రైతుబంధు పథకానికి నిధులు విడుదల

Mon,June 3, 2019 03:17 PM

rythu bandhu scheme fund released

హైదరాబాద్: రైతుబంధు పథకానికి నిధులు విడుదల అయ్యాయి. రూ.6900 కోట్ల నిధులు విడుదల చేస్తూ పాలనా అనుమతులు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు పథకం అమలుకానుంది. ఖరీఫ్, రబీ పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతుబంధు అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి శనివారం విడుదలచేశారు. గతేడాది సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఈ వానకాలం నుంచి దానిని రూ.5 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీఇచ్చారు. అందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలం నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకు అందజేస్తారు. ఆర్బీఐకి చెందిన ఈ-కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తామని పార్థసారథి తెలిపారు. పట్టాదార్ పాస్‌పుస్తకం ఉన్న రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా ఉన్నవారందరికీ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందజేస్తుంది. తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులెవరైనా ఉంటే.. గివ్ ఇట్ అప్ ఫారాన్ని మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలా మిగిలిన పెట్టుబడి సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందజేస్తారు. గివ్ ఇట్ అప్‌పై రైతుల్లో విరివిగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాల భూమి


రైతులకు పంటసాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే10న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి ముందు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగు కూలీ ఖర్చులకోసం అన్నదాతలకు ఈ సాయం ఉపయోగపడాలన్నదే సర్కారు ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. 58.33 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల్ని అందజేసింది. రాష్ట్రంలో వానకాలంలో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే, యాసంగిలో 31.92 లక్షల ఎకరాలు ఉంటున్నది. 2018-19 సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4 వేలు చొప్పున వానకాలంలో 51.50 లక్షల మంది రైతులకు రూ.5,260.94 కోట్లు, యాసంగిలో 49.03 లక్షల మంది రైతులకు రూ.5,244.26 కోట్లు అందజేశారు. రాష్ట్రంలో పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతంగా ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.

పథకం పర్యవేక్షణకు కమిటీలు


ఈ ఏడాది రైతుబంధును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసింది. రాష్ట్రకమిటీలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, కమిషనర్ కన్వీనర్‌గా, మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా వ్యవసాయాధికారి ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఫిర్యాదులను స్వీకరించే కమిటీలను కూడా సర్కారు ఏర్పాటుచేసింది. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఫిర్యాదుల కమిటీలను కలెక్టర్ ఏర్పాటుచేస్తారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటవుతుంది. ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ-కుబేర్ ద్వారా రైతులకు అందిన సాయంపై ఆడి ట్ కూడా ఉంటుంది. ఆర్బీఐ, నాబార్డ్, కాగ్ నిబంధనల ప్రకారం ఆడిట్ జరుగుతుంది. కాగ్ లేదా ఆర్బీఐకి చెందిన ఆడిటర్లు ఆడిట్ నిర్వహించే అవకాశం ఉన్నదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

10716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles