గెలాక్సీ ఫోల్డ్.. మ‌డ‌త‌బెట్టే స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన శాంసంగ్‌..!


Thu,February 21, 2019 11:39 AM

శాంసంగ్ సంస్థ నిన్న రాత్రి జ‌రిగిన‌ శాన్‌ఫ్రాన్సిస్కో ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్10, ఎస్10 ప్ల‌స్‌, ఎస్‌10ఇ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అదే ఈవెంట్‌లో శాంసంగ్ త‌న గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుద‌ల చేసింది. శాంసంగ్ నుంచి వ‌చ్చిన మొట్ట మొద‌టి మ‌డ‌త‌బెట్టే ఫోన్ ఇదే కావ‌డం విశేషం. కాగా ఈ ఫోన్‌కు చెందిన ప్రోటోటైప్‌ను గ‌తేడాది న‌వంబర్‌లోనే విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ ఫోన్‌ను శాంసంగ్ విడుద‌ల చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌లో రెండు తెర‌లు ఉంటాయి. ఒక డిస్‌ప్లే 7.3 ఇంచ్ సైజ్ కాగా, మ‌రో డిస్‌ప్లే సైజ్ 4.6 ఇంచులుగా ఉంది. కాగా 7.3 ఇంచుల డిస్‌ప్లేను మ‌డ‌త‌బెట్టే విధంగా రూపొందించారు. ఇక ఈ ఫోన్ ఏప్రిల్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. కాగా ఈ ఫోల్డ‌బుల్ ఫోన్‌ను త‌యారు చేసేందుకు భిన్న ర‌కాల కాంపొనెంట్ల‌ను త‌యారు చేయాల్సి వ‌చ్చింద‌ని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్‌ను ఎంచ‌క్కా పాకెట్ సైజ్ కు మ‌డ‌త‌బెట్టి జేబులో పెట్టుకోవ‌చ్చని ఆ కంపెనీ చెబుతోంది. కాగా ఈ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధ‌రను శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ దీని ధ‌ర‌ రూ.1,41,300 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని తెలిసింది. ఇక 4జీతోపాటు 5జీ వేరియెంట్‌లోనూ ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు...
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఈ ఫోన్‌లో 7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైన‌మిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 4380 ఎంఏహెచ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ లేదు. అలాగే ఇందులో వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ క‌వ‌ర్ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఎలా ప‌ట్టుకున్నా చాలా వేగంగా కెమెరాను ఓపెన్‌ చేసి ఫొటోలు తీసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ లో ఆండ్రాయిడ్ పై 9.0 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఒకేసారి మూడు యాప్ ల‌ను ఈ ఫోన్ డిస్‌ప్లేల‌పై ర‌న్ చేసుకోవ‌చ్చు. అలాగే వాట్సాప్‌, యూట్యూబ్ తదిత‌ర సోష‌ల్ యాప్స్‌ను ఇందులో ప్ర‌త్యేకంగా అందిస్తున్నారు. ఫోన్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఈ యాప్‌ల‌ను భిన్న ర‌కాల్లో డిజైన్ చేశారు. కాగా షియోమీ, లెనోవో, ఎల్‌జీ కంపెనీలు కూడా మ‌డ‌త‌బెట్టే ఫోన్ల‌ను రూపొందించే ప‌నిలో ఇప్ప‌టికే నిమ‌గ్నం కాగా, శాంసంగ్ మాత్రం ఈ ఫోన్‌ను విడుద‌ల చేసి ఆ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచింద‌నే చెప్ప‌వ‌చ్చు..!

2066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles