ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వ నిర్ణయం

Thu,November 21, 2019 10:26 PM


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌ కే జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, సందీప్‌ సుల్తానియా సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ? అనే అంశంపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితరల అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.


ఈ సమీక్షలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకుపైగా అప్పులున్నాయన్నారు. ఇందులో తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్‌కు సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు రూ.65-70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలన్నారు. రూట్ల ప్రైవేటీకరణపై రేపటి హైకోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం తీసునున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మొత్తంగా ఆర్టీసీ ఇప్పడున్నుట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి.. ? ఆర్టీసీకి ఇప్పుడున్నంత శక్తి లేదు. ఆర్థికమాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఎంతోకొంత ప్రభుత్వం సహాయం చేసినా..అది ఎంతవరకు కొనసాగించగలుగుతుంది..?ఛార్జీలు ఎక్కువైటే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వచ్చి చేరతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

5803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles