టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం..కాంగ్రెస్‌లో నిస్తేజం

Wed,October 23, 2019 10:58 AM

సూర్యాపేట: రెండు తెలుగు రాష్ర్టాల దృష్టిని ఆకర్షించిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం రేపు వెల్లడికానుంది. నల్లగొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతున్న ఈ స్థానంలో తొలిసారి విజయం కోసం అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ముందు నుంచి పక్కా ప్రణాళికతో పని చేసింది. బూత్‌ స్థాయిలో ప్రతి ఓటరునూ చేరేలా ఆ పార్టీ నాయకులు చేసిన కృషి చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన శానంపూడి సైదిరెడ్డినే టీఆర్‌ఎస్‌ మరోసారి అభ్యర్థిగా నిలబెట్టింది.


కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే అయిన పద్మావతి పోటీలో నిలిచారు. బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి సహా స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మొత్తం 28మంది హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. ఈ నెల 21న పోలింగ్‌ జరగ్గా.. రేపు ఫలితాలు వెల్లడించనున్నారు.

ఓట్ల లెక్కింపుకు ముందే స్పష్టమైన అంచనాలు..

రాష్ట్రమంతటా ఒకే ఒక ఉప ఎన్నిక జరుగుతుండడంతో పలు మీడియా, సర్వే సంస్థలు హుజూర్‌నగర్‌ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. పోలింగ్‌ జరుగుతుండగానే ఓటరు నాడి పసిగట్టే పనిని చాణక్య, ఆరా వంటి సంస్థలు చేపట్టాయి. ఆయా సంస్థలు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం అని తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో వెల్లడించాయి. దీంతో ఓట్ల లెక్కింపుకు ముందే టీఆర్‌ఎస్‌ విజయంపై ధీమాగా ఉంది. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని తెలిసి కాంగ్రెస్‌ నేతల్లో నిరుత్సాహం ఆవహించినట్లు కనిపిస్తోంది. పోలింగ్‌ తర్వాత ఒక్క ముఖ్య కాంగ్రెస్‌ నేత కూడా మీడియా ముందుకు రాకపోవడం ఆ పార్టీ నిస్తేజానికి నిదర్శనం.

కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ ఓట్లు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న బీజేపీ, టీడీపీలు సైతం ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత చడీ చప్పుడు చేయడం లేదు. ప్రస్తుతానికి ఎన్నెన్నో అంచనాలు నెలకొన్నా.. తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశం పైనే ప్రస్తుతం ఇటు తెలంగాణతోపాటు అటు ఆంధ్రాలోనూ ఆసక్తి నెలకొంది. రేపు మధ్యాహ్నానికి వెలువడనున్న ఫలితంతోనే ఆ ఉత్కంఠకు తెరపడనుంది.

2803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles