శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు

Sat,September 7, 2019 01:39 PM

నిజామాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఇప్పటికే కాళేశ్వరం జలాలు మధ్య మానేరు, లోయర్ మానేరు ప్రాక్టులకు చేరగా ఇప్పుడు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో వరద కాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టుకు నీరు చేరుకుంది. దీంతో ఉత్తర తెలంగాణ రైతులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం జలాలతో వరద కాలువ జలకళ సంతరించుకోగా రైతులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టు పక్కల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాళేశ్వరం నీటితో తమ కష్టాల తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన వరమిది..


శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన వరం పునరుజ్జీవం పథకం. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని కోసం భూములిచ్చి, ఇల్లు, ఊరు మునిగిన త్యాగధనుల నియోజకవర్గం బాల్కొండ. ఈ త్యాగాల ఫలితాన్ని జిల్లాకు దక్కక పోవడానికి కారణం ఎక్కువ మాటలతో చెప్పే పనిలేదు. సీమాంధ్ర పాలకుల వివక్ష అనే ఒక్క మాటనే కారణం. త్యాగాలను సీమాంధ్ర పార్టీలు వృథామయం చేసిన ఫలితంగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు, నిజామాబాద్ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొన్న కష్టాలను, కార్చిన కన్నీటిని దృఢ సంకల్పంతో అనతి కాలంలోనే దూరం చేసేలా రివర్స్ పంపింగ్ పథకం ఇచ్చారు కేసీఆర్. ఆయనకు జిల్లా ప్రజల తరఫున సర్వదా రుణపడి ఉంటా. నేడు జిల్లాలోకి కాళేశ్వరం జలాలు చేరే పులకరింత మరుపురానిది. జిల్లా రైతు కోసం తరలివస్తున్న జలాల్లో మానాన్న దివంగత వేముల సురేందర్‌రెడ్డి గారి ఆశలు నాకు కనిపిస్తాయి. - వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి

5538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles