రేపటి నుంచి హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలు

Sun,May 26, 2019 09:48 PM

Hanuman big jayanthi celebrations to be started from tomorrow

కొండగట్టులో మూడు రోజుల పాటు నిర్వహణ
తరలిరానున్న లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు

జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపటి నుంచి హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే పెద్ద జయంతి ఉత్సవాల కోసం ఆలయ ఈవో అమరేందర ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

వైశాఖ బహుళ దశమి రోజున ప్రతి సంవత్సరం కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి నిర్వహంచడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ వైశాఖ బహుళ దశమి రోజైన 29న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆలయ సంప్రదాయానుసారం మూడు రోజుల పాటు ఆలయం ముందు గల యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని నిర్వహిస్తారు. యజ్ఞంతో పాటు పూజలు, అర్చనలు, ధార్మిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆంజనేయ స్వామి క్షేత్రం సందడిగా మారనుంది.

కొండగట్టులోనే స్వామి వారికి రెండు జయంతులు


కొండగట్టు పుణ్యక్షేత్రంలోనే ఆంజనేయ స్వామి వారికి రెండు జయంతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. చైత్ర పౌర్ణమి రోజున ఉత్తర భారత దేశంతో పాటు దక్షిణ భారత దేశంలో అంజనేయ స్వామి వారి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకం, పూజాధి కార్యక్రమాలతో పాటు యజ్ఞాలు చేస్తారు. కానీ చైత్ర పౌర్ణమి రోజున కొండగట్టులో స్వామి వారి చిన్న జయంతిగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులు నిర్వహించకుండా కేవలం అభిషేకాలు, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే ఆంజనేయ స్వామి దీక్షాపరుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి స్వామి దీక్షాపరులు కొండగట్టుకు చేరుకొని తాము స్వీకరించిన దీక్షలను స్వామి సన్నిధిలో విరమిస్తారు.

వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి


వైశాఖ బహుళ దశమి రోజున ప్రతి సంవత్సరం ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతిని అనాదిగా, ఆలయ ఆచార సాంప్రదాయానుసారముగా శ్రీ స్వామి వారి తిరునక్షత్ర జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞము నిర్వహించి జయంతి రోజున పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.

తరలిరానున్న లక్షలాది మంది దీక్షాపరులు


కొండగట్టులో జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షలాది మంది ఆంజనేయ స్వామి దీక్షాపరులు కాలినడక, ఇతర మార్గాల్లో తరలి వస్తారు. మండల(41), అర్ధమండల(21), ఏకాదశ(11)రోజుల దీక్షలను స్వామి సన్నిధిలో విరమించి, అంజన్నకు మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్తుంటారు.

3 లక్షల లడ్డూ ప్రసాదం


భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. అధికారులు ముందుస్తుగానే 3 లక్షల లడ్డూలను తయారుచేసి పెట్టారు. సరిపోని పక్షంలో వెంటనే తయారుచేసేందుకు అదనపు సిబ్బందిని సైతం ఉంచినట్లు ప్రసాద తయారీ ఇన్‌చార్జి ధర్మేందర్ తెలిపారు.

ఆర్జిత సేవలు బంద్


జయంతి ఉత్సవాల నేపద్యంలో నేటి నుండి జయంతి ముగిసే వరకు ఆలయంలో అభిషేకాలు, వాహనపూజలు, సత్యనారాయణవ్రతాల వంటి ఆర్జిత సేవలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో అమరేందర్ తెలిపారు. జయంతి ముగిసిన మరుసటి రోజు శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు కొనసాగిస్తామన్నారు.

2513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles