మానవ శరీరంలో కీలకపాత్ర కిడ్నీలు

Thu,March 14, 2019 09:51 AM

function and purpose of the kidneys

హైదరాబాద్ : శరీరంలో మొత్తాన్ని శుద్ధిగా ఉంచే సహజసిద్ద యంత్రాలు మూత్రపిండాలు. నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడుతూ అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇలాంటి కీలకావయమైన కిడ్నీలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. కిడ్నీ ప్రాధాన్యత గురించి ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం...

ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని 2006 నుంచి ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం నిర్వహించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో నలభై మంది పలు రకాల కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారని ఓ సర్వే అంచనా. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి పుట్టుకతోనే ఒక్క కిడ్నీనే ఉండటం ఉన్నా పని చేయక పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థలో జీర్ణం అయిన తరువాత మిగిలిన పదార్థాలు రక్తంలోకి కలిసి మూత్రనాళాల్లోకి ప్రవేశిస్తాయి. మూత్రపిండాల ద్వార రక్తం, రక్తంలోని పదార్ధాలు పలు దఫాలుగా శుద్ధి చేయబడి అవసరమైన సోడియం, క్యాల్షియం, పోటాషియం, పాస్ఫేట్ లవణ పోషకాలకు శరీరానికి అందిస్తాయి. అదేవిధంగా శుద్ధి చేయగా మిగిలిన వ్యర్థాలను బయటకు పంపుతాయి. వీపు భాగంలో వెన్నముకకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో కిడ్నీలు ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా నాలుగు సెంటిమీటర్లు, పెద్దలలో 9-12 సెంటిమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కిడ్నీ బరువు 150 గ్రాముల వరకు ఉంటుంది.

కిడ్నీ చెడిపోవడానికి కారణాలు


కిడ్నీలు ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డయాబెటిక్ నెప్రోపతి, హైపర్‌టెన్సన్, సాధారణంగా వాడే బీపీ, నొప్పుల మాత్రలు స్టెరాయిడ్, పలు రకాల మందుల వాడకం వల్ల ఇన్‌ఫక్షన్ ప్రబలి కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఈ రకమైన ప్రేరకాల వలన కిడ్నీ జబ్బులను క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ (దీర్ఘకాలిక కిడ్నీ వైపల్యం) అంటారు. పాముకాటు, విషజ్వరాలు, స్మోకింగ్, ఆల్కహాల్ కారణంగా వచ్చే కిడ్నీ సమస్యలను ఆక్యూట్ రీనల్ కిడ్నీ సమస్యగా చెబుతారు. తద్వారా బీపీ పెరుగటం, రక్తం తయారు కాకపోవడం, శుద్ధి చేయలేక పోవడం, శరీరంలో మలినాలు ఎక్కువై నీరు చేరడం, ఆమ్ల, క్షార సమతుల్యత దెబ్బతినటం వంటి ప్రధాన కారణాల వల్ల శరీరంలోని ఇతర ప్రముఖ అవయవాలు దెబ్బతినడంతో బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోను, జన్యుపరంగాను వచ్చే అవకాశాలుంటాయి. ఇన్‌ఫక్షన్‌తో వచ్చే కిడ్నీ జబ్బులు అధికంగా ఉంటాయి. వీటిని మందులతో అధిగమించవచ్చు. కిడ్నీ పూర్తిగా పని చేయకపోయినా రెండు సంవత్సరాల పైబడిన పిల్లలకు కిడ్నీ మార్పిడి చేసే అవకాశాలున్నాయి.

కిడ్నీ పాడైతే...


ఆకలి లేకపోవటం, నిసత్తువ, వాంతులు, విరేచనాలు, కాళ్లు, చేతులు, ముఖం వాపులు, జ్వరం, తలనొప్పి, ఆస్టియో పోరోసిన్ సమస్యలు ప్రధానంగా కనబడతాయి. రక్త పరీక్షలు, క్రియాటినిస్, యూరియా, అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ సిటీ స్కాన్, ఐవీపీ, ఐసోటో వరినోగ్రామ్ తదితర పరీక్షల ద్వారా కిడ్నీ పటుత్వం, సామర్థ్యాన్ని గుర్తించవచ్చు.

కిడ్నీలో రాళ్లు...


ఆహారపు అలవాట్లు, నీరు సరిపాళ్లలో తీసుకోకపోవటం, జనరిక్ సమస్యల కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఒక్కోసారి రాళ్లు నాళాలకు అడ్డుపడి కిడ్నీలు పాడవటానికి కారణమవుతాయి.

చికిత్స..


కిడ్నీ సమస్యలకు నేడు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం అందుబాటులో ఉంది. సాధారణంగా కిడ్నీలు పాడు కాకముందే సమస్యలను ప్రాథమిక నిర్దారణ ద్వారా గుర్తించి మందులతో సమస్యలను అధిగమించవచ్చు. పరిస్థితి చేయి దాటితే డయాలసిస్ ద్వారా వైద్యం అందించవచ్చు. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కిడ్నీ పాడైన వ్యక్తి బొడ్డు నుంచి ట్యూబ్ వేసి డయాలసిస్ ప్లూయిడ్ల ద్వారా చికిత్స అందిస్తారు. వారంలో రెండు మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటి దగ్గరే పేషెంట్ చేసుకోవచ్చు. రెండవ రకం హీమె డయాలసిస్ వైద్యుల పర్యవేక్షణలో రక్తనాళాల ద్వారా మిషన్ ఉపయోగించి రక్తాన్ని శుద్ధి చేస్తారు. ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది.

కిడ్నీ మార్పిడి..


అత్యంత సులువైనది, సురక్షితమైనది కిడ్నీ మార్పిడి. ప్రభ్తుత్వ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు లేక దాతలు నుంచి కిడ్నీ మార్పిడి చేయవచ్చు. ఇది నేడు సర్వసాధారణంగా మారింది. కిడ్ని మార్పిడితో మనిషికి పునర్జన్మ లభించినట్లుగా చెప్పవచ్చు. కిడ్ని మార్పిడిపై అవగాహన పెరిగింది.

నూతన ఒరవడి..


కిడ్నీ సమస్యలు అధిగమించేందుకు నేడు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కిడ్నీ మార్పిడితో పాటు నేడు కిడ్నీలోని కణాల ఆధారంగా (టిష్యు కలర్ టెక్నిక్) కిడ్నీలను రూపొందించే ఆధునిక వైద్యం శరవేగంగా అందుబాటులోకి రానున్నది.

డయాలసిస్ సేవలు ఉచితం


ప్రభుత్వ రాష్ట్రంలోని 40 ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తుంది. జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ దవాఖానాలో ప్రతిరోజు కిడ్నీ బాధితులు డయాలసిస్ చేసుకుంటున్నారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కాకముందు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ దవాఖానాల్లో డబ్బులు చెల్లించి డయాలసిస్ చేయించుకునే వారు. ఇప్పుడు ఉచితంగా సేవలు అందివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నీల విషయంలో జాగ్రతగా ఉండాలి..


కిడ్నీల విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రతగా ఉండాలి. స్థూలకాయాన్ని, ఘగర్, బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నొప్పుల మాత్రలు వైద్యుల సూచన మేరకు వాడాలి. కిడ్నీ వ్యాధులు రాకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. శరీరానికి కావాల్సినంత నీరు సేవించాలి, మద్యానికి, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. -డాక్టర్ దీపక్, కిడ్నీ నిపుణుడు

2986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles