ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు: సీఎం

Sat,November 2, 2019 08:56 PM

హైదరాబాద్: ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగినట్లు సీఎం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు అహంకార పూరితంగా సమ్మెకు వెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం మీడియాకు తెలిపారు. 4 సంవత్సరాల్లో కార్మికులకు 67 శాతం జీతాలు పెంచిన ప్రభుత్వంపై సమ్మెకు వెళ్లడం శోచనీయమని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఈ మేర జీతాలు పెంచడం ఏ ప్రభుత్వం చేయలేదనీ, చేయదు కూడా అని ఆయన చెప్పారు. ఆర్టీసీ ప్రస్తుతం 10,400 బస్సులు నడుపుతున్నదనీ, అందులో 2100 అద్దె బస్సులు నడుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పుడు కొత్తగా మరో 3000 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మె న్యాయబద్దమైంది కాదని లేబర్ కమిషనర్ ఇదివరకే ప్రకటించినట్లు సీఎం గుర్తు చేశారు. పనికిమాలిన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారనీ, దేశంలో చాలా రాష్ర్టాల్లో ఆర్టీసీ లేదు. మన రాష్ట్రంలో ఆర్టీసీ బ్రహ్మాండంగా నడుస్తోందనీ.. వారికి గౌరవప్రదమైన వేతనాలు అందించినా సమ్మెకు వెళ్లడం విచారకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డమైన యూనియన్ల నిర్ణయాల వల్ల కార్మికులు తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని సీఎం అన్నారు. ఈ యూనియన్లకు తోడు ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేసి, కార్మికుల మరణానికి కారణమయ్యారని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

1409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles