హత్యా? ఆత్మహత్యా? ప్రమాదమా?

Sun,May 26, 2019 10:00 AM

man dies in suspected status

హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో ప్రైవేటు ఉద్యోగి మృతి చెందాడు. అయితే మృతి పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా కంచికచర్ల, పరిటాల గ్రామానికి చెందిన నవులూరి శివనాగరాజు(35) హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉంటున్నాడు. ఇతను బంజారాహిల్స్ రోడ్ నం. 8లోని మాస్ హైట్స్ బిల్డింగ్‌లోని జార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రమాదేవి అలియాస్ నవ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. నాగరాజు రోజూ ఉదయం బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వచ్చి...రాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండేవాడు.

ఉదయం కూడా ఉద్యోగానికి వచ్చిన నాగరాజుకు రాత్రి 8గంటల సమయంలో భార్య నవ్య ఫోన్ చేయ..తనకు ఆలస్యం అవుతుందని, రాత్రి 10గంటల ప్రాంతంలో బయలుదేరుతానంటూ చెప్పాడు. అయితే రాత్రి 12గంటలు అయినా భర్త ఇంటికి రాకపోవడంతో నవ్య పలుమార్లు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న భర్త స్నేహితుడు గౌతమ్‌కు సమాచారం ఇచ్చింది. కాగా... తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో మాస్ హైట్స్ బిల్డింగ్‌లోని జార్ ఎడ్యుకేషన్ సంస్థ బాల్కనీనుంచి నాగరాజు కింద పడ్డాడు. ఈ అలికిడికి బయట నిద్రిస్తున్న వాచ్‌మన్ లేచిచూడగా రక్తపుమడుగులో నాగరాజు మృతదేహం కనిపించింది.

వెంటనే వాచ్‌మన్‌తో పాటు స్థానికులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన నాగరాజు స్నేహితుడు గౌతమ్ ... విషయాన్ని అతడి భార్య నవ్యకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. బయట ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా కిందపడుతున్న మృతదేహం కనిపించింది. కార్యాలయం లో పనిచేస్తున్న వా రంతా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కనిపించింది. కాగా.. రాత్రి8.30 గంటల ప్రాంతంలో సీసీ కెమెరాలను ఆపేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు ఆపేసిన తర్వాత ఆఫీసుకు ఎవరైనా వచ్చారా? అనే అంశం పై పోలీసులు విచారణ చేపట్టారు.

మృతుడి ఒంటిపై కొన్ని గాయాలు, మెడపై కత్తిగాటు ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్య కావచ్చని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, ఇన్‌స్పెక్టర్ కళింగరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

4164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles