ఆర్టీసీ డ్రైవర్‌కు అస్వస్థత.. బస్సు నడుపుతుండగానే చాతిలో నొప్పి

Wed,January 23, 2019 09:40 PM

పెద్దపల్లి: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు చాతిలో నొప్పి రాగా, బస్సులోనే ఉన్న ఇద్దరు సింగరేణి ఉద్యోగులు, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల ప్రాణాలను కాపాడారు. ఆపదలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు ఆర్థికసాయం అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ దవాఖానకు తరలించేందుకు ప్రయాణీకులు కూడా సహకరించి మానవత్వం చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్సు డిపో నుంచి యైటింక్లయిన్ కాలనీ మీదుగా హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. కమాన్‌పూర్ మండల కేంద్రానికి చేరుకోగానే బస్సు డ్రైవర్ మహేందర్‌కు ఛాతిలో నొప్పి రాగా, విషయాన్ని కండక్టర్ రాణికి వివరించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన రాణి, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఉన్న అసిస్టెంట్ డిపో కంట్రోలర్ రాజ్‌కుమార్‌కు ఫోన్‌లో సమాచారం అందించింది.

దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్ మహేందర్‌కు ప్రథమ చికిత్స అందించడానికి పెద్దపల్లి బస్టాండ్‌లో సిద్ధంగా ఉన్నారు. అయితే నొప్పితోనే మహేందర్ బస్సును కమాన్‌పూర్ నుంచి పెద్దపల్లి రహదారిలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని రాఘవాపూర్ దాకా నడుపుతూ వచ్చాడు. నొప్పి తీవ్రం కావడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి దవాఖానలో పని చేస్తున్న చంద్రశేఖర్‌రావు సమయస్ఫూర్తితో వ్యవహరించి డ్రైవర్ మహేందర్‌కు ప్రథమ చికిత్స అందించారు.


మార్గమధ్యంలోనే బస్సు ఆగిపోవడంతో అందులోనే ప్రయాణిస్తున్న సింగరేణి సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్న తిరుపతి, ఆర్టీసీ అధికారుల సూచన మేరకు రాఘవాపూర్ నుంచి బస్సును పెద్దపల్లి బస్టాండ్ దాకా తీసుకువచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆర్టీసీ అధికారులు డ్రైవర్ మహేందర్‌ను హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అస్వస్థకు గురికాగా, పెద్దపల్లి ప్రజలు చికిత్స కోసం ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

3517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles