తరుచుగా ఈ సమస్యేమిటి?


Mon,March 18, 2019 01:02 AM

నా వయస్సు 21. ఈ మధ్య తరుచుగా పొట్టలో నొప్పి వస్తున్నది, ఉబ్బుతున్నది. చాలా ఇబ్బందిగా ఉంటున్నది. తరుచూ విరోచనాలు కూడా అవుతున్నాయి. స్టమక్ అప్ సెట్‌గా ఉంటున్నది. డాక్టరుకు చూపించితే ఆయన ఐ.బి.ఎస్. అని నిర్ధారించారు. అసలు ఈ వ్యాధి ఏమిటి? ఎందువల్ల వస్తుంది? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలుపండి.
- ఎ. నాగసాయి, మహబుబ్‌నగర్.

couns
ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ (ఐ.బి.ఎస్.) సర్వసాధారణంగా కనిపించే జీర్ణవ్యవస్థ వ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధి పలు సమస్యల సమాహారం. గ్యాస్ట్రో ఇంటర్‌స్టయినల్ డిజార్డర్స్‌కు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ అంచనాల ప్రకారం మనదేశ జనాభాలో 12 నుంచి 18 కోట్ల మంది ఐ.బి.ఎస్.తో బాధపడుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. ఐ.బి.ఎస్. కు కారణం ఇది అని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. చిన్నపాటి ప్రేరణకే పెద్ద పేగు అతిగా స్పందించడం ఈ వ్యాధికి ఒక కారణం కావచ్చు. నెమ్మదిగా, ఒక క్రమం ప్రకారం ఉండే పెద్ద పేగు కండరాల కదలికలు ఈ అతి స్పందన వల్ల జీర్ణవ్యవస్థ అస్థవ్యస్థం అవుతుంది. అదే సమయంలో కొన్ని ఆహారపదార్థాలు, ఔషధాలు, మానసిక ఉద్వేగాలు కూడా ఐ.బి.ఎస్.ను ప్రేరేపిస్తుంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కోరకం ఆహారపదార్థాలు, కొన్ని మందుల వల్ల ఐ.బి.ఎస్. ఏర్పడుతుంది. ఐ.బి.ఎస్.లో భిన్న లక్షణాలు కూడా వ్యక్తమవుతుంటాయి. ఈ వ్యాధి వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడుతుంది.

మరికొందరికి విరేచనాలు అవుతుంటాయి. కొందరిలో ఈ రెండు లక్షణాలూ కనిపిస్తుంటాయి. పొట్ట ఉబ్బిపోతుంది. విరేచనాలు లేదా మలబద్దకం ఏర్పడుతుంది. మన దేశ జనాభాలో అత్యధికులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా జీర్ణవ్యవస్థకు సంబంధించి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారట. కొందరిలో ఈ సమస్యలు తీవ్రస్థాయిలో తరుచూ వేధిస్తూ ఉంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాలు - వైరసుల వంటి సూక్ష కణజీవులు, మితిమీరిన మానసిక ఒత్తిడి, కొన్నిరకాల ఔషధాల వంటివి జీర్ణవ్యవస్థకు సంబంధించి అనేక సమస్యలకు దారితీస్తుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండడం వ్యక్తి ఆరోగ్యకర జీవనానికి ప్రాథమిక ఆధారం. వ్యాధి లక్షణాల ఆధారంగా ఐ.బి.ఎస్.కు చికిత్స చేస్తారు. డాక్టరు సిఫార్సు చేసిన మందులు వాడతుండడంతోపాటు మీరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని అదుపులో ఉంచవచ్చు. మలబద్దకం ఉన్నపక్షంలో నారపదార్థం ఉండే కాయగూరలు, పండ్లు , పొట్టు తొలిగించని గోధుమపిండితో ఆహారాన్ని తీసుకోండి. అతి చల్లగా లేదా చాలా వేడిగా ఉండే ద్రవపదార్థాలను తీసుకోకండి. మానసిక ప్రశాంతతను అలవరచుకోండి. ఆహారపదార్థాలు, మందులు కొన్ని ఐ.బి.ఎస్.కు కారణమవుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవిధంగా ప్రేరేపిస్తున్నాయన్న అనుమానం ఉన్న ఆహారపదార్థాలు (పాల పదార్థాలు, కెఫైన్, కృత్రిమ తీపిపదార్థాలు, కడుపులో గ్యాస్ పెంచే చిరుతిండ్లు, మద్యం)కు దూరంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది.

డాక్టర్. శ్రీకాంత్ అప్పసాని
సీనియర్ మెడికల్ గ్యాస్ట్రో
టరాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్

1057
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles