బ్లేడ్లు అమ్మిన బయర్డ్.. టీవీ పరిశోధన చేశాడు!


Sun,November 17, 2019 02:29 AM

ట్రింగ్.. ట్రింగ్‌మని ఫోన్లు మాత్రమే మోగుతున్న రోజులు. ఊరంతా కలిపి ఒక్కటే టీవీ. ఆదివారం వచ్చిందంటే చాలు.. పొద్దు పొద్దున్నే శుభ్రంగా తయారై వెళ్లిపోయేవాళ్లం. ఏయ్.. ఎటెళ్తున్నావు? అని ఎవరైనా అడిగితే టీవీ చూడ్డానికి అని చెప్పేవాళ్లం. వెళ్లేసరికి.. జనాలు గుంపులుగా కూర్చొని కళ్లప్పగించి టీవీ చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం. టీవీ మెమొరీసే కాదు.. వాటిని మెమొరీస్‌గా మార్చిన టీవీ గురించి.. కనిపెట్టిన వారి గురించి.. వారి కృషి గురించి కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది!

-దాయి శ్రీశైలం, సెల్: 8096677035

John-Logie
టీవీ ఆవిష్కరణలో చాలామంది కృషి దాగున్నది. తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిశోధనలు చేశారు. కొందరి ప్రయోగాలు మరికొందరికి దారికి చూపించినవి అయితే.. మరికొందరికి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం కల్పించాయి. అలాంటి అవకాశాల్ని సీనియర్ల నుంచి అందిపుచ్చుకొని టెలివిజన్ ఆవిష్కర్తల్లో ముఖ్యుడిగా పేరుపొంది టీవీ చుట్టూ పెనవేసుకున్న జ్ఞాపకాలెన్నింటినో మనకు అందించిన పరిశోధకుడు జేయల్ బయర్డ్. పూర్తిపేరు జాన్ లోగీ బయర్డ్. స్కానింగ్ విధానంగా చెప్పుకునే పోల్‌నివ్‌కో ప్రయోగంలో లోహంపై సూర్యకాంతి పడినప్పుడు విద్యుచ్ఛక్తి ఎలా ప్రవహిస్తుంది? కాంతి తీవ్రతలలో తేడాలను బటి విద్యుత్ ప్రవాహం ఎలా మారుతుంది? దీని ద్వారా దృశ్యాన్ని ఎలా ప్రసారం చేయొచ్చు? అనే విషయాలు గ్రహించాడు బయర్డ్. ఆ తర్వాత.. క్రూక్స్ నిర్మించిన కాథోడ్ కిరణ నాళ ప్రయోగాన్ని పరిశీలించాడు. కిరణ నాళంలో ఒకవైపున ఉండే తెరను కొన్ని రసాయనిక పదార్థాలతో పూస్తే దానిపై ఎలక్ట్రాన్‌లు పడినపుడు కాంతివంతమైన చుక్కలు ఏర్పడతాయని బ్రాన్ చెప్పినదాంట్లో నిజమెంత? అని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత.. దృశ్యాల ప్రతిబింబాల్ని నిర్మించడంలో బ్రాన్ నాళం పాత్రను గుర్తించిన పీటర్స్ బర్గ్ పరిశోధనను.. కాంవ్ బెల్- స్వింటన్ కాథోడ్ కిరణ నాళ ప్రసారిణిని గురించి విశ్లేషించుకున్నాడు. ఏదైనా పూర్తిగా అధ్యయనం చేస్తేనే దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. బయర్డ్ విషయంలో కూడా ఇదే జరిగింది. టెలివిజన్‌పై తనకంటే ముందుగా పరిశోధనలు చేసిన వారి సిద్ధాంతాలను చదివింది వాటిని ఫాలో అవడానికి కాదు. వాటిల్లోని సమాచారాన్ని దొంగిలించడానికి అంతకన్నా కాదు. వారి ప్రయోగాలు ఎందుకు చివరికంటూ విజయవంతం కాలేకపోతున్నాయి? లోపం ఎక్కడుంది? పూర్తిస్థాయిలో విజయం సాధించి టెలివిజన్‌ను ఆవిష్కరించడం ఎలా? అని సుదీర్ఘ అధ్యయనం చేశానని బయర్డ్ చాలా సందర్భాల్లో చెప్పాడు.

టెలివిజన్ నిర్మాణంలో ఇలాంటి చాలా సాంకేతిక సమస్యలను పరిష్కరించిన జేయల్ బయర్డ్‌ది స్కాట్‌లాండ్. వాళ్ల నాన్న క్రిష్టియన్ మిషనరీలో పనిచేసేవాడు. పాఠశాల విద్యనంతా స్కాట్‌లాండ్‌లోనే చదివిన బయర్డ్ డిగ్రీలో ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే అతనికొక సమస్య ఉండేది. తరచూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవాడు. ఒకరోజు.. నాన్నా.. ఈ చదువులు నావల్ల కావు. చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు బయర్డ్. తల్లిదండ్రులు కోప్పడ్డారు. చూడు బాబూ.. ఆరోగ్యం బాలేకపోతే కొద్దికాలం విశ్రాంతి తీసుకో. నేను కాలేజీ వాళ్లతో మాట్లాడి లీవ్ ఇప్పిస్తా. అంతేకానీ చదువు ఆపేస్తానంటే ఎలా? అన్నాడు వాళ్ల నాన్న. పిల్లోడు వాడికేం తెలుసు.. వారం పది రోజులు ఇంట్లోనే ఉండనివ్వండి. తర్వాత కోలుకుంటాడు. చదువు పేరు చెప్పి మీరు వాడినేమనకండి అంటుంది బయర్డ్ వాళ్లమ్మ.

లేదమ్మా.. నేను సీరియస్‌గానే చెప్తున్నా. చదువు ఆపేస్తా అన్నాడు బయర్డ్. చదువు ఆపేసి ఏం చేస్తావ్? మనకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? చెప్తే అర్థం చేసుకో అని బయర్డ్‌పై కోప్పడింది వాళ్లమ్మ. నా ఆరోగ్యం బాగయ్యాక.. ఏ పూలు.. పండ్లు అమ్ముకొనైనా బతుకుతా. నా గురించి మీరు ఏమాత్రం బెంగ పెట్టుకోకండి అనడంతో ఇక నీ ఇష్టంరా బాబూ అని నిట్టూరుస్తూ శాంతం అయ్యారు పేరెంట్స్. వారానికోసారైనా టీకా వేయించుకోవాలి బయర్డ్. లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా బయర్డ్.. అతడి తల్లిదండ్రులు జాగ్రత్తపడ్డారు. రోజులు.. వారాలు.. నెలలు.. గడిచాయి. వ్యాధి విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ ఫలించింది. బయర్డ్ కోలుకున్నాడు.

ఇప్పుడే మొదలైంది అసలు సమస్య. ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లలేడు. తల్లిదండ్రులు పంపినా వెళ్లే స్థితిలో అతడు లేడు. ఇంకా వేరే ఏదైనా కోర్సు చేయిద్దామా అంటే అసలు చదువే వద్దనే పరిస్థితిలో బయర్డ్ ఉన్నాడు. చాలా సున్నితమైన విషయం. తల్లిదండ్రులు బాగా ఆలోచించారు. వాడి చదువుకన్నా.. భవిష్యత్తే ముఖ్యం. ఏం చేస్తాడో వాడి నిర్ణయానికే వదిలేద్దాం. విజయం సాధిస్తే కొందరికి పాఠం అవుతాడు. ఫెయిల్ అయితే దాని నుంచి తానే ఓ పాఠం నేర్చుకుంటాడు అని డిసైడ్ అయ్యారు. అమ్మా.. నాన్నా.. నేను డ్యూటీకి వెళ్తున్నా. ఈ రోజు నుంచి స్వశక్తితో సంపాదిస్తా అన్నాడు బయర్డ్. ఏం డ్యూటీ? ఎప్పుడు చూసుకున్నావ్? అన్నారు తల్లిదండ్రులు. మూడ్రోజులుగా దాని గురించే తిరుగుతున్నా. ఓకే అయ్యింది. ఇక నా గురించి మీకు దిగులు అక్కర్లేదు. మన ఏరియాలోని అంగట్లో చిన్న దుకాణం పెడుతున్నా. నారింజ పండ్లు అమ్ముతాను అని చెప్పాడు. ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు ఏమీ అనలేక.. సరే కానియ్ అన్నారు. పొద్దున్నే లేవడం అంగట్లో నారింజ పండ్లు అమ్మడం.. సరకు అయిపోతే తోటల దగ్గరికి వెళ్లి తెచ్చుకోవడం లాంటి పనులతో బయర్డ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఒక్క నారింజ పండ్ల మీదనే ఆధారపడితే ఎట్లా? ఇంకేమైనా అమ్మితే చేతినిండా డబ్బు వస్తుంది కదా? అని సబ్బులు.. బ్లేడ్లు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. బయర్డ్ మళ్లీ మంచాన పడ్డాడు. ఈసారి మలేరియా దాడి చేసింది. వేర్వేరు అనారోగ్య సమస్యలకు దారితీసింది. మళ్లీ మొదట్లో ఎదుర్కొన్న సమస్యలన్నీ ఫేస్‌చేశాడు. కోలుకోవడానికి ఈసారి చాలా సమయం పట్టింది. రోగాన్ని తలుచుకుంటూ కుమిలి పోకుండా దాని నుంచి బయటపడటానికి ఏమైనా ఉపాయం ఉందా అని ఆలోచించాడు బయర్డ్. బాధ నుంచి బయటపడేందుకు ఏదైనా కాలక్షేపం అయితే బాగుండు అనుకున్నాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే టెలివిజన్.
John-Logie1

1922వ సంవత్సరం..
బయర్డ్ మలేరియా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. టెలివిజన్‌పై ఎవరెవరు పనిచేస్తున్నారో అధ్యయనం చేశాడు. అమ్మా.. నాన్నా ఒకసారి ఇలా రండీ అని పిలిచాడు బయర్డ్. మేడమీదున్న గది నాకు కావాలి అన్నాడు. అదెందుకు? అయినా దాంట్లో క్షణం కూడా ఉండలేవు. మురికితో కంపు కొడుతుంది ఆ గదంతా. దాని పేరు కూడా ఈగల గదిగా మారిపోయింది అన్నారు పేరెంట్స్. అది ఈగల పెంటనో.. దోమల పెంటనో నాకు అవసరం లేదు. నేను టెలివిజన్‌ను కనుక్కోవడానికి ప్రయోగాలు చేయాలి. ల్యాబ్ తీసుకొని ప్రయోగాలు చేయడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఈ గదే నాకు ల్యాబ్. అర్థం చేసుకోండి అంటూ బతిమిలాడాడు. సరే నీ ఇష్టం. కానీ అది క్లీన్ చేసుకొని ఉండు అని సూచించారు. అంగట్లో పండ్లు అమ్ముతున్నప్పుడు పరిచయం అయిన ఎలక్ట్రికల్ షాపు నిర్వహకుడి దగ్గరకు వెళ్లి నాకు అర్జెంటుగా ఓ మోటార్ కావాలి అన్నాడు. చూడు బయర్డ్. అమ్మకానికి ఉన్న ఒకే ఒక్క మోటార్‌ను నీకిచ్చి నేను ఈగలు కొట్టుకోవాలా? నీకంతగా కావాలి అంటే ఆ మూలకు ఓ పాత మోటార్ ఉంది తీసుకెళ్లు అని మూలకున్న మోటార్‌ను చూపించాడతను.

ఆ పాత మోటార్‌ను తీసుకెళ్లి చిన్న అట్టముక్క నుంచి నివ్‌కో ఫలకం తయారుచేశాడు. ఇంటిపక్కన ఉన్న సైకిల్‌షాప్‌లో కొన్ని కటకాలను కొన్నాడు. స్టోర్‌లో వాడి పడేసిన పాత వైర్లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు.. సూదులు.. కొయ్యముక్కలు.. లక్క.. దారాలు.. జిగురు.. తీగలు సేకరించి ఆ మురికి గదిని ప్రయోగశాలగా మార్చేశాడు.

రెండేండ్లు గడిచాయి. మేడ దిగి కిందికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తిండి కూడా తింటే తినేవాడు.. లేకపోతే లేదు. అనారోగ్యం రాకుండా మాత్రం జాగ్రత్త తీసుకున్నాడు. నిరంతరం కృషి చేసి కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరందాకా ప్రసారం చేయడంలో బయర్డ్ సక్సెస్ అయ్యాడు. లండన్‌లోని ఓ పెద్ద ఎలక్ట్రిక్ షాప్‌లో దానిని ప్రదర్శించారు. అది చూసిన యజమాని ప్రపంచాన్నే విస్తుగొలిపే అద్భుత ప్రయోగం ఇది. ఇంతమంచి నైపుణ్యం ఉన్న నువ్వు మాలాంటి వారితో కలిసి పనిచేస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు అన్నాడు. మీతో కలిసి పనిచేయాలంటే కుదరదు గానీ.. కొంతకాలం పాటు మీ షాపులో నేను రూపొందించిన టీవీని ప్రదర్శించుకోవడానికి ఒప్పుకుంటాను అనగా వ్యాపారి సరేనన్నాడు. రోజుకు మూడుసార్లు ఆ పరికరాన్ని ప్రదర్శించారు. ఇంకా పూర్తికాని ఈ టీవీని ఇలా ఓ షాపులో రోజూ ప్రదర్శిస్తూ వెళ్లే అపకీర్తి పాలవ్వడమే తప్పితే పెద్దగా ప్రయోజనం లేదని భావించిన బయర్డ్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. తన పరికరాన్ని తీసుకొని మళ్లీ తన గదిలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.
1925లో ఒక అబ్బాయి ముఖాన్ని ప్రసారం చేశాడు. ఆ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూశాడు. కొన్ని నెలల తర్వాత తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకు.. మీడియాకు తెలియజేసి ప్రదర్శించాడు. బయర్డ్ పరికరంలో స్కానింగ్.. ప్రతిబింబ పునర్నిర్మాణం యాంత్రిక పద్ధతిలో చేయడం వల్ల నమూనా కాస్త మొరటుగా.. లోపభూయిష్టంగానూ ఉండేది. తొలిదశలో ప్రసారిణిని రిసీవర్‌కి తీగల ద్వారా సంధించాడు. ఒకట్రెండు సంవత్సరాల తర్వాత రెండింటికీ మధ్య తీగలు లేకుండా వైర్‌లెస్ పద్ధతిని ఫాలో అయ్యాడు. రిసీవర్‌లో కనబడే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని ప్రసార దూరం క్రమంగా ఎక్కువ చేయాలనీ బయర్డ్ కృషిచేశాడు. తన పరిశోధనల్లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ భాగస్వామి కావాలని అతడెంతగానో ఆకాంక్షించాడు. ఎన్నో ఆటంకాలు ఏర్పడినా 1929లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ బయర్డ్ రూపొందించిన టెలివిజన్‌తో కార్యక్రమాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. అధికారికంగా లండన్‌లో 1936వ సంవత్సరం టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి. వారంపాటు బయర్డ్ పద్ధతిలో.. మరోవారం ఇంకో పద్ధతిలో ప్రసారం చేశారు. అంత కష్టపడి టెలివిజన్‌ను రూపొందిస్తే ఆపేయడమే కాకుండా వేరే ఇతర ఫెయిల్యూర్ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నారని మనస్తాపం చెందాడు. తన సిద్ధాంతం గొప్పతనమేందో అందరికీ తెలియజేస్తా అని మరిన్ని పరిశోధనలు చేస్తూనే బయర్డ్ తన 58వ ఏట కన్నుమూశాడు.

ఈ రోజు బయర్డ్ లేడు. కానీ ఆయన అందించిన టీవీ మాత్రం ఉంది. చదువు మధ్యలోనే ఆపేసినా.. అనారోగ్యం అడుగడుగునా వెంటాడినా.. వెక్కిరింపులు.. ఈసడింపులు పెరిగిపోయినా బయర్డ్ మాత్రం భయపడలేదు. జీరోగా ఉండి టీవీ ప్రసారాలను ప్రజలకు చేరవేసి హీరో అయ్యాడు. టీవీ చుట్టూ పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలను మనకు అందించాడు. అంగట్లో బ్లేడ్లు.. సబ్బులు.. పండ్లు అమ్ముకున్న బయర్డ్ టీవీ పరిశోధన చేయాలని సంకల్పించి ఏండ్ల తరబడి కష్టపడి విజయం సాధించాడు. అద్భుతాలు సృష్టించాలంటే ఉండాల్సింది సొమ్ము కాదు.. సోయి అని నిరూపించాడు.

అధికారికంగా లండన్‌లో 1936వ సంవత్సరం టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి. వారంపాటు బయర్డ్ పద్ధతిలో.. మరోవారం ఇంకో పద్ధతిలో ప్రసారం చేశారు. శత్రు విమానాలు లండన్‌లో చేరడానికి టెలివిజన్ తరంగాలు ఉపకరించవచ్చనే కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే టెలివిజన్ ప్రసారాలను బ్రిటన్ నిలిపి వేసింది.

ఈ రోజు బయర్డ్ లేడు. కానీ ఆయన అందించిన టీవీ మాత్రం మనకు వినోదం పంచుతున్నది. సమాచారం చేరవేస్తున్నది. చదువు మధ్యలోనే ఆపేసినా.. అనారోగ్యం అడుగడుగునా వెంటాడినా.. వెక్కిరింపులు.. ఈసడింపులు పెరిగిపోయినా బయర్డ్ మాత్రం భయపడలేదు. జీరోగా ఉండి టీవీ ప్రసారాలను ప్రజలకు చేరవేసి హీరో అయ్యాడు. టీవీ చుట్టూ పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలను మనకు అందించాడు.

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles