హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. గత మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, సమ్మె విరమిద్దామని మెజారిటీ కార్మికులు విజ్ఞప్తి చేయడంతో సమ్మె విరమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేపటి వరకు హైకోర్టు తీర్పు ప్రతి అందుతుందని దానికి తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమ్మెపై ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేమని నిన్న హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి, న్యాయనిపుణులతో చర్చించాక తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక నాయకులు తెలిపినప్పటికి సమ్మెకు ముగింపు పలకాల్సిందేనని మెజార్టీ కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు తెలిపినట్లు సమావేశం అనంతరం మీడియాకు ఆర్టీసీ నాయకులు తెలిపారు.