వ్యవసాయానికి 24 గంటల కరెంటు చారిత్రాత్మకం

Sat,November 11, 2017 08:57 PM

రాజన్న సిరిసిల్ల : వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇవ్వడం చారిత్రాత్మకమని, దేశ చరిత్రలో ఏ ప్రధానీ, ముఖ్యమంత్రీ చేపట్టని విధంగా పంటకు పెట్టుబడి ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దేనని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. సమైక్యపాలనలో కరెంటు కోసం పంటల వద్ద కళ్లలో వత్తులేసుకుని కాపలా కాసిండ్రని, దొంగోలే వచ్చే కరెంటు కోసం పంటల వద్ద పాములు కుట్టి, కరెంటు షాక్‌తో చనిపోయిన దుస్థితి అనాటిదని గుర్తుచేశారు. పంటలు ఎండి పోతున్నాయంటూ సబ్ స్టేషన్లను ముట్టడించి ధర్నాలు చేసిండ్రని, ఎలక్ట్రిసిటీ అధికారులను కార్యాలయాల్లో నిర్బంధించిన రోజులుండేవని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ లేక చీకటి రాజ్యం అవుతుందంటూ అవహేళన చేసిన సమైక్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చీకటిలో కలిసి పోయాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామంటే వద్దంటూ రైతులు ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందంటే సర్కారు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎరువులు, విత్తనాల కోసం గంటల తరబడి చెప్పులు వరసలో పెట్టి ఎదిరి చూసిన రైతుల పరిస్థితి నేడు లేకుండా చేసినమని చెప్పారు. మద్దతు ధర లేక రోడ్డెక్కిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వమని స్పష్టం చేశారు. వచ్చే రబీ సీజన్ నుంచి ఎకరాన రూ.4వేల చొప్పున పంటకు పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో జిల్లెల్ల, రామచంద్రపూర్, తంగళ్లపల్లి, అంకిరెడ్డిపల్లె గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పేద కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో పింఛన్లు ఐదురేట్లకు పెంచినట్లు తెలిపారు. వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, ఒంటిరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి చేయూతనిస్తే అభివృద్ధిలో మరింత ముందుకు పోతుందని, అందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆడపడుచులు నీళ్ల కోసం బిందెలు పట్టుకోని రోడ్లపైకి రాకుండా వారి ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం మిషన్ భగరీథ చేపట్టిందన్నారు. రాబోయే ఎండాకాలంలో ప్రతి పల్లెలో ఇంటింటా తాగునీరు అందిస్తామని చెప్పారు.

నీడలేని ప్రతి కుటుంబానికీ డబుల్ బెడ్ రూం ఇల్లు
తెలంగాణ ప్రజల్లో సుఖ సంతోషాలు చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రికేటీఆర్ స్పష్టం చేశారు. నీడలేని ప్రతికుటుంబానికీ రెండు పడక గదుల ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లిలో 1260 మంది కుటుంబాల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. పేదల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, గత సమైక్య పాలనలో విద్య, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఏప్రభుత్వమూ అమలు చేయలేదని, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు మన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోవడం గర్వించదగ్గదన్నారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి పథంలో తీసుకపోతున్నామని, , విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం, దవాఖానలను ఆధునీకరించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో రూ.20లక్షలతో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగాణాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ దొర్నాల లకా్ష్మరెడ్డి, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఎంపీపీ జూపల్లి శ్రీలత, ఏఎంసీ చైర్మన్ జిందంచక్రపాణి, గూడూరి ప్రవీణ్, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్ పాల్గొన్నారు.

1288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles