చిన్నారి బొమ్మకు మ్యాచింగ్ డ్రెస్సులు


Sun,January 12, 2020 12:11 AM

DollPatterns

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ? అడిగింది టీచర్.
నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మా..
నా బెస్ట్ ఫ్రెండ్ మా తమ్ముడూ
నా బెస్ట్ ఫ్రెండ్ మా చెల్లీ .. చెపుతూ వెళ్తున్నారు పిల్లలంతా...ఓ పాప లేచి నా బెస్ట్ ఫ్రెండ్ నైసి అంటూ తన బొమ్మ పేరు చెప్పింది. అవునా అయితే నీ బెస్ట్ ఫ్రెండ్‌ని రేపు స్కూల్‌కు తీసుకొస్తావా? అని అడిగింది టీచర్.. తెస్తాను టీచర్ అంటూ కూర్చుంది ఆ పాప.. అనుకున్నట్టుగానే మరుసటి రోజు నైసీని తీసుకొని వచ్చింది ఆ పాప.. చూడ ముచ్చటగా ఉన్న ఆ బొమ్మను, ఆ పాపను చూసి ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నైసీ డ్రెస్, ఆ పాప డ్రెస్ అచ్చం ఒకేలా ఉన్నాయి.

పిల్లలకు బొమ్మలంటే ఇష్టం. తల్లి, బిడ్డను చూసుకున్నట్టే పిల్లలు బొమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటారు. దానికో పేరు పెట్టుకుంటారు. ముద్దుగా పిలుచుకుంటారు. స్నానం చేయిస్తారు. తలదువ్వుతారు. ప్రేమగా పలకరిస్తారు. ఇలా బొమ్మలు పిల్లల బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. వీళ్ల ఇష్టాలకు అనుగుణంగానే మార్కెట్‌లో బొమ్మలు కూడా అలానే దొరుకుతున్నాయి. రంగు రంగుల డ్రెస్సులు, ఆకర్షణీయమైన ఆభరణాలతో బొమ్మలు వస్తున్నాయి. మొదట్లో కేవలం మిల్కీ సిన్ బొమ్మలే కనిపించేవి తర్వాత వాటికి స్కట్లు, గౌన్లు వచ్చాయి. అవి పిల్లల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. అలా కొన్ని రోజుల తర్వాత ట్రెండ్ మారింది. ఒక్క డ్రెస్ ఉన్న బొమ్మ ప్యాక్ రెండు, మూడు రకాల డ్రెస్సులు, ఆభరణాలు వచ్చి చేరాయి. పిల్లలకు తమకు నచ్చిన డ్రెస్ బొమ్మకు వేయటం అలవాటైంది. ఒకటి కాకపోతే ఇంకో డ్రెస్ తొడుగుతూ పిల్లలు సంబురపడతారు. అయితే ట్రెండ్ ఇప్పుడు మారింది కదా? పిల్లలు ఏం కోరుకుంటున్నారు. అచ్చం తన డ్రెస్ లాంటిదో, తమ్ముడి డ్రెస్ లాంటిదో తన బొమ్మకూ ఎందుకు ఉండకూడదని బుజ్జి బుజ్జిగా అడుతున్నారు. వాళ్ల కోరిక సరే. మరి నిజంగా అలా దొరుకుతాయా? పాపకు, పాప బొమ్మకు ఒకే రకమైన డ్రెస్ ఎలా తీసుకురావాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆన్‌లైన్ స్టోర్‌లలో అదే హవా నడుస్తున్నది. పిల్లల డ్రెస్‌లు, బొమ్మల డ్రెస్‌లు అచ్చం ఒకేలా ఉండేవి దొరుకుతున్నాయి. అమెరికన్ గర్ల్, డాలీ అండ్ మీ, కోహుల్స్, ఈస్టీ, అమెజాన్ సైట్లలో ఈ రకమైన డ్రెస్సులు ఉన్నాయి. పిల్లలకు కొన్న డ్రెస్సులే, బొమ్మలకూ మ్యాచింగ్‌గా ఉండే మరో జతను అందిస్తున్నాయి. సైజుల వారీగా మీడ్డీలు, స్కట్లు, ఫ్రాక్‌లు ఉన్నాయి. ఒకే రకమైన బ్రాండ్, వివిధ రకాల సైజులతో ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఓసారి చూడండి.
DollPatterns1

334
Tags

More News

VIRAL NEWS