యాప్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్.. 156 కిలోమీటర్ల మైలేజీ..!


Tue,June 18, 2019 06:59 PM

రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను ఆర్‌వీ 400 పేరిట ఇవాళ లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ మొబైల్స్ కంపెనీ మాజీ సీఈవో రాహుల్ శర్మ రెవోల్ట్ మోటార్స్ కంపెనీని స్థాపించారు. కాగా ఈ మోటార్ సైకిల్ తయారీ కోసం పలు కంపెనీలు పార్ట్‌నర్స్‌గా వ్యవహరించాయని ఆయన లాంచింగ్ ఈవెంట్‌లో తెలిపారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు ఈ టూవీలర్ తయారీకి సహకరించాయని రాహుల్ శర్మ తెలిపారు. ఇక ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 156 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై వెళ్లవచ్చు.సాధారణ టూవీలర్స్‌కు, ఆర్‌వీ 400 మోటార్‌సైకిల్‌కు రెండు తేడాలు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ విద్యుత్‌తో పనిచేస్తుంది. అలాగే దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను ఫోన్‌లో ఓ కంపానియన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం బైక్‌లో ఉండే బ్లూటూత్ సహాయంతో ఈ బైక్.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత యాప్ ఓపెన్ చేసి అందులో ఉండే పలు ఫీచర్లను వినియోగదారులు పొందవచ్చు.యాప్‌లో బైక్‌కు చెందిన పూర్తి సమాచారం రైడర్లకు కనిపిస్తుంది. ట్రిప్ హిస్టరీ, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు, బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్లవచ్చు, బైక్ రక్షణ కోసం జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను ఆ యాప్‌లో అందిస్తున్నారు. అలాగే ఈ బైక్‌కు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ బైక్ పనిచేస్తుంది. ఇక యాప్ ద్వారానే ఈ బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు. అందుకు గాను యాప్‌కు వాయిస్ కమాండ్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బైక్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌కు ఓటీఏ రూపంలో అప్‌డేట్లను కూడా ఇస్తారు. అలాగే యాప్‌లో ఉన్న పలు సౌండ్ సెట్టింగ్స్ ద్వారా బైక్ సైలెన్సర్ సౌండ్‌ను మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు.

ఈ బైక్‌లో ఉన్న బ్యాటరీని చార్జింగ్ చేయడం కూడా తేలికే. 15యాంప్స్ సాకెట్‌తో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకు గాను ప్రత్యేక చార్జింగ్ సెటప్ అవసరం లేదు. అలాగే ఆ బ్యాటరీని తొలగించి దాన్ని ఇల్లు లేదా ఆఫీస్‌లో ఎక్కడైనా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ పనిచేయకుండాపోతే కొత్త బ్యాటరీ ఆర్డర్ చేయవచ్చు. అందుకు గాను స్టోర్స్ ఉంటాయి. లేదా ఆన్‌లైన్‌లో కూడా కొత్త బ్యాటరీని ఆర్డర్ చేయవచ్చు. ఇక బైక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్నందున బ్యాటరీ లైఫ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. దీంతో బ్యాటరీ చెడిపోయినా మనకు ఇట్టే యాప్‌లో తెలిసిపోతుంది.కాగా ఈ రెవోల్ట్ ఆర్‌వీ 400 మోటార్‌సైకిల్‌ను బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో విడుదల చేశారు. అయితే ఈ బైక్ ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ దీని ధర సబ్సిడీ పోను రూ.1.20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ మోటార్ సైకిల్‌కు గాను ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అయితే వచ్చే నెల నిర్వహించనున్న మరో ఈవెంట్‌లో ఈ బైక్‌కు చెందిన కచ్చితమైన ధర వివరాలను వెల్లడిస్తారు..!

5055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles