సైకిల్ సవారీ.. ఆరోగ్యమే మీదోయి

Mon,October 14, 2019 09:24 AM

హైదరాబాద్ : సైకిల్‌పై సవారీ నేడు కొత్త పుంతలు తొక్కుతున్నది. ఒకప్పుడు అవసరం కోసం వాడే సైకిళ్ల స్థానం మారిపోయింది. ప్రస్తుతం ఆరోగ్యం కోసం వాడుతున్నారు. పేదల రవాణా వాహనంగా వాడిన సైకిల్ పెద్దల ఆరోగ్యం కోసం ఫిట్‌నెస్ సాధనంగా మారింది. పట్టణీకరణతో సైక్లింగ్ క్లబ్‌లు, సైక్లింగ్ రేసుల ప్రాధాన్యం పెరిగిపోతున్నది. కేవలం సైకిళ్లను తొక్కడానికి సైక్లింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు అనసరాల కోసం మాత్రమే వినియోగించిన సైకిల్ కొత్త హంగులు.. సొబగులు సమకూర్చుకొని ఫిట్‌నెస్ సాధనంగా మారిపోయింది.


ఆనవాళ్లుగా.. అక్కడక్కడ


2000 సంవత్సరం వరకు అవసరాల కోసం సైకిళ్లను గణనీయంగా వినియోగించినా, రానురాను సైకిళ్ల వాడకం తగ్గిపోయింది. ఒకప్పుడు సైకిల్ లేని ఇండ్లు ఉండేవి కాదంటే అతిశయోక్తికాదేమో. ఇక కాలేజీలు, పాఠశాలలకెళ్లే వారంతా సైకిళ్ల మీదే సవారీచేసేవారు. పెద్దలు తమ పనుల కోసం రోడ్డెక్కాలంటే సైకిల్‌నే ఆశ్రయించేవారు. సైకిళ్లను అద్దెకిచ్చే సంస్కృతి కొనసాగేది. కానీ కాలకమ్రేణా ద్విచక్ర వాహనాలు మార్కెట్‌ను ముంచెత్తడంతో సైకిళ్ల వినియోగం క్రమంగా తగ్గింది. ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉన్న సైకిల్ స్థానాన్ని మోటార్ సైకిళ్లు ఆక్రమించడంతో సైకిళ్లు కనుమరుగయ్యాయి. అక్కడక్కడ పాతవారి చేతిలో చరిత్రకు ఆనవాళ్లుగా మాత్రమే కనిపిస్తున్నాయి.

ఫిట్‌నెస్ మంత్ర


ఇంటి అవసరాలు, ఉద్యోగాలు, పనుల కోసం విరివిగా సైకిల్‌ను వాడేవారు. నిన్నటి సామాన్యుల వాహనమైన సైకిల్‌పై సవారీ ఫిట్‌నెస్ సూత్రంగా మారిపోయింది. కానీ క్షణం కూడా వృథా చేయకుండా ఉండాలంటే సైక్లింగ్ సరైన వ్యాయామం. ఫెడల్ మీద కాలుపెట్టిందే ఆలస్యం శారీరక శ్రమ ప్రారంభమయినట్లే. రన్నింగ్, వాకింగ్‌లకు భిన్నంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే సైక్లింగ్‌ను ఆశ్రయించడం మంచి ఉపశమనం. సైకిల్‌ను ఎంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి వాళ్లంతా ఓ క్లబ్‌గా ఏర్పడి ఆరోగ్యంపై అవగాహన పెంచుతూనే, సైకిల్ వినియోగం కూడా పెంచుతున్నారు. ఇలా బైసైక్లింగ్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లో సైక్లింగ్‌ను పొత్సహించడానికి యునైటెడ్ నేషనల్స్ హ్యాబిటాట్ జతకట్టింది. హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్ సహకారంతో మెట్రోస్టేషన్లలో బైస్కిల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

సైకిల్ తొక్కడంతో ప్రయోజనాలు


* శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువు తగ్గొచ్చు
* రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
* కండరాలను బలోపేతం చేస్తుంది.
* ఒత్తిడి తగ్గి నిద్ర, నిద్రలేమిని అధిగమించొచ్చు.
* చర్మానికి కావాల్సిన ఆక్సిజన్ అంది. మృత కణాలన్నీ తొలిగిపోతాయి.
* జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. కొత్త న్యూరో కణాల తయారవుతాయి.
* షుగర్, బీపీ, క్యాన్సర్‌లు కుదుటపడుతాయి. గుండెజబ్బులు రావు
* కేలరీలను కరిగించడానికి, ఒబేసిటిని తగ్గించుకోవచ్చు.
* ఎముకల బలంగా తయారవుతాయి. దృఢత్వం కలిగి, కండరాల చలనశక్తి మెరుగవుతుంది.

జాగ్రత్తలు..


* కాస్త ఏదైనా తిన్నతర్వాతే సైకిల్ తొక్కాలి
* కోట్స్, జాకెట్స్ ధరించొద్దు
* వదులుగా ఉన్న దుస్తులు మాత్రమే వేసుకోవాలి
* కూరగాయలు, ప్రొటీన్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి
* ఒక అరటిపండు ఎంచక్కా తినవచ్చు
* శక్తికి మించి సైకిల్ తొక్కకూడదు

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles