అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో గూగుల్ పిక్స‌ల్ 4 ఫోన్లు..!


Wed,October 16, 2019 10:34 AM

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ పిక్స‌ల్ సిరీస్‌లో నూత‌న ఫోన్లైన పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ ల‌ను నిన్న విడుద‌ల చేసింది. అమెరికాలోని న్యూయార్క్‌లో నిన్న రాత్రి నిర్వ‌హించిన ఓ ఈవెంట్‌లో గూగుల్ ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. పిక్స‌ల్ 4లో 5.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్‌లో 6.3 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. రెండు ఫోన్ల డిస్‌ప్లేలు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ స‌దుపాయాన్ని క‌లిగి ఉన్నాయి. రెండు ఫోన్ల‌లోనూ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌కు 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, ఓఎస్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని గూగుల్ వెల్ల‌డించింది.

16 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌...


ఇక ఈ ఫోన్ల‌లో వెనుక భాగంలో 12.2 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు 16 మెగాపిక్స‌ల్ టెలిఫోటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాకు సూప‌ర్ రెస్ జూమ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నందువ‌ల్ల రాత్రిపూట ఆకాశంలోని న‌క్ష‌త్రాలు, పాల‌పుంత‌ల ఫొటోలను అద్భుతంగా తీయ‌వ‌చ్చు. ఈ ఫోన్ల‌లో గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ మ‌రింత మెరుగ్గా ప‌నిచేసేలా తీర్చిదిద్దారు. దీంతో యాప్స్‌ను వేగంగా ఓపెన్ చేయ‌డం, ఫోన్‌లో సెర్చ్ చేయ‌డం, షేర్ చేయ‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది.

సైగ‌ల‌ను గుర్తించే రేడార్ సెన్సార్ చిప్‌...


పిక్స‌ల్ 4 ఫోన్ల‌లో నూతనంగా ప్రాజెక్ట్ సోలి ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి చేసిన మోష‌న్ సెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఫోన్‌లో ఉండే ప్ర‌త్యేక‌మైన రేడార్ సెన్సార్ చిప్ యూజ‌ర్ మోష‌న్స్‌, గెస్చ‌ర్స్‌ను ఆటోమేటిగ్గా డిటెక్ట్ చేసి అందుకు త‌గిన‌విధంగా ఫోన్‌ను ప‌నిచేయిస్తుంది. ఈ క్ర‌మంలో ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు ఫోన్‌ను ఫేస్ అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. స్క్రీన్‌ను ట‌ర్న్ ఆఫ్ చేయ‌వ‌చ్చు. సాంగ్స్‌ను స్కిప్ చేయ‌డం, అలార‌మ్స్ స్నూజ్ చేయ‌డం, టైమ‌ర్ల‌ను డిస్‌మిస్ చేయ‌డం, ఫోన్‌ను సైలెన్స్ చేయ‌డం వంటి ప‌నులు చేసుకోవ‌చ్చు.

పిక్స‌ల్ 4 ఫోన్ల‌లో నూత‌నంగా రికార్డ‌ర్ యాప్‌ను అందిస్తున్నారు. దీని స‌హాయంతో యూజ‌ర్లు దేన్న‌యినా రికార్డు చేసుకుని త‌రువాత విన‌వ‌చ్చు. అలాగే యూజ‌ర్లు తమ‌కు తెలియని మ్యూజిక్‌, పాట‌ల‌ను రికార్డు చేస్తే వాటిని ఈ యాప్ గుర్తించి వాటి స‌మాచారాన్ని యూజ‌ర్‌కు అందిస్తుంది. అయితే ప్ర‌స్తుతం కేవ‌లం ఇంగ్లిష్ భాష‌కు మాత్ర‌మే స‌పోర్ట్‌ను ఇచ్చినందున కేవ‌లం ఆ భాష‌ను మాత్ర‌మే ఈ యాప్‌లో ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది.

పిక్స‌ల్ 4 ఫోన్ల‌ను ప్రీమియం లుక్ వ‌చ్చేలా అల్యూమినియం ఫ్రేమ్‌తో త‌యారు చేశారు. వెనుక భాగంలో మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. అందువ‌ల్ల సాఫ్ట్ ట‌చ్ ఉన్న‌ట్లు అనిపిస్తుంది. వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ల‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు.

గూగుల్ పిక్సల్ 4, పిక్స‌ల్ 4 ఎక్స్ఎల్ ఫీచ‌ర్లు...


* పిక్స‌ల్ 4 - 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* పిక్స‌ల్ 4 ఎక్స్ఎల్ - 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 12.2, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* పిక్స‌ల్ 4 - 2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ - 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* వైర్‌లెస్ చార్జింగ్‌, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌

పిక్స‌ల్ 4 ఫోన్లు జస్ట్ బ్లాక్‌, క్లియ‌ర్లీ వైట్‌, లిమిటెడ్ ఎడిష‌న్ ఓహ్ సో ఆరెంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. ఈ ఫోన్ల‌కు అమెరికాలో ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించ‌గా, అక్టోబ‌ర్ 24వ తేదీ నుంచి అమెరికా స‌హా ప‌లు ఇత‌ర దేశాల్లోనూ వీటిని విక్ర‌యించ‌నున్నారు. అయితే ఈ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేయ‌డం లేద‌ని గూగుల్ తెలిపింది. ఇక వీటి ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

గూగుల్ పిక్స‌ల్ 4 (64జీబీ) ధ‌ర - 799 డాల‌ర్లు (దాదాపుగా రూ.57,105)
గూగుల్ పిక్స‌ల్ 4 (128జీబీ) ధ‌ర - 899 డాల‌ర్లు (దాదాపుగా రూ.64,250)
గూగుల్ పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ (64జీబీ) ధ‌ర - 899 డాల‌ర్లు (దాదాపుగా రూ.64,250)
గూగుల్ పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ (128జీబీ) ధ‌ర - 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.71,400)

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles