ఎల్లమ్మ కల్యాణ మహోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష

Sat,June 15, 2019 08:18 AM

బేగంపేట : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో జూలై 9వ తేదీన జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, మహంకాళి బోనాల జాతరను ప్రతిఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మవారి కల్యాణం సందర్భంగా జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, ఆర్‌అండ్‌బీ, పోలీస్, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ తదితర శాఖల సమన్వయంతో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయ పరిసరాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయడం, ఎలాంటి చెత్తాచెదారాలు ఉన్నా వెంటనే తొలిగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మ్యాన్‌హోల్స్ లీకేజీలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా భారీకేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటిని పంపిణీ చేసేందుకు సుమారు లక్ష వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. జూలై 9న అమ్మవారి కల్యాణం, 10న ఊరేగింపు సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొనకుండా తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్‌లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చారని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

1431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles