భార్య మేనమామ పెళ్లికి వెళ్లిన భర్త హత్య

Mon,October 21, 2019 08:06 PM

సూర్యాపేట : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నాగారం మండలం ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన కొమ్ము యాకయ్య అలియాస్ రమేష్(33) హైదరాబాద్‌లోని వారసిగూడలో ఉంటూ పశు విక్రయాలు చేస్తున్నాడు. యాకయ్యకు ఇద్దరు భార్యలు. అయినప్పటికీ ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి యాకయ్య జీవనం సాగిస్తున్నారు.


పది రోజుల క్రితం తన స్వగ్రామమైన జలాల్‌పురం వచ్చి తన సొంతి ఇంటి నిర్మాణ పనులు చేయించుకుంటున్నాడు యాకయ్య. ఆదివారం రెండో భార్య కొమ్ము మమత మేనమామ వివాహానికి సూర్యాపేటలో హాజరయ్యాడు. అక్కడ ఫంక్షన్‌హాల్‌లో మూరగుండ్ల సురేష్‌తో యాకయ్యకు చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యాకయ్య తన భార్య మమత, అత్తతో కలిసి కారులో ఫణిగిరి వచ్చారు.

అనంతరం ఫణిగిరి గ్రామ శివారులో బయటకు వెళ్లి వస్తానని వెళ్లాడు. ఊరి చివరలో బొంద మైసమ్మ గుడి వద్ద భారీ వర్షం పడడంతో కారులో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అప్పటికే మాటు వేసిన దుండగులు కత్తితో దాడి చేయగా యాకయ్య తప్పించుకొని మళ్లీ కారులోకి వెళ్లి అద్దాలు బిగించుకొని 100కు ఫోన్ చేశాడు. గమనించిన దుండగులు అదును చూసి కారు అద్దాలు పగులగొట్టి మరోసారి యాకయ్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి కారు పక్కన ఉన్న బండరాయితో తలపై మోదారు. దీంతో యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని గ్రామస్తులు అంటున్నారు. యాకయ్య డ్రైవర్‌గా మూరగుండ్ల సురేష్ పని చేసేవాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల ఘర్షణే యాకయ్య హత్యకు దారి తీసిందని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించి మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సోమవారం యాకయ్య తల్లి కొమ్ము సోమలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమార్తెలు చిన్న పిల్లలు కావడంతో బంధువులు, గ్రామస్తులు దిగ్ర్భాంతికి గురయ్యారు.

21179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles