వ్యాపారి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

Sun,November 12, 2017 11:38 PM

హైదరాబాద్ : మీ సోదరుడు ఇంకా మా బందీలోనే ఉన్నాడు.. మాకు డబ్బులు పంపించకపోతే చంపేస్తాం.. ఇలా ఓ మెసేజ్ మలేషియాలో హత్యకు గురైన వ్యాపారి వాసుదేవ్‌సింగ్ రాజ్ పురోహిత్ సోదరుడికి రావడం కలకలం రేపింది. ఒక వైపు అంత్యక్రియలు జరుగుతుండగా.. ఈ మెసేజ్ రావడం కలవరం రేపింది. కుషాయిగూడ మహేశ్‌నగర్‌కు చెందిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దుకాణం నిర్వాహకుడు వాసుదేవ్‌సింగ్ రాజ్ పురోహిత్ ఇటీవల విహారయాత్రకు మలేషియా వెళ్లి కిడ్నాప్, హత్యకు గురైన విషయం తెలిసిందే. సోదరులు శ్యాంసింగ్, విక్రం, ప్రవీణ్ ఈనెల 6న హైదరాబాద్ నుంచి మలేషియా వెళ్లారు. అక్కడ వాసుదేవ్ మృతిచెందిన విషయాన్ని ధృవీకరించుకొని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శనివారం అర్ధరాత్రి నగరానికి తీసుకొచ్చారు. ఉదయం కుషాయిగూడలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఓ వైపు అంత్యక్రియలు.. మరోవైపు కిడ్నాపర్ మెసేజ్
దుఃఖంలో ఉన్న వాసుదేవ్ కుటుంబానికి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. అంత్యక్రియల్లో నిమగ్నమైన శ్యాంసింగ్‌కు వారం రోజులుగా నగదు కోసం డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్ ఫోన్ నంబర్ నుంచి ఆదివారం కూడా మరో మెసేజ్ వచ్చింది. నీ సోదరుడు సజీవంగా ఉండాలంటే మేము అడిగిన నగదు వెంటనే బ్యాంక్‌లో డిపాజిట్ చేయండి. లేదంటే అతనిని మీరు ఊపీరితో చూడలేరు అని ఆ మెసేజ్ సారాంశం. కిడ్నాప్ ముఠాలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండడంతో వాసుదేవ్ చనిపోయాడని, మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారనే విషయం తెలియక ఈ మెసేజ్‌ను పంపించినట్టు శ్యాంసింగ్, అతని బంధువులు భావిస్తున్నారు.
కిడ్నాపర్లంతా పాకిస్థానియులే..
వాసుదేవ్‌ను కిడ్నాప్ చేసింది మలేషియాలో క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్న ఆరుగురు పాకిస్థాన్ దేశీయులని అక్కడి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్టు మృతుడి సోదరుడు శ్యాంసింగ్ బంధువులకు వివరించారు. ఈ ఆరుగురికి వాసుదేవ్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఖాన్ మలేషియాలో స్థలం కొనుగోలుతోపాటు తర్మాకోల్ షీట్స్ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ప్రతిపాదన పెట్టాడు. గిఫ్ట్స్ తయారీ, విక్రయాల వ్యాపారం చేస్తున్న వాసుదేవ్.. ఖాన్ ప్రతిపాదనను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో వాసుదేవ్ ఏడాది నుంచి ఖాన్‌కు దాదాపు రూ.6 లక్షలు ఇచ్చాడు. పరిశ్రమ ఏర్పాటు నేపథ్యంలో వాసుదేవ్ ఏడాదిలో రెండు, మూడుసార్లు విహార యాత్ర పేరుతో విజిటింగ్ వీసాపై మలేషియా వెళ్లి ఖాన్‌ను కలిశాడు. అడిగినప్పుడల్లా వాసుదేవ్ నగదు పంపిస్తుండడంతో ఖాన్ అతనిని టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో ఇటీవల ఖాన్ తర్మాకోల్ పరిశ్రమకు అనువైన స్థలం చూశానని, ఫైనల్ చేసేందుకు రమ్మనడంతో వాసుదేవ్ గత నెల 28న తన స్నేహితులు వెంకటేశ్, శ్రీనివాస్‌తో కలిసి మలేషియా చేరుకున్నాడు. అదే రోజు ఖాన్‌తో కలిసి వాసుదేవ్ బయటకు వెళ్లి కిడ్నాప్‌నకు గురయ్యాడు. వీసా గడువు ముగుస్తుండడంతో శ్రీనివాస్, వెంకటేశ్ బ్రిక్‌ఫీల్డ్స్ పీఎస్‌లో వాసుదేవ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసి తిరిగివచ్చారు. ఖాన్ గ్యాంగ్ వాసుదేవ్‌ను మలేషియా నుంచి 70 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్బంధించారు. తప్పించుకునే క్రమంలో వాసుదేవ్ రెండో ఫ్లోర్ నుంచి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కూడా అతనిని ఫ్లాట్‌లో బంధించడంతో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ నెల 3న కిడ్నాపర్ల చెరలో ఉన్న బాధితుడు హత్యకు గురయ్యాడని తెలిసింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి ఖాన్ పరారీలో ఉన్నాడని మలేషియా పోలీసులు శ్యాంసింగ్‌కు తెలిపారు. వరంగల్ నుంచి వాసుదేవ్ సోదరులకు వచ్చిన ఫోన్ కాల్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై మృతుడి బంధువులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి.


1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles