ఎలక్ట్రిక్‌ చేతక్‌ను లాంచ్‌ చేసిన బజాజ్‌ ఆటో.. ధర ఎంతంటే..?


Tue,January 14, 2020 02:08 PM

బజాజ్‌ ఆటోమొబైల్స్‌ కంపెనీ తన నూతన చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఇవాళ లాంచ్‌ చేసింది. ఒకప్పుడు ఎంతో పాపులర్‌ అయిన చేతక్‌ను మార్పులు చేసి ఆధునిక హంగులతో కొత్త ఎలక్ట్రిక్‌ చేతక్‌ (ఇ-చేతక్‌)ను బజాజ్‌ ఆటో విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూం ధర రూ.1 లక్షగా నిర్ణయించారు. ముందు భాగంలో ఈ స్కూటర్‌కు డిస్క్‌ బ్రేక్‌ను అందిస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ చేతక్‌ను ఆకట్టుకునే రంగులు, డిజైన్‌తో తీర్చిదిద్దారు. వెనుక భాగంలో ఎల్‌ఈడీ బ్లింకర్స్‌ ఉంటాయి. ముందు భాగంలో హార్స్‌ షూ ఎల్‌ఈడీ హెడ్‌ లైట్స్‌ను ఏర్పాటు చేశారు. కీ అవసరం లేకుండానే దీన్ని ఆపరేట్‌ చేయవచ్చు. ఈ స్కూటర్‌ పూర్తిగా మెటల్‌ బాడీని కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో 3 కిలోవాట్‌ అవర్ల బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఐపీ 67 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్కూటర్‌పై ప్రయాణించవచ్చు. ఇక ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే ఎకో మోడ్‌లో ఈ స్కూటర్‌పై 95 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. అదే స్పోర్ట్స్‌ మోడ్‌లో అయితే 85 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ స్కూటర్‌లో అందిస్తున్న బ్యాటరీ లైఫ్‌ 70వేల కిలోమీటర్లని బజాజ్‌ కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది. అయితే కేవలం 1 గంటలోనే 25 శాతం వరకు చార్జింగ్‌ అవుతుంది.

ఇక ఏ స్కూటర్‌లో లేని విధంగా ఇ-చేతక్‌లో రివర్స్‌ గేర్‌ను అందిస్తున్నారు. ఈ స్కూటర్‌ను యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో చార్జింగ్‌ స్టేటస్‌ తెలుస్తుంది. ఇంకా ఎంత చార్జింగ్‌ ఉంది, ఏ లొకేషన్‌లో స్కూటర్‌ ఉంది, స్కూటర్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా వంటి వివరాలను కూడా యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారికి ఓ చార్జర్‌ను ఉచితంగా అందివ్వనున్నారు.

బజాజ్‌ ఎలక్ట్రిక్‌ చేతక్‌ను ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే టెస్ట్‌ డ్రైవ్‌ కోసం అప్లయి చేసుకోవచ్చు. పూణెలో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను బజాజ్‌ ఓపెన్‌ చేసింది. ఈ స్కూటర్‌పై 3 ఏళ్ల వారంటీని ఇస్తున్నారు. 50వేల కిలోమీటర్ల వరకు వారంటీ వర్తిస్తుంది. ప్రతి 12వేల కిలోమీటర్లకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి సర్వీస్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్కూటర్‌కు 3 ఉచిత సర్వీసులు ఇస్తారు.

3394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles