ఏపీ సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ

Fri,October 18, 2019 05:17 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ వాడిన భాష తీరుపై జగన్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సీబీఐ ఊహాజనిత ఆరోపణలతో కౌంటర్ దాఖలు చేసిందని వాదనలు వినిపించారు.


రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తాను హాజరుకాకుంటే విచారణలో ఎలా జప్యం జరుగుతోందో తెలపాలన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఎప్పుడూ కేసు వాయిదా కోరలేదు. స్టే అడగలేదు. కోర్టుకు రావడం అసౌకర్యంగా ఉందని హాజరు మినహాయింపు అడగడం లేదు. సీఎంగా పాలన చేయాల్సిన రాజ్యంగబద్ధమైన బాధ్యత ఉంది.

ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఏనాడైనా ఉందా అని న్యాయవాది జగన్ తరపున అడిగారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును నవంబర్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

కోర్టులో సీబీఐ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాల పరిశీలించాయి. అన్ని పరిశీలించాకే వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయి. జగన్ హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు. జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది.

930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles