ఈ నెల 31న తెలంగాణ జానపద జాతర

Sat,August 24, 2019 09:30 PM

telangana janapada jatara on 31st august 2019

హైదరాబాద్ : నగరవాసుల ముందుకు జానపద జాతర వస్తోంది. వేలాదిగా జానపద కళాకారులు, కళా బృందాలు నగరం నడిబొడ్డులో ఆడి పాడనున్నారు. జానపదం అంటే ఇష్టమైన వారు, కళాభిమానులు, నగరవాసులను రంజింపజేయనున్నారు. కొన్ని యేళ్లు, దశాబ్దాల క్రితం ఎప్పుడో.. ఎక్కడో చూసిన కళారూపాలు మన ముందుకు వస్తున్నాయి. దాదాపు 56 కళా రూపాలు నగరవాసులను ఆకట్టుకునేందుకు రవీంద్రభారతి వేదిక మీదకు వచ్చేస్తున్నాయి. జానపద ప్రదర్శన కళలకు తెలుగు నేల అధిక దిగుబడితో పండిన పంట, పొలము లాంటిది. ఎన్నో రకాల జానపద ప్రదర్శన కళలు తెలుగు నేలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలే. ప్రాచీన సమాజంలో వినోదం కోసం ప్రజలకు జానపద కళా మాద్యమం తప్ప మరోటి లేదు.

జన జీవనంలో, జాతి సాంస్కృతిక వారసత్వంలో అత్యంత కీలకమైన అభివ్యక్త రూపాలు జానపద కళారూపాలు. తెలంగాణ జానపద కళలకు తరగని ఖజానా అన్న ఈ విషయాన్ని పురస్కరించుకొని 2015వ సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు జానపద జాతర అని ప్రభుత్వం, పెద్దలు పేరు పెట్టారు. జానపద కళలు, కళారూపాలు ప్రపంచ వ్యాప్తంగా ఉండటం వల్ల యునెస్కో వారు ఈ కళారూపాలను గుర్తించారు. ప్రదర్శన కళలను విశ్వవ్యాప్తం చేసే దిశలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజున ఈ వేడుకను నిర్వహించుకునేలా ఆగస్టు 22న ప్రపంచ జానపద దినోత్సవంను చేపడుతున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జానపద కళారూపాలు, కళా ప్రదర్శనలతో రవీంద్రభారతిలో ఈ నెల 31న జానపద జాతరను నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న 56 కళా రూపాల ప్రదర్శనలను రవీంద్రభారతిలోని ప్రధాన వేదికపై నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి నగరానికి జానపద సంబరం రానుంది. నగరంలో ఒక రోజంతా ప్రపంచ జానపద దినోత్సవాన్ని, జానపద జాతరను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ప్రదర్శించనున్న జానపద కళలు


తెలుగు వారి జానపద కళారూపాలైన సంగీతం (కర్ణాటక, గాత్రం), కీర్తనలు; నాట్యం (కూచిపూడి, చెంచు భాగోతం, భామా కలాపం, బుర్రకథ, తోలు బొమ్మలాట, బుట్ట బొమ్మలు, తప్పెట గుళ్లు, లంబాడీ, బోనాలు, కోలాటం, ఉరుము, కత్తి - కర్రసాము, కొమ్ము కథ, కొమ్ము బూరలు, కొమ్ముల నృత్యం లేదా రేలా, గరగ, గరిడి, ఒగ్గు కథ, గురవయ్యలు, గొల్ల సుద్దులు, చెక్క భజన, యక్షగానం, చిందు యక్షగానం, చెక్క బొమ్మలాట, జడ కోలాటం, డప్పులు, తంబూర, పగటి వేషాలు, పల్లె సుద్దులు, పులి వేషాలు, వీధి భాగోతం, కలంకారీ, కుర్రు నృత్యం, సిద్ధి నృత్యం); హస్త కళలు (చిత్రలేఖనం, కళంకారి, నగిషీ, ముగ్గులు); ఇంకా శిల్పకళల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఉంటాయి.

జానపద కళల ఔన్నత్యాన్ని ప్రదర్శించేందుకే జాతర


తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు.. జానపద కళలకు తరగని ఖజానా. ఈ విషయాన్ని పురస్కరించుకొని ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జానపద జాతరను నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జానపద కళల ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రత్యేకంగా జాతరను ఏర్పాటు చేశాం. గతంలో మన కళలకు, వాటి ఉన్నతికి పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఈ ఐదేండ్లలో ఎన్నో కళలను, కళాకారులను పదిలపర్చుకున్నం. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జానపద ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నం. మనవైన కళలలోని మాధుర్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ జాతర సందర్భంగా మరొకసారి ఆవిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ప్రదర్శన కళలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నం. గతంలో అన్ని జిల్లాలలో జరుపుకున్నం. ప్రస్తుతం, ఒకే వేదికపై అన్ని కళలను ప్రదర్శించుకునేందుకు సిద్ధమవుతున్నాం. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్త జాతరను రవీంద్రభారతి వేదికపై నిర్వహిస్తున్నం.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles