్తున్నాం. వేరేవాళ్లు అయితే నెలకు రూ.1500-2000 వరకు వసూలు చేస్తున్నారు. కానీ మేం కేవలం రూ.1000 మాత్రమే తీసుకుంటున్నాం. నేను గత ఇరవై యేండ్లుగా ఎడ్యుకేషన్ బిజినెస్‌లో ఉన్నాను. నేను కూడా కాంపెటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టేజీ నుంచే వచ్చాను. గత పదేండ్లుగా ఫ్యాకల్టీగా చేస్తున్నాను. విద్యార్థులకు ఏం కావాలి? వారి అవసరాలేంటి? ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యేవాళ్లు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లు? వాళ్ల ఆర్థిక స్థోమత ఏంటో తెలిసినవాడిగా చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాం. ఇటీవల వచ్చిన పోటీ పరీక్షల ఫలితాల్లో మా సెంటర్లో ప్రిపేరైన విద్యార్థులూ ఉన్నారు. వాళ్ల విజయంలో మేం భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా.. గర్వంగా ఉంది అన్నారు జలంధర్. లక్ష్యానికి దగ్గరగా.. కోచింగ్‌కి వెళ్లినంత మాత్రాన సబ్జెక్ట్ మీద పూర్తిస్థాయి అవగాహన ఏర్పడదు. కోచింగ్ అనేది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివేవాళ్లకు ఓ రూట్ చూయిస్తుంది. ఆ రూట్ ద్వారా లక్ష్యం చేరుకోవడంలో మాత్రం స్టడీ హాల్స్ ఉపయోగపడుతున్నాయి. కాంపెటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యేవారికి ముందుగా విషయ పరిజ్ఞానం.. సమయస్ఫూర్తి. రీడింగ్ రూమ్స్ వీటిని నేర్పిస్తున్నాయి. ఇక్కడకు వచ్చేవాళ్లంతా కాంపెటీటివ్ స్పిరిట్‌తో ఉన్నవాళ్లే కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ మేరకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టే అవకాశం కల్పిస్తారు. 24 గంటలూ పర్యవేక్షణ ఉంటుంది. చాలామంది వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే ఉంటారు. వేర్వేరు మనస్తత్వాలు కలిగినవారు ఉంటారు. వారందరూ కో-ఇన్సైడ్ అయ్యే అవకాశం ఇక్కడ కల్పిస్తున్నారు. సబ్జెక్టులో డౌట్స్.. గ్రూప్ డిస్కషన్స్ చేసుకునే వీలుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలనుకునేవారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్న కో-స్టడీలో చేరాలనుకుంటే 7842809083 ఫోన్ ద్వారాగానీ.. [email protected] మెయిల్ ద్వారాగానీ సంప్రదించవచ్చు అంటున్నారు జలంధర్.పోటీ వాతావరణంమాది నిజామాబాద్. ఎస్సెస్సీ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నా. కో-స్టడీ నా ప్రిపరేషన్‌కు చాలా ఉపయోగపడుతున్నది. ఇదివరకు హాస్టల్స్‌లో ఉండేదాన్ని. అక్కడ చదువుకునే వాతావరణం లేదు. ఇక్కడ పోటీ వాతావరణం ఉంది. -సౌమ్యఇంటికంటే బెటర్మాది శ్రీకాకుళం. పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చాను. మాది గ్రామీణ వాతావరణమే అయినా ఇంట్లోనే కూర్చుని చదువుకోలేని పరిస్థితి. సిటీలో ఉండి చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అలా ఇంట్లో కూడా చదువుకోవడానికి లేని అవకాశం ఇక్కడ ఉంది. -అలేఖ్య మంచి అవకాశంఫ్యాకల్టీగా చేసిన అనుభవం నన్ను స్టడీ హాల్స్ నిర్వహణవైపు మళ్లించింది. కోచింగ్ కోసం వచ్చి అది అయిపోయాక బస్స్టాండ్లలో కూర్చుని చదువుకున్నవారిని ఎంతో మందిని చూశా. ఇలాంటి వారి కోసమైనా రెంట్ హాల్స్ ఇవ్వాలనుకొని హాల్స్ తీసుకున్నా. 24 గంటలు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చదువుకొనే అవకాశం ఎక్కడుంది? కష్టపడే వారికి కో-స్టడీ మంచి అవకాశం కల్పిస్తుంది. - జలంధర్ -దాయి శ్రీశైలం, సెల్: 8096677035