తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం: మంత్రి అల్లోల

Fri,June 21, 2019 03:44 PM

హైద‌రాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని రాష్ట్ర‌ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పునర్జీవం పథకం మరో చరిత్ర అన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఆశించిన మేర వ‌ర‌ద నీరు రాక‌పోవ‌డంతో ఈ ప్రాజ‌క్ట్ వ‌ట్టిపోయింది, పునర్జీవం పథకంతో మ‌ళ్లీ శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్ట్ జ‌ల‌క‌ళ సంత‌రించుకోనుంద‌న్నారు. రైతాంగ సంక్షేమం కోసం ఎస్సారెస్పీకి పునర్జీవం పోయాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని చేపట్టార‌ని తెలిపారు. ఎస్సారెస్పీ పునర్జీవ ప‌థ‌కం నిర్మ‌ల్ జిల్లాకు వ‌ర‌ప్ర‌దాయిని అని, ఈ ప‌థ‌కం వ‌ల్ల జిల్లా స‌స్య‌శ్యామ‌లమ‌వుతుంద‌ని, తాగునీటి క‌ష్టాలు కూడా తీరనున్నాయ‌న్నారు. ఈ పథకంతో నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు 27, 28 ప్యాకేజీల ద్వారా ప్రాంతాలకు నీరు అందనుందని తెలిపారు. దీని వ‌ల్ల రెండు ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందుతుంద‌న్నారు. ప్యాకేజీ 27 ద్వారా స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ఆయ‌క‌ట్టుకుకు నీరంద‌నుంద‌ని చెప్పారు. కడెం ప్రాజెక్ట్, సదర్‌మాట్ బ్యారేజీ ద్వారా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి నీరు ఇవ్వవచ్చని వెల్ల‌డించారు. అంతేకాకుండా ఎస్సారెస్పీ నుంచి నిర్మ‌ల్, ఖానాపూర్, బోథ్, ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా తాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాథ్యమైందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం రికార్డుస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకొని, ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన ఇంజినీర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. . కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని మంత్రి అకాంక్షించారు.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles