డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే

Wed,July 27, 2016 07:07 AM

హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారితో పాటు పగటిపూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారికి జైలుశిక్ష పడేలా చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ రజనికి నగర ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ విన్నవించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో కొందరు తాము నోట్లో చెర్రీ వేసుకున్నామని, మౌత్‌ఫ్రెషనర్, పాన్ తిన్నామని ఇలా రకరకాలైన కారణాలు చెబుతూ.. పోలీసులు కావాలని కేసులు రాశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలను నివృత్తి చేయడంలో భాగంగా నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పద్ధతి, బ్రీత్ అనలైజర్‌తో మద్యం సేవించినవారిని ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు? మద్యం మోతాదు ఎలా రికార్డు చేస్తున్నారు? పట్టుబడ్డ వారు మద్యం తాగాడా లేదా అనే విషయాన్ని బ్రీత్ అనలైజర్‌తో ఎలా నిర్ధారిస్తున్నారనే అంశాలపై మంగళవారం నాంపల్లి కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్‌లో మెట్రోపాలిటజన్ సెషన్స్ జడ్జీ సమక్షంలో డెమో నిర్వహించారు. ఇందులో పలువురు మేజిస్ట్రేట్‌లు, జడ్జీలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.


మద్యం తాగిన వ్యక్తి బ్రీత్ అనైలజర్‌తో పరీక్షలు నిర్వహించడం వల్ల వచ్చే ఫలితం, మద్యం తాగకుండా వెళ్లే వారికి వచ్చే ఫలితాలపై ప్రత్యక్షంగా వివరించారు. ఆల్కహాల్‌లో నానబెట్టిన చెర్రీస్‌ను తినడం వల్ల కూడా బ్రీత్ అనలైజర్‌లో కొన్నిసార్లు మద్యం సేవించిన ఆనవాళ్లు వచ్చే అవకాశాలుంటాయి. అయితే వచ్చే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాని గాఢత తగ్గుతుంది. ఇలాంటివారికి ఐదు నిమిషాల తరువాత కూడా మరోసారి పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. బ్రీత్ అనలైజర్‌లో 35 శాతం కంటే తక్కువగా ఉండేవారిని వదిలిపెడుతారు. మద్యం తాగనివారికి, ఆల్కహాల్ సంబంధిత వస్తువులు వాడినప్పుడు నిర్ణీత ప్రమాణాల కంటే తక్కువ మోతాదులోనే ఆల్కహాల్ పర్సెంటేజీ నమోదవుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తాము అనుమానం వస్తే ఒకటికి రెండుసార్లు పరీక్ష చేస్తున్నామని, అమాయకులెవరిపై కూడా కేసులు రాయడం లేదని డీసీపీ వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పద్ధతిని ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించడంతో ఆయా మేజీస్ట్రేట్‌లు, జడ్జీలకు ఉండే సందేహాలను నివృత్తి చేసుకొని, జరుగుతున్న డ్రంక్‌అండ్‌డ్రైవ్ పద్ధతిపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఇటీవల రమ్య విషాద ఘటనతో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత విస్తృతం చేశామని డీసీపీ వివరించారు.

పగటిపూట పట్టుబడుతున్నవారికి తప్పనిసరిగా శిక్షలు పడేవిధంగా చేయాలని, పగటిపూట తాగి నడపడం వల్ల ప్రమాదాలకు ఎక్కువగా అవకాశాలుండడంతో పాటు, నష్టం కూడా భారీగా ఉంటుందని, ఇలాంటివారిని కట్టడి చేయాలంటే కఠినమైన శిక్షలు వేయాలంటూ డీసీపీ సెషన్స్ జడ్జీ దృష్టికి తీసికెళ్లారు. ప్రస్తుతం పడుతున్న శిక్షలను రెట్టింపు చేస్తే, మద్యం తాగి నడిపేవారిలో భయం పెరుగుతుందని, మద్యం తాగి వాహనం నడిపేందుకు ఎవరు సాహసించరని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి జరిమానాలతో సరిపెట్టకుండా, ఖచ్చితంగా జైలుశిక్ష పడేవిధంగా చేయాలని కోరారు. రీపీటెడ్‌గా పట్టుబడేవారి విషయంలో మరింత కఠినంగా ఉండాలని డీసీపీ కోరారు. తాము విన్నవించిన పలు విషయాలపై సానుకూలంగా స్పందించి, తగిన విధంగా స్పందిస్తామంటూ సెషన్స్ జడ్జీ హామీ ఇచ్చారని డీసీపీ రంగనాథ్ తెలిపారు.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles