కడియం సారథ్యంలో వేలాది మంది కాళేశ్వరం సందర్శన

Wed,September 4, 2019 07:43 PM


తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సారథ్యంలో వేలాది మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కాళేశ్వరం సందర్శనలో పాల్గొన్నారు. తొలుత కడియం శ్రీహరి వరంగల్, మడికొండ వద్ద వాహనాలకు జెండా ఊపి కాళేశ్వరం సందర్శన యాత్రను ప్రారంభించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ని చూసి.. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే అన్నం తిని అన్నారం బ్యారేజిని చేరుకుని అక్కడి నుంచి హన్మకొండ కు తిరిగి పయనమయ్యారు. కడియం అభిమానులు, గులాబీ శ్రేణులు స్టేషన్ ఘన్ పూర్ నుంచి కాళేశ్వరానికి వందలాది వాహనాల్లో వేలాదిగా తరలి వచ్చారు. ఒక్క పిలుపుతో తరలిన జనాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.


మీకు అండగా నేనున్నా...నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్పూర్ ప్రజలను ఎన్నడూ మర్చిపోలేను. వారి రుణం తీర్చుకుంటాను. అన్నా కష్టం ఉంది అని నా ఇంటి తలుపు ఎప్పుడు తట్టినా మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యను పరిష్కరిస్తాను. ఇంతకు ముందు నాకు చిన్న ఇల్లు ఉండేది. కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి వచ్చిన వారు ఇంటి బయట, చెట్ల కింద ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొద్దిగా పెద్ద ఇల్లు కట్టుకున్నా...ఎప్పుడు వచ్చినా నా ఇంట్లోకి వచ్చి కూర్చునే వసతి ఉంది. నాకు రాజకీయ జన్మ నిచ్చిన మీకు ఎంత చేసినా తక్కువే...మీ రుణం తీర్చుకునే విధంగా, మీరు ఎప్పుడు గర్వపడేలాగే నేను పని చేస్తాను. నా వల్ల చిన్న తప్పు కూడా జరగకుండా, మీరు తలదించుకునేలా లేకుండా ఉంటాను.మన అందరికి అండగా సీఎం కేసీఆర్ ఉండగా..మనం దేనికి చింతించాల్సిన పని లేదన్నారు.

జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు..


హన్మకొండ, మేడిగడ్డ, అన్నారం వద్ద కడియం శ్రీహరి మాట్లాడుతూ..సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్లా అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులు కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నిస్సిగ్గుగా తినేసి, జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి రాష్ట్రాన్ని పీక్కు తిన్నాదని ధ్వజమెత్తారు. ఈ కాంగ్రెస్ నేతలు
ఏసీబీ, సీబీఐ, ఈడి కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు.

దేశంలో అవినీతి పై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకే. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ ఉలికి, ఉలికి పడుతోంది. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీజేపీ ఉందా అని అడుగుతున్నా? బీజేపీ కి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కే లేదు. నరేంద్రమోదీ నాయకత్వం లో గత 5 ఏళ్లలో తెలంగాణ కి ఒరగబెట్టింది ఏమి లేదు. ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వమని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పార్టీ బీజేపీ అని ఆరోపించారు.



కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కి నిధులు ఇవ్వకుండా, రాష్టాన్ని పట్టించుకోకుండా ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర. శతాధిక వృద్ధుడైన కాంగ్రెస్ పార్టీ అంపశయ్య పై ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. నూనూగు మీసాల నవ యవ్వనంలో ఉన్న పార్టీ.
ముసలితనం సంతరించుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఇపుడే అడుగులు వేస్తున్న బీజేపీ నవ యవ్వనంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో పోటీ పడలేవు. అందుకే తెలంగాణలో అసలు సిసలు బాహుబలి కేసీఆర్. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మన సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం. ప్రపంచంలో ని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు కు 82 వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయంలో ఇప్పటి వరకు 53వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి లబ్ది పొందే జిల్లా మన ఉమ్మడి వరంగల్ అని అన్నారు. ఇప్పటికే మిడ్ మానేరుకు నీరు చేరింది. తరవాత లోయర్ మానేరుకు వస్తుంది. మిడ్ మానేరు లో 25 టీఎంసీల నీరు, లోయర్ మానేరు లో 25 టీఎంసీ ల నీరు నిండి ఇక్కడి పొలాలు సస్యశ్యామలం అవుతాయి.తెలంగాణ లోని 33 జిల్లాల్లో 22 జిల్లాలకు దాదాపు 45 లక్షల ఎకరాలకు నీరు అందించే తెలంగాణ వర ప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మూడేళ్ళలో దీనిని సాకారం చేసి ఒక ఇంజనీరింగ్ మహా అద్భుతాన్ని ఆవిష్కరించిన మన సీఎం కేసీఆర్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, నీటి పారుదల నిపుణులు ప్రశంసిస్తుంటే..ప్రతిపక్షాల విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

సాధారణంగా ఎత్తిపోతల పథకానికి ఖర్చు ఎక్కువే ఉంటుంది. నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు చూడాల్సింది ఖర్చు గురించి కాదు. ఒక్క పంటకు కూడా నీరు రాని గ్రామాలకు ప్రాజెక్టుల ద్వారా నీరు వస్తే ఆ గ్రామ ఆర్థిక స్వరూపమే మారుతుంది. స్థితిగతులు మారుతాయి. జల వనరులు వస్తే కొంతమంది కేవలం వ్యవసాయం మాత్రమే అవుతుంది అనుకుంటారు. కానీ జలం ఉన్న చోటే నాగరికత, అభివృద్ధి ఉంటుందని చరిత్ర చూస్తే అర్థం అవుతుంది. జలవనరులుంటే వ్యవసాయంతో ( గ్రీన్ రెవల్యూషన్) పాటు మత్స్య పరిశ్రమ(బ్లూ రెవల్యూషన్), పాడి అభివృద్ధి( వైట్ రెవల్యూషన్) జరుగుతుంది.

ఇన్ని రకాలుగా మేలు జరిగే ప్రాజెక్టు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో నిర్మాణం అవుతుంటే...ఈ అభివృద్ధిలో ప్రతిపక్షాలు కూడా పాలు పంచుకోవాలని, చవకబారు విమర్శలు మానుకోవాలని కోరుతున్నాను. ప్రపంచంలో నే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. అందుకే ఇంతటి గొప్ప ప్రాజెక్టును స్వయంగా చూసి ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని ఈ ప్రాజెక్టు సందర్శన ఏర్పాటు చేశాం.ఇకపై మీ గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవరైనా అవాకులు, చెవాకులు మాట్లాడితే మీరు ధీటైన సమాధానం చెప్పడానికి ఈ సందర్శన ఉపయోగపడుతుంది.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles