ఇక‌పై ప‌బ్‌జి మొబైల్‌ను రోజుకు 6 గంట‌ల‌కు మించి ఆడ‌లేర‌ట‌..!


Sun,March 24, 2019 12:07 PM

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు ప్ర‌స్తుతం పిల్ల‌లు, యువత ఎలా బానిస‌లవుతున్నారో అంద‌రికీ తెలిసిందే. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి ఆ గేమ్ ఆడుతూ ఆరోగ్యం నాశ‌నం చేసుకుంటున్నారు. ఇటీవలే జగిత్యాల‌కు చెందిన ఓ యువ‌కుడు అదే ప‌నిగా గంటల త‌ర‌బ‌డి ప‌బ్‌జి గేమ్ ఆడుతూ మెడ కండ‌రాలు ప‌ట్టేసి అనంత‌రం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గ‌తంలోనూ ఈ గేమ్ వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న వారు చాలా మందే ఉన్నారు. దీంతో ఇప్పుడీ గేమ్‌ను మ‌న దేశంలో నిషేధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే మ‌రో వైపు ప‌బ్‌జి మొబైల్ గేమ్ సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్ మాత్రం ఈ గేమ్‌ను ఆరోగ్య‌క‌రమైన రీతిలో అనుభూతి చెందేలా నూత‌న ఫీచ‌ర్‌ను ఇందులో అందుబాటులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్న‌ది. అందులో భాగంగానే ఇక‌పై ఎవ‌రైనా ఈ గేమ్‌ను 6 గంట‌ల‌కు పైగా నిరంత‌రాయంగా ఆడుతుంటే గ‌న‌క వారికి హెల్త్ రిమైండ‌ర్ పంప‌నుంది. 6 గంట‌లు దాటితే గేమ్ ప్లే దానంత‌ట అదే ఆగిపోతుంది. ఇక మ‌రుస‌టి రోజు వ‌ర‌కు గేమ్ ఆడ‌డం కుద‌ర‌దు. అయితే ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ప‌లువురు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింద‌ని స‌మాచారం.

18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు వారు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను 6 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు ఆడితే వారికి హెల్త్ రిమైండ‌ర్ వ‌స్తున్న‌ద‌ట‌. దీంతో వారు ఆ రోజుకు ఇంక గేమ్ ఆడ‌డం కుద‌ర‌డం లేద‌ట‌. మ‌రుస‌టి రోజు గేమ్ ఆడుకోవ‌చ్చ‌ని రిమైండ‌ర్‌లో చెబుతున్న‌ద‌ట‌. అయితే కొంద‌రికి కేవ‌లం 2 గంట‌ల పాటు ఆడితేనే ఈ రిమైండ‌ర్ వ‌స్తుంద‌ని, మ‌రికొంద‌రికి 18 సంవ‌త్సరాల క‌న్నా ఎక్కువ వ‌యస్సు ఉన్న‌ప్ప‌టికీ వారికి కూడా గేమ్‌లో హెల్త్ రిమైండ‌ర్ వ‌స్తుంద‌ని, దీంతో గేమ్‌ను ఆడ‌లేక‌పోతున్నామ‌ని ప‌లువురు చెబుతున్నారు. అయితే టెన్సెంట్ గేమ్స్ మాత్రం ప‌బ్‌జి ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్‌ను బ్యాన్ చేయాల్సిన అవ‌స‌రం రాకుండానే ముందుగా స్పందించింది. అందుక‌నే ఇలా హెల్త్ రిమైండ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ద‌ని తెలిసింది. మరి ఈ ఫీచ‌ర్ వ‌ల్లనైనా ప‌బ్‌జి వ్య‌స‌నం త‌గ్గుతుందో, లేదో చూడాలి..!

4058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles