‘స్పందన’ కోసం స్పందించరూ..!

Sat,October 28, 2017 12:05 PM

-దీపావళి రోజు కాలిన చిన్నారి ముఖం, శరీరం
-వైద్య ఖర్చులకు అడ్డొస్తున్న పేదరికం
-మూడేళ్ల క్రితమే తండ్రి మృతి
-ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..


వరంగల్ అర్బన్ : ఆడుతూ.. పాడుతూ బడికి వెళ్తున్న ఆ చిన్నారిని విధి వెక్కిరించింది. అసలే తండ్రి లేని ఆ కుటుంబానికి అన్ని తానై కూలి పని చేస్తూ పిల్లల్ని పోషించుకుం టున్న ఆ తల్లి ఇప్పుడు కూతురు ధీనావస్థను చూసి కుంగిపోతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ చిన్నారిని చూసి కన్నీరు కార్చని వారు లేరంటే అతియోశక్తి కాదు.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని పెంచికల్‌పేట గ్రామానికి చెందిన జన్ను రమేశ్-రజితలకు ఒక కొడుకు(11), కూతురు స్పందన(9) ఉన్నారు. రమేశ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రమేశ్ గుండెపోటుతో మూడు సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. దీంతో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయినా రజిత కూలి పని చేసుకుంటూ అన్నీతానై వెల్లదీస్తోంది. కొడుకు, కూతురిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. కొడుకు 7వ తరగతి, కూతురు స్పందన 4వ తరగతి చదువుతున్నారు. స్పందన చదువులో చురుకైన విద్యార్థినిగా పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు.

విషాదం నింపిన దీపావళి..
దీపావళి రోజున కాల్చే పటాసులు రజిత కుటుంబంలో మరో విషాదాన్ని నింపింది. దీపావళి రోజు సెలవుదినం కావడంతో పిల్లలిద్దర్ని ఇంటి దగ్గరే వదిలేసి తల్లి రజిత కూలి పనికి వెళ్లింది. అయితే చిన్నారి స్పందనకు అందరిలాగే బాణసంచా కాల్చాలనే సంతోషంతో తోటి పిల్లలు కాల్చి వదిలేసిన టపాకులన్నింటినీ ఏరుకొని తెచ్చుకుంది. ఇంటి ముందు గల కట్టెల పొయ్యిలో బాణసంచా వేసి కాల్చే ప్రయత్నం చేసింది. అవి ఒక్కసారిగా పేలి స్పందనకు అంటుకున్నాయి. దీంతో స్పందన మొహం పూర్తిగా కాలడంతో పాటు కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలకు మంటలు అంటుకున్నాయి.

దీంతో చిన్నారి అరుపులను చూసిన చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. అనంతరం చికిత్సకు ఎంజీఎంకు తరలించగా, అక్కడి వైద్యులు ఏదైనా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ తన కూతురిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే స్పందనకు చికిత్సకు రూ.80 వేల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు తెలపడంతో రజిత దిక్కుతోచని స్థితిలో పడింది. అంత డబ్బులు ఇచ్చుకోలేనని, 30వేల వరకు ఎక్కడైనా తెచ్చి ఇస్తానని తన బిడ్డను కాపాడాలని వైద్యుల కాళ్ల మీద పడి ప్రాదేయ పడడంతో వైద్యులు చికిత్స చేశారు. నాలుగైదు రోజులు దవాఖానలో ఉంచుకున్న యాజమాన్యం వారి ఆర్థిక పరిస్థితి చూసి పంపించారు. వారం రోజులకు మళ్లీ రావాలని చెప్పారు.

వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు
స్పందనను ఎలాగైనా బతికించుకోవాలనే ఆశతో తల్లి రజిత తోచినకాడల్లా అప్పులు చేసి రూ. 30 వేలతో చికిత్స చేయించింది. అయితే ఇప్పుడు చిన్నారి స్పందనకు అయిన గాయాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. కంటిచూపు సరిగా లేదు. మాటలు రావడం లేదు. ఇంకా మెరుగైన చికిత్స తీసుకోవాల్సి ఉంది. డబ్బులు ఉంటే చిన్నారి మెరుగ య్యే వరకు వైద్యులు దవాఖానలోనే ఉంచుకునేవారు. అయితే వారి ఆర్థిక పరిస్థితి చూసి పంపించారు. ఇప్పుడు తల్లి రజిత అపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

ఇన్నాళ్లు కూలి చేసిన పనులతో బతకడానికే సరిపోయిందని, ఇప్పుడు డబ్బులు లేకపోవడంతో తన కూతురికి మెరుగైన చికిత్స చేయించలేకపోతున్నానని కన్నీటి పర్యాంతమవుతోంది. తన బిడ్డ ప్రాణాలకు కాపాడాలని, ఎవరైనా దాతలు సాయం చేయాలని ధీనంగా వేడుకుంటోంది. వారి కుటుంబ పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యాంతమవుతున్నారు. దయార్థులు మెరుగైన చికిత్స అందించేందుకు ఆర్థిక సహాయం చేయాలని, 9704103175(రజిత) నంబర్‌ను సంప్రదించాలని స్థానికులు, పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.

2111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles