చిన్న వయస్సులో పెద్ద వ్యాపారం శుచి పాండ్యా


Mon,March 18, 2019 01:06 AM

మహిళలే ముందుండి నడిపే వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. అందులోనూ రెండు పదుల వయస్సున్న యువతి వ్యాపారం చేస్తానని, పెట్టుబడి కోసం ప్రయత్నిస్తే సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ యువతి విషయంలో అదే జరిగింది. అలాగని ఆమె వెనుకడుగు వేయలేదు. వ్యాపారాభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి నమ్మినవారి నుంచే పెట్టుబడి సమీకరించి మహిళల ఫ్యాషన్ జువెలరీ కలెక్షన్‌ను సరసమైన ధరలో అందించే పిపా+బెల్లా ను ప్రారంభించి, విజయం సాధించిన శుచిపాండ్యా సక్సెస్‌మంత్ర.
shushi
జువెలరీ వ్యాపారం శుచీ రక్తంలోనే ఉంది. అదే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని చెప్పాలి. ముంబైకి చెందిన ఆభరణాల వ్యాపారానికి చెందిన కుటుంబంలో జన్మించారామె. రాత్రి భోజన సమయంలో ఎక్కువగా వ్యాపార అభివృద్ధి పైనే చర్చలు నడిచేవి. కొత్త వ్యాపారం, మార్కెట్లపై మాటలు దొర్లేవి. అలా చిన్నతనంలోనే ఆభరణాల తయారీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నది. దీంతో ఆమెకు సహజంగానే ఈ రంగంపై మక్కువ పెరిగింది. న్యూయార్క్ యూనివర్సిటీ పరిధిలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరింది శుచి. మార్కెటింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ కోర్సు చేసింది. ఆ పాఠాలు ఆమె ఆలోచనలకు కొత్త రెక్కలు తొడిగాయి. అయితే న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాక మాత్రం కొంతకాలం ఫ్యామిలీ బిజినెస్‌లో సాయం చేసింది. ప్రొడక్ట్ ఆధారిత విక్రయాలకు సంబంధించిన వ్యాపారంలో సైప్లె వ్యవస్థ, ధరల నిర్ణయం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఇక్కడే లభించిందని చెప్తారు శుచి.

వ్యాపారానికి పునాది

2010లో ఎంబీఏ విద్యాభ్యాసం కోసం వార్టన్ స్కూల్లో చేరారు శుచి. పిపా+బెల్లా ఆలోచనకు ఇక్కడే పదును పెట్టారు. నవతరం టెక్నాలజీ ఆధారిత వ్యాపార ప్రారంభం, నిర్వహణపై ఇక్కడే ఆలోచన ప్రారంభించినట్లు చెబుతారామె. వార్టన్ స్కూల్లో ఉండగానే.. 8 వారాల్లో వ్యాపార ప్రణాళిక రూపకల్పన, ప్రారంభం (ఐడియా, ఎగ్జిక్యూషన్) అనే క్లాసుకు అటెండ్ అయ్యిందట. దీనికి సంబంధించిన సమాచారం మరింతగా తెలుసుకునేందుకు ఫైనాన్స్, అకౌంటింగ్ క్లాసులకు ప్రత్యేకంగా హాజరు కావాల్సి వచ్చింది. వీటితోపాటు కోడింగ్ కూడా అటెండ్ అయ్యారు. తనకు పరిచయం, అనుభవం ఉన్న రంగాలే కాకుండా.. ఈ విభాగాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు గల అవకాశాలను కూడా ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ఫ్యాషన్ జువెలరీకి డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. ప్రస్తుతం యువత లేటెస్ట్ డిజైన్లు, ప్రత్యేకంగా కనిపించే మోడల్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతుండడాన్ని గమనించారు. మంచి నాణ్యతతో అందుబాటు ధరలో ఉండేవాటికి మొగ్గు చూపుతున్నారు. బంగారం, వజ్రాల మాదిరిగా ధరల ఆధారంగా డిమాండ్ మారే పరిస్థితి వీటికి లేదు.. వీటన్నింటినీ క్రోడీకరించి పిపా+బెల్లాకు ఓ రూపు తెచ్చింది.
shushi2

కోరుకున్న వారికి కోరుకున్నట్లు

ఆభరణాలంటే అమితంగా ఇష్టపడే భారత్‌లో జువెలరీ రంగంలో పోటీని తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. అందుకే పిపా+బెల్లా ప్రతీ వారం 100 కొత్త డిజైన్లను మార్కెట్‌లోకి తెస్తుంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు నగలను తయారుచేసే విధానాన్ని అమలు చేస్తున్నది. కస్టమర్లు తాము కోరుకున్న డిజైన్లను ఎంచుకునేలా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. ఈ జువెలరీ స్టార్టప్ తాము రూపొందించిన ఏ డిజైన్‌నూ 21 రోజుల కన్నా ఎక్కువ కాలం ప్రదర్శించరు. ఈ రంగంలో అనేక కంపెనీలు ఇప్పటికే ఉన్నా.. వినూత్నమైనన ఈ డిజైన్లే పిపా అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

వ్యాపార విస్తరణ, నిధుల సమీకరణ

ముంబైలో ప్రారంభమైన పిపా+బెల్లా ప్రస్తుతం సింగపూర్ వరకు పాకింది. అక్కడ కూడా పిపా+బెల్లా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం అహర్నిశలు శ్రమించిన శుచి పాండ్యా 2015 జూలైలో సింగపూర్‌కు చెందిన లయన్ రాక్ క్యాపిటల్, రాజేష్ సాహ్నే, తెరుహైడ్ శాటో, రూపానాథ్ నుంచి 6 లక్షల 50 వేల డాలర్ల నిధులు సమీకరించారు. జీఎస్‌ఎఫ్ ఫౌండర్ రాజేష్ సాహ్నే, ఫ్రీ కల్ట్ డాట్ కామ్ మాజీ సీఈఓ సుజల్ షా ప్రస్తుతం పిపా+బెల్లా సలహాదారులుగా ఉన్నారు. ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు శుచి. ముఖ్యంగా హైరింగ్, టెక్నాలజీ డెవలప్ మెంట్, కస్టమర్ల సంఖ్య పెంచేందుకు ఈ మొత్తాన్ని ఖర్చుచేయాలని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని దేశాల్లోనూ పిపా+బెల్లాను పరిచయం చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.

పిపా+బెల్లా అంటే?

మహిళల ఫ్యాషన్ జువెలరీకి సంబంధించిన కలెక్షన్స్‌ను సరసమైన ధరలో అందించడం పిపా+బెల్లా ప్రత్యేకత. ఈ పేరు వినూత్నంగా ఉండడమే కాదు.. దీనికి చాలా అంతరార్థం కూడా ఉంది. స్పానిష్ భాషలో విస్తృతంగా ఉపయోగించే పదం పిపా. అంటే సాహసాలు చేసే వ్యక్తిత్వం అని అర్థం. బెల్లా అనేది ఇటాలియన్ పదం. దీనికి ప్రాచీనమైన, సుందరమైన అని అర్థం. మహిళలు ఈ రెండింటిలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ చెందినవారై ఉంటారు. ఈ రెండు రకాలను బ్యాలెన్స్ చేసేలా తమ జువెలరీ కలెక్షన్ ఉండాలని భావించడంతో పిపా+బెల్లా అనే బ్రాండ్ నేమ్ ఎంచుకున్నానంటారు శుచీ.
shushi1

సరికొత్త ఆలోచనలతో...

నైపుణ్యం, నిబద్ధతగల ఉద్యోగులను వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకోసం శుచి చాలానే కష్టపడ్డారు. ఆ శ్రమకు ప్రతిఫలమే ప్రస్తుత పిపా+బెల్లా టీమ్. ఉత్సాహం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వం, ఏ సమస్య ఎదురైనా దాన్ని సవాల్‌గా తీసుకొని పరిష్కరించే సిబ్బందే తన ప్రేరణ అంటారు శుచి. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు యాప్‌ను వినియోగించడంతో పాటు, ఉత్పత్తుల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నారు. సునిశిత దృష్టి, క్రమశిక్షణ తన బిజినెస్ మంత్రమని చెప్పే ఆమె సవాళ్లు ఎదురైనప్పుడు బెదరకుండా ముందుకెళ్తే విజయం తథ్యమంటున్నారు.

నాణ్యతే ప్రధానం

బ్రాండింగ్ లేకుండా కొనుగోలుదారుల అభిరుచి మేరకు నగలను అందించే పిపా+బెల్లా విధానంలో కస్టమర్ల నమ్మకం పొందడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది పెద్ద సవాల్. అందుకే అందుబాటు ధరల్లో, అందమైన ఆభరణాలను రూపొందిస్తున్నాం. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించడమనేది చాలా కష్టం. అదృష్టవశాత్తూ జువెలరీ రంగంలో మాకున్న అనుభవం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేందుకు ఉపయోగపడింది.
- శుచి పాండ్యా

1036
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles