మాట నిలుపుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి

Wed,September 18, 2019 10:07 PM

సూర్యపేట: రెండు నెలల క్రితం ఓ వికలాంగ యువతికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. మద్దిరాల గ్రామానికి చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడంతో ఆమె కుటుంబం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసం సూర్యాపేటకు వచ్చింది. స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యంతో పాటు మానసిక వికలాంగురాలు. స్వాతిని, ఆమె అక్కను తన తల్లే కూలీ, నాలి చేసుకుంటూ చదివించింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు తరువాత ఎదో ఒక ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన స్వాతిని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెల్లగా మస్కులర్ డిస్ట్రాపి (కండర క్షీణత ) అనే అరుదైన వ్యాధి సోకిందని వైద్యులు తేల్చారు. ఆమె క్రమంగా నడవలేని స్థితికి చేరింది. మంచాన పడడం, తరువాత ప్రాణాలు హరించడం ఈ వ్యాధి లక్షణం.


నడవలేని స్థితిలో ఉన్న స్వాతి తన తల్లి, మానసిక వికలాంగురాలైన తన అక్కతో కలిసి జులై నెలలో సూర్యాపేట క్యాంపు ఆఫీస్ లో మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసేందుకు వచ్చింది. అయితే ఆటో దిగడానికి ఇబ్బంది పడుతున్న స్వాతిని చూసిన మంత్రి.. తానే స్వయంగా వారి దగ్గరకు వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి, తాను నిలుచుని దాదాపు 40 నిమిషాలతోపాటు వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే స్వాతికి పెన్షన్, ఆమె కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయడంతోపాటు.. స్వాతి వ్యాధిని అదుపులో ఉంచేందుకు కావాల్సిన ప్రోటీన్ మెడిసిన్స్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

హామీలు ఇచ్చి తరువాత వాటిని అటకెక్కించే నేతలు ఉన్న ఈ రోజుల్లో.. ఇచ్చిన హామీకి కట్టుబడి స్వాతికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి కృషి చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం.. నేడు సూర్యాపేటలోని గొల్ల బజార్లో.. డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో ఇళ్ల పట్టాలు స్వయంగా అందించడంతోపాటు.. దగ్గర ఉండి స్వాతితో పాటు ఆమె కుటుంబసభ్యులను గృహప్రవేశం చేయించారు.

దీంతో, మంత్రి గారు చేసిన సహాయం తమ కుటుంబంలో నూతన వెలుగులు నింపిందని స్వాతి కుటుంబ సభ్యులు అంటున్నారు. తనను కలిసిన రోజునే వికలాంగుల పెన్షన్ తో పాటు మా కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని, ఆ హామీని నెరవేర్చిన మంత్రి జగదీశ్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నియోజక వర్గ ప్రజలు కూడా మంత్రి చేసిన ఈ పనికి మనసారా అభినందనలు తెలుపుతున్నారు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles