నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం

Wed,November 6, 2019 06:15 PM

సూర్యాపేట: నీటి పారుదల శాఖ అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రిడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయనీ, గత పాలకుల హయాంలో ఏనాడు చూడని గోదారమ్మ పరవళ్లను చూసి అన్నదాతలు మురిసిపోతున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యల చెరువులు అలుగులు పోస్తున్నాయన్న మంత్రి.. చెరువుల నుంచి దూకుతున్న మత్తెడులు చెరువులను, కుంటలను సైతం నింపుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా వస్తున్న గోదావరి జలాలతో ప్రతీ చెరువును నింపాలని మంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువులను నింపడంతో పాటు రైతుల పొలాల గుండా వెళుతున్న పిల్ల కాలువల్లో సైతం నీటిని ప్రవహింపచేయాలన్నారు. ఇలా చేయడం కాలువల స్థితి గతులు తెలుస్తోంది అని మంత్రి అధికారులకు తెలిపారు. ఒకవేల కాళేశ్వరం జల ప్రవాహానికి ఎక్కడయినా ఆటంకాలు ఏర్పడితే అవి తొలగడానికి చేయవలసిన కార్యాచరణపై ప్రతిపాదపాదనలు సిద్ధం చేసి తమకు తెలపాలని మంత్రి అధికారులను కోరారు.


ఇప్పటికే ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ పనులకు 640 కోట్ల రూపాయలు మంజూరు అయిన నేపథ్యంలో ఆ పనుల నిర్వహణ సమయంలో అధికారులు సూచించిన పనులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రతీ ఇరిగేషన్ మండల అధికారి తమ మండల పరిధిలో ఉన్న చెరువులు, కాలువలు, కుంటలపై స్పష్టంగా అవగాహన కలిగి ఉండాలని మంత్రి అన్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ కెనాల్ కు లింకై తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజవర్గాల్లో మొత్తం 198 చెరువులు ఉండగా ఆ చెరువుల క్రింద గొలుసు కట్ట చెరువులు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. గత కొద్ది రోజులుగా వస్తున్న వరద ప్రవాహాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో 89 చెరువులు ఉండగా, ఇప్పటికే 33 చెరువులు పూర్తి స్థాయిలో గోదావరి జలాలతో నిండాయని అధికారులు మంత్రికి తెలిపారు. నిండిన చెరువుల నుండి వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులకు ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు అన్నారు. ఇక సూర్యాపేట నియోజవర్గంలో మొత్తం 86 ప్రధాన చెరువులు ఉండగా ఇప్పటికే 30 చెరువులు పూర్తి స్తాయిలో నిండి అలుగులు పోస్తున్నాయన్నారు.

మండలాల వారీగా చూస్తే ఛివ్వేంల మండలంలో 40 చెరువులకు గాను 20 చెరువులను, పెన్ పహాడ్ మండలంలో 28 చెరువులకు గాను 2 చెరువులను, ఆత్మకూరు ఎస్ మండలంలో 14 చెరువులకు 6 చెరువులు, సూర్యాపేట రూరల్ మండలంలో 4 చెరువులకు గాను 2 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని అధికారులు మంత్రికి తెలిపారు. కోదాడ నియోజవర్గంలో 23 చెరువులు ఉండగా 3 చెరువులు 90శాతం నిండినాయని అధికారులు తెలిపారు.

అధికారులు చెప్పిన వివరాలపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉంటూ వారంరోజుల్లో చెరువులన్నిటినీ నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల ప్రవాహాలు, నిర్మాణాల్లో ఏమయినా లోపాలు ఉంటే తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరోసారి ఎస్సారెస్పీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి త్వరలోనే సమీక్షా నిర్వహిస్తామన్న మంత్రి తెలిపారు. ఆ సమావేశంలో ఏమయినా లోపాలు తన దృష్టికి తీసుకువస్తే దిద్దుబాటు చర్యలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఎస్సారెస్పీ అధికారులతో చర్చిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా మంత్రి పలు సూచనలు చేశారు. తమ పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పని చేయాలన్నారు. ఏదయినా సమస్య వస్టే వెంటనే తనకు తెలిజేయాలని మంత్రి తెలిపారు. మూసి ప్రాజెక్టు తన నెత్తిన మోస్తూ 30 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నా, ఏనాడు సాగుకు నోచుకోని సోలిపేటకు కూడా త్వరలోనే నీళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

మూసి డ్యామ్ పరిస్తితి పై మంత్రి ఆరా..
జిల్లాలో గోదావరి జలాల ద్వారా నిండుతున్న చెరువుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన మంత్రి మూసి ప్రాజెక్టు పరిస్థితిపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యామ్లో ప్రస్తుతం 640 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తునట్లు చెప్పిన అధికారులు 650 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉందని చెప్పారు. రబీ పంట సాగుకు సరిపడా నీరు ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. అయితే డ్యామ్ గేట్ల నిర్వహణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్న మంత్రి రబీ నీటి విడుదల విషయాన్ని రైతులతో సమావేశం అయ్యాక ఒక నిర్ణయానికి వస్తామని అధికారులతో తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ భద్రు నాయక్, డీఈలు ప్రసాద్, స్వామి, నవీన్, ఆయా మండలాలకు చెందిన ఏఈలు పాల్గొన్నారు.

788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles