ఓ యువతితో నిశ్చితార్థం, మరో యువతితో పెండ్లి

Mon,October 14, 2019 09:36 AM

జవహర్‌నగర్ : ఓ యువతిని పెండ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువకుడు మరో యువతిని పెండ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిశ్చితార్థం జరిగిన యువతి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు జిల్లాకు చెందిన గోర్ల సుబ్బలక్ష్మి అనే మహిళ యాప్రాల్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటుంది. సుబ్బలక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె మల్లీశ్వరి(24)ఉన్నారు. వీరి బంధువైన సుధాకర్‌తో మల్లేశ్వరికి నిశ్చితార్థం జరిగింది.


కొన్ని రోజులు తరువాత సుధాకర్ పెండ్లి విషయాన్ని దాటవేస్తూ ఉండటంతో సుబ్బలక్ష్మి ఏప్రిల్, 2019 నెలలో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెండ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకోవడంతో సమస్య సమసిపోయింది. కాగా, ఈనెల 9న నెల్లూరు జిల్లా కేంద్రంలో సుధాకర్ మరో యువతిని పెండ్లి చేసుకున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న మల్లీశ్వరి ఈనెల 11న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మల్లీశ్వరిని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles