అంగరంగ వైభవం.. శివపార్వతుల కల్యాణోత్సవం

Fri,March 22, 2019 08:12 PM

shivakalyan mahotsavas started today in vemulawada temple

వేములవాడ: రాజన్న ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న శివకల్యాణ మహోత్సవాలు ఇవాళ‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఇటు రాజన్న ఆలయ ప్రాంగణంలో, అటు పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం గుబాళిస్తున్నది. ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివభగత్పుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం తదితర విశేష పూజలను నిర్వహించారు.

కల్యాణ మహోత్సవానికి ఆచార్యదంపతులుగా గోపన్నగారి వసంత్, సరిత వ్యవహరించగా వారికి, బ్రాహ్మణ అర్చకులకు, జంగమ అర్చకులకు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వర్ణి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దాదాపు 70 మంది బ్రాహ్మణులు వర్ణి తీసుకున్నారు. అనంతరం రుత్విక్‌వరణం, మంటప ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ తదితర పూజలను నిర్వహించారు.

సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి అద్దాల మంటపంలో మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, సంస్కృతపండితులు, అష్టావధాని తిగుళ్లు శ్రీహరిశర్మ చేసిన శివపురాణ ప్రవచనం భక్తులను అలరించింది. రాత్రి 7 గంటల నుంచి భేరిపూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. పూజల్లో ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, కాంచనపెల్లి నటరాజ్, రాజేశం, గోలి శ్రీనివాస్, ఆలయ ఇన్స్‌పెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రేపు కల్యాణం


శనివారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామివారి అద్దాలమండపంనందు ఆదిదంపతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. అనంతరం ప్రధాన హోమసప్తపది, లాజా హోమం, ఔపాసనం, స్థానిక జంగమయ్యలతో శరభగజ్జెల కార్యక్రమంతో బలిహరణం, రాత్రి 8 గంటలకు ఆదిదంపతులను పెద్దసేవలో అలంకరించి శోభాయాత్రను నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో రాజేశ్వర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles