అన్నదాత.. అంకురాలు


Sun,November 17, 2019 01:09 AM

పెండ్లి కూతురుకి.. అబ్బాయికి ఎన్ని ఎకరాల భూమి ఉందో కావాలి. పెండ్లి కొడుక్కి.. కట్నం కింద ఎన్ని ఎకరాల భూమి ఇస్తారో తెలియాలి. పిల్లలకు.. భవిష్యత్ కోసం ఎంత భూమి ఉందో చెప్పాలి. పెద్దలకు.. ఎకరం భూమి ఎంత పలుకుతుందో కావాలి. కామన్‌గా వీరందరికీ భూమి కావాలి. మార్కెట్లో వాటికి మంచి రేటు రావాలి. వీరి జీవితానికొక భరోసా ఉండాలి. కానీ.. ఏ ఒక్కరికీ వ్యవసాయం వద్దు. అంతెందుకు ఆఖరికి ఉద్యోగం చేయాలనుకునేవారికి అగ్రికల్చర్ కోర్స్ కావాలిగానీ అగ్రికల్చర్ పని మాత్రం వద్దు. ఇలా అయితే కోట్లాది జనాభాకు ఆహారం ఎలా దొరుకుతుంది? ఉద్యోగాలు కాదు.. అగ్రికల్చర్‌ను అంకుర సంస్థగా తీర్చిదిద్దండి అని జయశంకర్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సదస్సులో భారత వ్యవసాయ పరిశోధన మండలి పిలుపునిచ్చిన సందర్భంగా అంకుర
సేద్యం గురించి తెలుసుకుందాం.

-దాయి శ్రీశైలం, సెల్: 9182777035

సిమ్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఓ జాతీయ రహదారి పొడవునా ఎప్పుడూ రెండు మూడు వందల కార్లు కనిపిస్తుంటాయి. ఎంతో అందంగా పేర్చినట్టు.. ఏదో సినిమా షూటింగ్ సెట్ వేసినట్టు కార్లన్నీ వరుసలో ఉంటాయి. చూసేవారికి వింతగా.. విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కార్లు ఉన్నది ఏ పార్కింగ్ ప్రదేశాల్లోనో కాదు.. రైతులు సాగు చేసుకునే పంట పొలాల్లో. పంటలేసుకొనే భూముల్లో కార్లు నిలిచివుంటే రైతులు ఏమంటలేరా? అనే సందేహం వస్తుంది కదా? ఐతే.. ఇక్కడ రైతులే తమ భూముల్ని వారికి అప్పగించారు. వాళ్లంతా సన్న.. చిన్నకారు రైతులు. రోజంతా కష్టపడి పనిచేసి ఆర్నెళ్లకోసారి వచ్చే పంటతో కుటుంబాన్ని పోషిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారి జీవితాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. అది వాళ్ల కల్చర్ కూడా. అంతగా ప్రేమించిన వ్యవసాయాన్ని చూసి వారు జంకుతున్నారు. మాకొద్దీ వ్యవసాయం అని చేతులెత్తేసి మారుతీ సుజుకీ డీలర్ గోయల్ మోటార్స్ వారికి కార్ల పార్కింగ్ కోసం పచ్చని భూముల్ని లీజుకిచ్చారు.
Former

ఎందుకు?

ఏండ్లతరబడి.. అడవి పందులు.. కోతులు.. దుప్పులు వారు సాగుచేసుకున్న పంటల్ని నాశనం చేస్తున్నాయి. ప్రతీ పంటకు పెట్టుబడికి పెట్టిన డబ్బులు కూడా రావడం లేదు. పైగా అప్పులు అవుతున్నాయి. ఇలా పంటలు వేసి నష్టపోవడం కంటే వేరే పనేదైనా చూసుకోవడం మంచిది అనుకుని పంట భూముల్ని లీజుకు ఇచ్చేందుకు అంగీకరించారు. ఒక్క కారు పట్టే స్థలానికి నెలకు రూ.100 వసూలు చేస్తున్నారు. వందల సంఖ్యలో కార్లు ఉండటంతో గిట్టుబాటు బాగానే అవుతుందని రైతులు ఆనంద పడుతున్నారు. కోతులను చెదరగొట్టేందుకు పగటిపూట పంట చేలకు కాపలా ఉండేవాళ్లం. కానీ రాత్రి సమయాల్లో అడవి పందులు వచ్చి చేలను నాశనం చేస్తుండేవి. పెట్టిన డబ్బులు కూడా వచ్చేవి కావు. కార్ల పార్కింగ్ కోసం భూమిని ఇవ్వడం వల్ల నెలనెలా చేతికి డబ్బులొస్తున్నాయి. ఆ బాధలు తప్పాయి. భూమిని కోతుల పాలు చేయడం కంటే.. లేదా ఖాళీగా వదిలేయడం కంటే మాకు ఇదే మంచిగనిపిస్తున్నది. అయినా ఒకమాట. వ్యవసాయాన్ని దూరంగా పెట్టడం మాకు ఇష్టం లేదు. పెట్టుబడి లేకుండా ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా అనేది రైతుల ఆవేదన.
Former1

సిమ్లాలోని ఈ రైతుల పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది?

వ్యవసాయం ఎలాంటి ప్రమాదపుటంచుల్లో ఉన్నదో అర్థమవుతుంది. ఇది ఒక్క సిమ్లా పరిస్థితి మాత్రమే కాదు. దేశం ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది కీలకపాత్ర. దేశ జనాభాలో 57% మంది వ్యవసాయం చేస్తున్నారు. సిమ్లాతో పాటు మిగతా రాష్ర్టాల్లో సాగు కరువుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నది. ఇక తెలంగాణలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో 60% మంది పనిచేస్తున్నారు. అయితే తెలంగాణతో పాటు మిగతా రాష్ర్టాల్లో యువ రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వ్యవసాయం అంటే చదువుకోని వారు చేసే పని అనే అపోహ ఇప్పటికీ ఉన్నది. ఒక పోలీస్ అధికారి కొడుకు నాన్నలా పోలీస్ కావాలి అనుకుంటాడు. ఒక టీచర్ కొడుకు టీచర్ కావాలి అని ఆకాంక్షిస్తాడు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కోర్సు చదవాలి అని కలగంటాడు. కానీ ఒక రైతు కొడుకు రైతు కావాలి అని మాత్రం అనుకోడు. కొడుకే కాదు.. తండ్రి కూడా ఆ కోణంలో ఆలోచించడు.

ఎందుకు?

వ్యవసాయం అంటే చిన్నచూపా? లేక వ్యవసాయం లాభసాటి కాదనుకుంటున్నారా? ఈ పరిస్థితి పోగొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే రైతే రాజవుతాడు? ఎలా చేస్తే వ్యవసాయం రైతుకు ఫలసాయం అవుతుంది? ఇదొక యదార్థ ఘటన. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన రైతు బానోతు నాగులు. యాభైయేండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రోజు.. ఇల్లంతా సందడిగా ఉంది. బంధువులు.. స్నేహితులతో కళకళలాడుతున్నది. ఇంటిముందున్న వేదికపై దంపతులు దండలు మార్చుకుంటున్నారు. అతిథులంతా చప్పట్లు కొడుతున్నారు. ఐతే.. అది షష్టిపూర్తి మహోత్సవమో.. వివాహ వార్షికోత్సవమో కాదు. ఒక రైతు రిటైర్మెంట్ వేడుక. అవును. వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమమే. పది కాదు.. ఇరవై కాదు.. యాభైయేండ్లుగా భూమినే నమ్ముకొని వ్యవసాయ ఉత్పత్తులను సమాజానికి అందించిన రైతు అతను. ఇంతకూ ఆ ఫంక్షన్ చేస్తున్నది ఏ అగ్రికల్చర్ ఆఫీసరో లేక ఇంకే రెవెన్యూ అధికారో కాదు. ఆ రైతు కన్న కొడుకులే అతడికి సన్మానం చేస్తున్నారు. వ్యవసాయం చేసి తమను పెంచి.. పెద్ద చేసి చదివించి.. ప్రయోజకుల్ని చేసినందుకు. వ్యవసాయాన్ని కాపాడినందుకు. వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన ఉన్న నాగులు పంటను కంటికి రెప్పలా కాస్తూ మంచి దిగుబడి సాధించాడు. ముగ్గురు కొడుకుల్ని బాగా చదివించాడు. ప్రయోజకుల్ని చేశాడు. పెద్ద కొడుకు రాందాస్ విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్. రెండో కొడుకు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మూడో కొడుకు ఎంఏ బీఈడీ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు విశ్రాంతి ఇవ్వద్దా? ఇంకెన్నాళ్లు వారితో పని చేయించుకుంటాం? అని ముగ్గురు కలిసి ఆలోచించారు. వ్యవసాయ విరమణ రైతు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసి ఇటు తండ్రి శ్రమను.. అటు వ్యవసాయం గొప్పదనాన్ని సమాజానికి తెలిసేలా చేయాలని సన్మానించారు. అంతేకాదు.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకూ సిద్ధమయ్యారు. తమ ఉనికికి కారణమైన వ్యవసాయాన్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నారు. ప్రేమించడం అంటే ఇక్కడ.. ఎకరాల కొద్ది ఉన్న భూమి విలువను చూసి మురిసిపోవడం కాదు. ఆ భూమిలో సాగు చేసి చక్కని దిగుబడి సాధించడం. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి నలుగురిని ఆ దారిలో నడిపించడం.
Former2

రైతు కథ..

ప్రతి ఇంటా వ్రతంలా జరిగితేనే వ్యవసాయం సంతోషంగా సాగుతుంది. వ్యవసాయం మోటుపని అనే భ్రమల్లో నుంచి బయటకు వచ్చి ఇది రాయల్ డ్యూటీ అని భావించే స్థితికి రైతాంగాన్ని తీసుకొస్తే నేటితరాన్ని అగ్రికల్చర్‌లోకి అడుగులు వేయించొచ్చు. కాబట్టి ముందుగా మనం వ్యవసాయం గురించి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి. పొద్దున లేచింది మొదలు అందరూ రైతునే కీర్తిస్తారు. మరి ఆ రైతు పరిస్థితి నానాటికి ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి కదా? వర్షాలు ఎక్కువ వచ్చినా కష్టమే. అసలే రాకున్నా కష్టమే. దీంతో సాగు కత్తిమీద సాము కావడం దానికితోడు రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల భూములకు రెక్కలు వచ్చి ఏటేటా వ్యవసాయం చేసేవారి సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నది. 2020 సంవత్సరం పూర్తయ్యేనాటికి ఒక రైతు సరాసరి సాగు భూమి 68% హెక్టార్లకు పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా జరిగితే వ్యవసాయంలో వార్షికవృద్ధి 4% సాధించడం చాలా కష్టం. వ్యవసాయంపై ఆసక్తి తగ్గడం వల్ల దేశ ఆహార భద్రతకు పెను సవాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి యువత వ్యవసాయానికి జవసత్వాలు అందించాల్సిన అవసరం ఉంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి సాగును బాగు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
Former3

ఇప్పటి వరకు..

వ్యవసాయం ఒక జీవన విధానంగా.. సంప్రదాయంగా.. ప్రజల సంస్కృతిగా ఉన్నది. ఇకపై దాన్ని ఆర్థిక జీవన విధానానికి రూపంగా.. వాణిజ్య వనరుగా తీర్చిదిద్దాలి. ఇతర రంగాల్లో మాదిరిగా వ్యవసాయంలో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ రంగాన్ని బతికించడంతోపాటు ఆర్థిక పరిపుష్ఠి సాధించవచ్చు. డబ్బు సంపాదించడంతోపాటు ఆ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చు. అందుకోసం ఆధునిక వ్యవసాయం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ కోర్సులను అభ్యసించడం.. అధ్యయనం చేయడం వల్ల ఆధునిక వ్యవసాయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. వ్యవసాయంలో అవలంబించాల్సిన మెళకువలు తెలుస్తాయి. వ్యవసాయాన్ని వాణిజ్య రంగంగా ఎలా తీసుకెళ్లాలో తెలుస్తుంది.

వాణిజ్య వ్యవసాయమంటే?

భారత వ్యవసాయ పరిశోధన మండలి తీసుకొస్తున్న కొత్త విధానం ఇది. దీని ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి యువతను వ్యవసాయ రంగంలోకి ఆకర్షించాలన్నది మండలి ఆలోచన. ఎలా చేయాలి? ఏం చేయాలి? అని క్షేత్రస్థాయి అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. అందుకోసం ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌత్ ఇండియా అంశంపై సదస్సు నిర్వహించింది. స్టార్టప్‌లు.. పెట్టుబడుల ద్వారా యువత వ్యవసాయరంగంలోకి రావడం వల్ల వ్యవసాయాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయొచ్చు అని భారత వ్యవసాయ పరిశోధనా మండలి సూచించింది. అగ్రికల్చర్‌పై అధ్యయనం చేసి స్టార్టప్‌లు రూపొందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అగ్రికల్చర్ కోర్సులు చదువుతున్నది ఉద్యోగాల కోసం కాదని.. అంకుర పరిశ్రమలు రూపొందించి అభివృద్ధి సాధించడానికి అంటూ అవగాహన కల్పిస్తున్నది. అందుకోసం శిక్షణా తరగతులు కూడా నిర్వహించి నవతరం రైతులను తయారుచేసేందుకు శ్రీకారం చుట్టింది.
Former4

అగ్రికోర్సులు ఎందుకు?

అగ్రికల్చర్ కోర్సులు చేయడం వల్ల వ్యవసాయంలో అధునాతన సాంకేతిక అంశాలపై నైపుణ్యం పెంపొందుతుంది. శాస్త్రవేత్తలతో, విస్తరణాధికారులతో నేరుగా సంప్రదించి మెరుగైన వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు సమిష్టిగా పనిచేయడానికి రైతులకు వ్యవసాయ ఇతర అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, చేపల పెంపకం వంటి వాటిలో అవగాహన ఏర్పడుతుంది. ముఖాముఖి చర్చలు, అనుభవ భాగస్వామ్యం ఏర్పడుతుంది. విత్తనశుద్ధి, సేద్య పద్ధతులు, పోషక లోపాలను గుర్తించడం, చీడపీడల నివారణ వంటి పద్ధతుల్లో నైపుణ్యం పెంపొందుతుంది. యువరైతుల్లో సమిష్టితత్వం పెంపొంది వ్యవసాయ సమాచారం విస్తరింపచేయవచ్చు. నూతన సాంకేతిక విజ్ఞానం తెలుసుకోవడం వల్ల దిగుబడులను పెంపొందించవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఖర్చులను తగ్గించుకొని ఆదాయం ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది. విలువ ఆధారిత ఉత్పత్తులను గ్రామస్థాయిలో చేపట్టి ఆర్థికంగా.. సామాజికంగా పరిపుష్టి కావడంపై అవగాహన ఏర్పడుతుంది.

సాధ్యమవుతుందా?

అవుతుంది. మిగతా దేశాల్లో సాధ్యమవగా మన దగ్గర ఎందుకు కాదు? 2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని ఒక అంచనా. అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా మారబోతున్నది. మరి అంతమంది ఆహార అవసరాలు ఎలా తీరుతాయి? పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా ఉండాలి కదా? డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలంటే టెక్నాలజీని వినియోగించుకొని యువత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. 1930లో ఒక అమెరికన్ రైతు సగటున నలుగురు వ్యక్తులకు సరిపడా ఆహారం పండించేవాడు. 1970 నాటికి ఆ సంఖ్య నలుగురి నుంచి 73 మందికి పెరిగింది. 2019 వచ్చేసరికి ఆ సంఖ్య 73 నుంచి 155 మందికి చేరింది. అంటే డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయడం సాధ్యమైంది అన్నట్టు కదా? ఒక అమెరికా చేసి చూపెట్టింది.. మరి ఇండియా ఎందుకు చేసి చూపించదు? వ్యవసాయమే ప్రధాన వృత్తి గల ఇండియాలో అమెరికా స్థాయి మార్పులు జరిగితే ఆహార కొరతే ఉండదు. అమెరికా సాధించడానికి ముఖ్య కారణం సాంకేతికత. వ్యవసాయం.. వ్యవసాయ అనుబంధ సాగు పద్ధతులను అంకుర పరిశ్రమలుగా మార్చారు. శాస్త్ర సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందితే.. అంతే వేగంగా స్టార్టప్‌లను రూపొందించి వ్యవసాయానికి వాణిజ్య రుచి చూపించారు. మంచి మార్కెటింగ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. డేటా ఎనలిటిక్స్‌ను కీలకంగా వినియోగిస్తున్నారు. అగ్రి స్టార్టప్‌లు మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. అయితే వాటి సంఖ్య.. పనితీరు.. ఫలితం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. స్టార్టప్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి సాగుకు దిశానిర్దేశం చేస్తేనే వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో వ్యవసాయం దాదాపు డిజిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే జాగృతం కావాల్సిన అవసరం ఉంది.
Former5


Khethi Next

ప్రారంభం: 2017
కేంద్రం: హైదరాబాద్
ఉద్దేశం: డిజిటల్ వ్యవసాయం
ఇది వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తక్కువ ఖర్చుతో సాగు, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం, డిమాండ్‌ను సృష్టించడం, అధిక మార్జిన్లలో ఉత్పత్తుల అమ్మకాలను సులభతరం చేసి రైతు కేంద్రీకృత అనువర్తనం వంటి ఫెసిలిటీస్ ఈ స్టార్టప్ కలిగిస్తుంది. వ్యవసాయ నిపుణుల విలువైన సూచనలు, ఆర్థిక సంస్థలతో అనుసంధానం వంటి అవకాశాలు కల్పించి వ్యవసాయం పట్ల యువతను
ఆకర్షింపజేస్తుంది ఈ స్టార్టప్.

Agrow Book

ప్రారంభం: 2015, కేంద్రం: హైదరాబాద్
ఉద్దేశం: రైతులతో ముఖాముఖి
ఇదొక సోషల్ నెట్‌వర్కింగ్ స్టార్టప్. రైతుల జాబితా దీంట్లో పొందుపరుస్తారు. రైతాంగానికి సంబంధించిన ఈవెంట్లు, ఎగ్జిబిషన్లకు రైతులను పంపిస్తుంది. ఆయా ఫోరమ్‌లలో చర్చించడానికి అనుమతి కల్పిస్తుంది. ఎరువులు, విత్తనాలు, డీలర్ల మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తుంది. రైతుల అభిప్రాయ సేకరణ, నిపుణుల సూచనలు దీంట్లో పొందుపరుస్తారు.
Former6


Agri Life

కేంద్రం: హైదరాబాద్
ఉద్దేశం: బయో ఫర్టిలైజర్ ఉత్పత్తి
అగ్రో కెమికల్స్ తయారుచేసే స్టార్టప్ ఇది. బయో యాక్టివ్ ఎరువులు ప్రధానంగా తయారుచేసి వ్యవసాయాన్ని చీడపీడల రహిత రంగంగా తీర్చిదిద్దాలనేది ఈ సంస్థ ఉద్దేశం. రూ.10 కోట్ల పెట్టుబడితో ఈ స్టార్టప్ ఏర్పాటైంది. నెలకు 150 టన్నుల బయో
ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేస్తూ ఇండియాలోనే కాకుండా 35% ఆస్ట్రేలియా, యూరోపియన్, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తుంది.

Krishi Yog

ప్రారంభం: 2017, కేంద్రం: హైదరాబాద్
ఉద్దేశం: వ్యాధుల నివారణ
ఇదొక అగ్రి బిజినెస్ స్టార్టప్. వ్యవసాయంలో Enterprise Resource Planningను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాలని ఈ స్టార్టప్ కృషి చేస్తున్నది.

Good Seeds

ఏర్పాటు: 2012,
కేంద్రం: హైదరాబాద్
ఉద్దేశం: సేంద్రియ ఉత్పత్తులు
పెట్టుబడి ఎడాపెడా పెట్టినంత మాత్రాన దిగుబడి లాభసాటిగా ఉండదు. సాంప్రదాయ మూస పద్ధతుల్లో కాకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఆశించిన లాభాలు పొందవచ్చని చెప్తున్నది గుడ్‌సీడ్స్ స్టార్టప్. సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించి వారిని ఆ దిశగా పోత్సహిస్తూనే సేంద్రియ ఉత్పత్తులే మనల్ని కాపాడుతాయని ప్రజలకూ అవగాహన కల్పించడం ఈ స్టార్టప్ ఉద్దేశం.

ఉజ్వల భవిష్యత్: వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచం ఉన్నంతకాలం భవిష్యత్ ఉంటుంది. రెడీమేడ్ ఫుడ్స్, ఇన్‌స్టంట్ మిక్స్‌ల తయారీలో స్టార్టప్స్ కచ్చితంగా నిలబడతాయి. జీరో బడ్జెట్, నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ఉత్పత్తుల ప్యాకింగ్, నిల్వ, ఎగుమతిలో స్టార్టప్‌ల అవసరాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్, చదువుకున్న యువత వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. ఈ క్రమంలో మొబైల్ బేస్డ్ యాప్స్ వారికి తక్షణ సాగు సమాచారాన్ని అందిస్తాయి. ప్రత్యేకించి తెలంగాణలో పసుపు, ఎండు మిరప అవసరం కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. ఇతర రాష్ర్టాలు, దేశాల్లో భారీ గిరాకీ ఉంది. వీ టికి విలువల జోడింపు, ఆర్గానిక్ పురుగుల మందుల అవశేషాలు లేకుండా ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్‌లో స్టార్టప్ కంపెనీలకు మేలైన భవిష్యత్ ఉంది.
డాక్టర్ పిడిగెం సైదయ్య, శాస్త్రవేత్త

విదేశాల్లోని ఫేమస్ అగ్రి స్టార్టప్స్Win Field

ఎక్కడ: అమెరికా
ఉద్దేశం: ఆరోగ్యవంతమైన పంటలు
అమెరికాకు చెందిన ఈ సంస్థ వర్చువల్ రియాలిటీని అగ్రికల్చర్‌కు అనుసంధానం చేసి ఒక మొక్క ప్రతి అణువునూ పరీక్షించి.. దాని ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసింది. డ్రోన్ల సాయంతో పంటచేలను
త్రీడీ ఫొటోలు తీసి.. వాటిని సెన్సార్లతో పరీక్షించి మొక్కల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు.

Drop Crafter

ఎక్కడ: ఎల్‌సాల్వడోర్
ఉద్దేశం: మిత్ర కీటకాలను రక్షించడం
పంట ఉత్పత్తిలో సహాయపడే తేనెటీగలు.. సీతాకోక చిలుకలు వంటి మిత్ర కీటకాలు అంతరించిపోకుండా ఈ స్టార్టప్ కాపాడుతుంది. డ్రోన్ సహాయంతో పంట చేల మీద 10 అడుగుల ఎత్తులో తిరుగుతూ పుప్పొడి రేణువులను చల్లుతారు. గంటకు 40 ఎకరాల చెర్రీ తోటను
పూర్తి చేస్తుంది.

దేశంలో వ్యవసాయాభివృద్ధి కోసం మళ్లీ మూలాల్లోకి వెళదాం అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ మాట అన్నారు. అంటే ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది? దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనే కదా? అవును ఆమె ఉద్దేశం కరెక్టే అయి ఉంటుంది. వ్యవసాయం బాధ్యత యువత తీసుకోకపోతే ఇండియా వెనకబడ్డట్లే. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని దేశాలన్నీ స్టార్టప్‌ల బాట పట్టి వ్యవసాయాన్ని వాణిజ్య పరంగా మంచి అభివృద్ధి చేశారు. వియత్నాం, మయన్మార్, బ్రెజిల్ దేశాల్లోనూ ఆధునిక వ్యవసాయం ఊపందుకుంటున్నది. జపాన్ అయితే వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనేది జపాన్ ఉద్దేశం. సాంకేతికత ద్వారా 2050 నాటికి దేశీయ ఆహార అవసరాల్లో కనీసం 55% సొంతంగా తీర్చాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి.. భూమి.. భూమి అంటూ భూతాపం పెంచుకున్న మనం ఆ ప్రేమను అలాగే ఉంచుకొని.. అగ్రికల్చర్‌పై అవగాహన ఏర్పరచుకొని.. డిజిటల్ వ్యవసాయమో.. సాంకేతిక సాగో ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో స్టార్టప్‌ల ద్వారా.. పెట్టుబడుల ద్వారా వ్యవసాయాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేయాలని ఆశిద్దాం. జై కిసాన్.!!

762
Tags

More News

VIRAL NEWS