మరో పెండ్లి కోసం కొడుకును రూ.60వేలకు అమ్మేసింది...

Sun,August 25, 2019 06:14 AM

mother sold her son for second marriage in hyderabad

హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 20న జరిగిన 11 నెలల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పేదరికంతో పాటు భర్త విడిచిపెట్టడంతో కన్న కొడుకును వదిలించుకుని మరో పెండ్లి చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో కన్న తల్లే కుమారుడిని రూ. 60 వేలకు అమ్మడమే కాకుండా ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. కన్న తల్లే బిడ్డనే అమ్మేసి.. కిడ్నాప్ డ్రామా ఆడినట్లు గుర్తించారు.

ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి కథనం ప్రకా రం...ఎల్బీనగర్, గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న డేరంగుల విజయలక్ష్మి (30) రమేశ్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. విజయలక్ష్మి గర్భం దాల్చిన తర్వాత రమేశ్.. ఆమెను వదిలేసి మరో పెండ్లి చేసుకున్నాడు. విజయలక్ష్మికి బాబు పుట్టాడు. బాబు అఖిల్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుని జీవించేది. అనంతరం విజయలక్ష్మి ఎల్బీనగర్‌లోని గుంటి జంగయ్యనగర్‌కాలనీకి వెళ్లింది.

జల్సాలకు అలవాటుపడిన విజయలక్ష్మికి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో తమ మధ్య అడ్డంకిగా ఉన్న 11 నెలల కొడుకును వదిలించుకోవాలని పథకం వేసింది. పథకంలో భాగంగా.. ఈనెల 20న సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీని నుంచి బయటకు వెళ్తుండగా.. ఒక్కసారిగా కండ్లు తిరిగి కింద పడిపోయానని.. ఓ మహిళ, వ్యక్తి బైకు (టీవీఎస్ మోటర్ టీఎస్07 ఎఫ్‌జే0203)పై వచ్చి తన కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు స్థానికులకు తెలిపింది.

సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బైకు నంబర్ ఆధారంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలుడి కిడ్నాప్ కేసులో కొత్త కోణం బయటపడింది. జల్సాలకు అలవాటు పడటమే కాకుండా మరో పెండ్లి చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్న విజయలక్ష్మి .. తన కొడుకును వదిలించుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

రంగారెడ్డి జిల్లా ఫారుఖ్‌నగర్ మండలం, చాతన్‌పల్లి గ్రామం, రాంనగర్‌కు కాలనీకి చెందిన ఓరుగంటి మోష (33)కు విజయలక్ష్మి బాబును రూ. 60 వేలకు అమ్ముకున్నట్లు తేలింది. బాలును అమ్మిన తల్లితోపాటు కొన్న ఓరుగంటి మోషను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారి అఖిల్‌ను పోలీసులు రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు అప్పగించారు. సదరు బాలుడిని సీడబ్య్లూసీ సభ్యులు యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు.

3112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles