కరీంనగర్ జెడ్పీ అధ్యక్షురాలిగా విజయ

Sat,June 8, 2019 08:01 PM

vijaya elected as karimnagar zp chairman

కరీంనగర్ జెడ్పీ అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షురాలిగా ఇల్లంతకుంట జడ్పీటీసీ సభ్యురాలు కనుమల్ల విజయ, ఉపాధ్యక్షులుగా సైదాపూర్ జడ్పీటీసీ సభ్యులు పేరాల గోపాల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కో ఆప్షన్ సభ్యులుగా కరీంనగర్ మండలం ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎండీ షాబీర్‌పాషా, రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన మహ్మద్ షుక్రుద్దీన్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ప్రకటించారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, తదితరులు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచుకుని, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అంతకుముందు స్థానిక శ్వేతా హోటల్‌లో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలతో జడ్పీటీసీ సభ్యులు సమావేశమయ్యారు. అక్కడి నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం - మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలోని అన్ని జెడ్పీ స్థానాలపై టీఆర్‌ఎస్ జెండా ఎగుర వేశామని, అన్ని జిల్లాల్లో పార్టీ ఏకపక్ష విజయం సాధించిందని, ఇది కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో ఏ పార్టీకి కూడా ఇంత పెద్ద విజయం లభించలేదన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

కొత్తగా ఎన్నికైన జెడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లనే పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందని తెలిపారు. ప్రతి పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముందుంటామని స్పష్టం చేశారు.

3278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles