శంకర్ అలియాస్ నయవంచకుడు!

Tue,November 17, 2015 11:10 AM

ఆడపిల్లలను కిడ్నాప్ చేస్తారు.. వారు తొందరగా పెరిగేందుకు కొన్ని రకాల ఇంజక్షన్లు ఇస్తుంటారు.. వయసొచ్చాక వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు.. ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం.. ఇంత దుర్మార్గులూ ఉంటారా అని వేదనకు గురవుతుంటాం.. కానీ సమాజంలో ఇలాంటి ఆకృత్యాలు నిజంగా జరుగుతున్నాయంటే నమ్మగలరా? అభం శుభం తెలియని చిన్నారులను అపహరించి.. పెద్ద చేసి చీకటి కూపంలోకి నెట్టేస్తున్న నయవంచకుడి ఉదంతం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.


ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిన్నారిని ఎత్తుకెళ్లిన కేసును ఛేదించిన రైల్వే పోలీసుల దర్యాప్తులో నేర చరిత్ర కలిగిన కాంసాని శంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను 20 ఏళ్లుగా సెక్స్ మాఫియా నడిపిస్తూ ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసినట్లు బహిర్గతమైంది. ఇతనికి రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్నట్లు తెలిసింది. ఈ నయవంచకుడి చేతిలో ఇంకెంతమంది చిక్కుకున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీసులు పదేండ్ల మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వారం రోజుల కిందట విజయవాడకు చెందిన ఓ మహిళకు మాయమాటలు చెప్పి దుర్గా(5) అనే బాలికను కిడ్నాప్ చేశారు. ఈ ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నాయకుడు శంకర్‌ను అరెస్ట్‌తో అసలు భాగోతం బయటపడింది.

యాదగిరిగుట్టకు చెందిన కాంసాని శంకర్(51) 20 ఏళ్లుగా సెక్స్ మాఫియా నడిపిస్తున్నాడు. వ్యభిచారమే కాకుండా ఇతర నేరాలు కూడా చేస్తూ పలుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. వ్యభిచార గృహాలను నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల నుంచి మహిళలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకువస్తాడు. దీనికి దళారులను పెట్టుకొని వారికి కమిషన్ ఇస్తుంటాడు.

రెండేళ్ల నుంచి ఐదేండ్లలోపు ఆడ పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దళారులను నియమించుకున్నాడు. వారు పట్టణాలతో పాటు గ్రామాల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకెళ్తుంటారు. పసిపిల్లలను అపహరించినందుకు రూ. 5 వేల నుంచి 15 వేల వరకు కమీషనర్ ఇస్తుంటాడు శంకర్. చిన్న పిల్లలను అతడికి సంబంధించిన వ్యభిచార గృహాలకు తరలిస్తూ వారి అలనా పాలన చూసేందుకు కొందరికి బాధ్యతలను అప్పగించి పన్నెండేళ్లు దాటే వరకు పిల్లలను పోషిస్తాడు.

ఆడపిల్లలు త్వరగా మెచ్యురిటీ అయ్యేందుకు ఇంజక్షన్లను కూడా వాడినట్లు రైల్వే పోలీసులు నిందితుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తెలిసింది. అయితే నిందితుడు మాత్రం నోరు విప్పకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు. శంకర్ ఆగడాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య యాదగిరిగుట్ట ప్రాంతంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

చీకటి వృత్తిలోకి వచ్చిన ఒక మహిళను శంకర్ రెండో భార్యగా చేసుకున్నాడు. మహిళలను వ్యభిచార గృహాలకు తరలించడం, చిన్న పిల్లలను పెంచుతూ వారిని రొంపిలోకి దించడం చేస్తున్న ఈ కిరాతకుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. 20 ఏళ్లలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. పలువురు దళారులను అక్కడక్కడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ మాఫియా విషయంపై లోతైనా దర్యాప్తు చేయలేదు. దీంతో శంకర్ ఆగడాలను పూర్తిస్థాయిలో పోలీసులు నిలువరించలేకపోయారు. రాష్ట్ర పోలీసులకు చిక్కిన ఈ ముఠా నాయకుడి గత చరిత్రను తోడే పనిలో ఉన్నారు.

పెద్దయ్యాక నరకమే..


పిల్లలు పెద్దయ్యాక వారిని వ్యభిచార రొంపిలోకి దింపి నరకం చూపిస్తాడు శంకర్. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు.. వారిని పిల్లలు గుర్తు పట్టినా.. తల్లిదండ్రులు గుర్తు పట్టని విధంగా మార్చేసాడు. వ్యభిచార రొంపిలోకి దింపి వారిని ఒక యంత్రంలా వాడుతుంటాడు. తాను నిర్వహించే వ్యభిచార గృహాలతో పాటు బాలికలను వీరికి తెలిసిన గృహాలకు విక్రయిస్తుంటాడు. లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటాడు. కొందరు ఆ నరకంలోనే మగ్గుతూ తనువు చాలిస్తుంటారు.

ఆడపిల్లల మిస్సింగ్ కేసులపై ఆరా


పదేండ్లుగా ఎనిమిదేళ్లలోపు ఆడపిల్లలు అదృశ్యం, అపహరణ కేసులపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. రైల్వే పోలీసులు ప్రాథమిక విచారణలో మెదక్ జిల్లా జాస్తిశివనూర్, జగదేవ్‌పూర్, కరీంనగర్ జిల్లా ధర్మపురి, సిరిసిల్ల, వరంగల్ జిల్లా వంగపాడు, నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఇలాంటి ముఠాలు ఉన్నట్లు తేలింది. చిన్నప్లిలల, కిడ్నాప్, వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న వ్యవహారాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ ఆరా తీసింది. దీనిపై లోతైన దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంతమంది పిల్లలను ఈ ముఠాలు వ్యభిచార రొంపిలోకి దింపాయనే విషయాన్ని ఆరా తీసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులు వివరాలను తెలుసుకుంటున్నారు. శంకర్ చేతి కింద దళారులుగా పనిచేసిన వారు అక్కడక్కడ గతంలో అరెస్టయ్యారు? నగరంలోని రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ దళారీ అరెస్టయ్యాడు. పాత కేసులకు సంబంధించిన వివరాలను కూడా బయటకు తీస్తున్నారు.

పిల్లలను పెంచేందుకు డెన్‌లు..


శంకర్ అనుచర వర్గం ఎక్కువగా రోడ్లపైనే తిరుగుతుంటారు.. వీరంతా యాచకుల్లా నటిస్తారు. చిన్న పిల్లలను అశుభ్రమైన వాతావారణంలో పెంచుతారు. వీరి గురించి ఎవరికీ అనుమానం రాదు. పిల్లలు కొద్ది పెద్దగా అవుతున్నారంటే వారిని ఊరి శివారులో ఉండే ఇళ్లలోనే బంధిస్తారు. వాటిని వీరు డెన్‌లుగా మార్చుకుంటారు. వారుండే చుట్టు పక్కల ప్రాంతాలకు సంబంధించిన పిల్లలను ఎవరిని కూడా అక్కడ తమ వద్ద ఉంచుకోరు. వారిని నగరంలోకి తీసుకొచ్చి ఇక్కడ వారికి తెలిసిన వారి వద్ద పెంచుతారు.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles