గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోంది: సీఎం కేసీఆర్‌

Tue,August 6, 2019 05:44 PM


ధర్మపురి: మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. ధర్మపురిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తయారైనయి. తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలించి ప్రాజెక్టులు రీడిజైనింగ్‌ చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా లభించే నీళ్లు 400 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తం. రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్‌ వస్తుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రతీ రోజు 3 టీఎంసీల నీళ్లు వస్తయన్నారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు ప్రతీరోజు 2 టీఎంసీల నీళ్లు వస్తయని సీఎం వివరించారు. ధర్మపురి దగ్గర ఏడాది పొడవునా గోదావరి నిండుగా ఉంటది. కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరి తప్ప మనకు మరో మార్గం లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నాలుగైదు రోజులుగా మేడిగడ్డ నుంచి ప్రతీరోజు నాలుగైదు టీఎంసీల నీళ్లు కిందికిపోతున్నయన్నారు.

మేడిగడ్డ దగ్గర గోదావరి బెడ్‌ లెవల్‌ 88 మీటర్లు. 119 మీటర్ల ఎత్తులో అన్నారం బ్యారేజీ కట్టుకున్నాం. 130 మీటర్ల ఎత్తులో సుందిళ్ల బ్యారేజీ నిర్మించినం. 148 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందని సీఎం తెలిపారు. గోదావరికి వరద ఎక్కువగా వస్తే మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. డైరెక్టుగా ఎల్లంపల్లి నుంచే నీటిని తీసుకుంటమన్నారు.

మిషన్‌ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఉన్నవారికి అందిస్తున్న నీటినే..పేదల బస్తీల్లో కూడా అందిస్తున్నామని చెప్పారు. జఠిలంగా ఉన్న విద్యుత్‌ సమస్య లేకుండాపోయింది. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. సంక్షేమం అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. దివ్యాంగులకు రూ.3116 పింఛన్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

2121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles