ఆర్థిక మాంద్యం.. పడిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Mon,September 9, 2019 12:47 PM

హైదరాబాద్‌ : గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తున్నదని సీఎం కేసీఆర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తున్నది. రెండో త్రైమాసికంలో 7 శాతానికి, మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి, 5 శాతం కనిష్ట వృద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుందన్నారు. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం వెల్లడించినవే అని సీఎం స్పష్టం చేశారు.


సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మోబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌(సియామ్‌) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి. ఇప్పటికే తయారైన వాహనాలు కొనేవారు దిక్కులేక పోవడంతో దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొని ఉందన్నారు. దీని వల్ల మూడు రకాల నష్టం ఏర్పడింది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి, వ్యాట్‌ తగ్గిపోయిందని సీఎం తెలిపారు. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఆటోమొబైల్‌ రంగంలో ఇటీవల కాలంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ విషమ పరిస్థితికి అద్దం పడుతుందని బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

గత ఏడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6 శాతం ఉంటే ఈ ఏడాది మైనస్‌ 0.3 శాతంగా నమోదైందని చెప్పారు. మొత్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య వృద్ధి 11.9 శాతం తగ్గింది. కార్గో విమానాల ద్వారా జరిగే సరుకు రవాణాలో వృద్ధిరేటు ఏకంగా 10.6 శాతం తగ్గింది. 6 శాతం నుంచి మైనస్‌ 4.6 శాతానికి పడిపోయిందని తెలిపారు. అన్ని రకాల వస్తువుల డిమాండ్‌ పడిపోవడంతో సరుకు రవాణా చేసే రైల్వే గూడ్స్‌ వ్యాగన్ల బుకింగ్స్‌లో వృద్ధిరేటు 4.1 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చిందన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధిశాతం 10.6 శాతం నుంచి మైనస్‌ 5.1 శాతానికి పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా డాలర్‌తో పోల్చిచూసినప్పుడు మన రూపాయి విలువ అత్యంత కనిష్టంగా 72 రూపాయాల 43 పైసలకు పడిపోయింది అని.. ఈ విషయాన్ని ప్రపంచం కోడై కూస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles