రాశిని బట్టి రంగు


Tue,March 19, 2019 11:54 PM

ఫలానా రాశి వారికి.. ఫలానా రంగు అంటే ఇష్టం అని.. నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు.. ఫ్యాషన్‌లోనూ.. లక్కీస్టోన్స్‌ల్లోనూ రంగులు చుకుంటున్నారు.. కానీ, హోలీకి వాడే రంగులు కూడా మీ రాశిని బట్టి ఎంచుకోవాలట..జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ సంవత్సరం.. ఒక్కో రాశి వారికి కొన్ని రంగులు బాగా కలిసొస్తాయట.. అందుకే ఆ లిస్ట్‌నే ఇస్తున్నాం.. పైగా ఈ హోలీని సేంద్రీయ రంగులతో జరిపితే.. రంగులు మరింత అందంగా వెల్లివిరుస్తాయి.. వాటిని మీరే తయారు చేసుకుని మరింత సంతోషంగా జరుపుకోండి.. ఒక రోజు ముందుగానే అందరికీ హ్యాపీ హోలీ..
holi
ఆర్గానిక్ హోలీ: మండుతున్న ఎండలకు కెమికల్ రంగులు మరింత ఇరిటేట్ చేస్తుంటాయి. సహజమైన రంగులతో ఈ హోలీని సంతోషంగా గడుపాలంటే ఈ రంగులను ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. హోలీని ఎంజాయ్ చేయొచ్చు.

ఎరుపు : మందార పూలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ ఎర్రని పూలు మీ హోలీ రంగులను మరింత ఎర్రగా మారుస్తాయి. మీకు ఎక్కువ రంగు కనిపించాలంటే మరిన్ని పూలను తీసుకొని ఈ రంగును తయారుచేసుకోవచ్చు. అలాగే ఎర్ర చందనం దొరుకుతుంది. దీన్ని రంగుగా వాడడం వల్ల మీ హోలీకి మరిన్ని రంగులద్దుకోవడమే కాదు.. మీ సౌందర్యమూ పెంపొందుతుంది. లేదా ఒక లీటరు నీటిలో రెండు టీస్పూన్ల ఈ చందనపు పొడిని కలిపి కాస్త వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఎంచక్కా హోలీ రంగుగా వాడుకోవచ్చు. ఎర్ర గులాబీలను కూడా ఎండబెట్టి, పొడి చేసి కూడా ఎరుపు వర్ణాన్ని తీసుకురావచ్చు.

కాషాయం : మోదుగు పూలను రాత్రంతా నీళ్లల్లో నానబెట్టాలి. ఆ నీళ్లను ఉదయాన్నే బాగా మరగబెట్టాలి. పసుపు-కాషాయం మిక్స్‌లో ఈ రంగు వస్తుంది. ఈ ఆయుర్వేద పువ్వును ఎండబెట్టకుండా అలాగే బాగా రుబ్బితే మంచి రంగు వస్తుంది. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలిపి వాడుకుంటే ఈ హోలీని మరింత ఎంజాయ్ చేయొచ్చు. కుంకుమపువ్వును కూడా రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని కూడా హోలీ రంగుగా వాడుకుంటే బాగుంటుంది. కాషాయ రంగులో ఈ వర్ణం మరింత శోభాయమానంగా ఉంటుంది.

పసుపు : పచ్చని రంగు కావాలనుకుంటున్నారా? దీనికి కాస్త శ్రమపడాల్సిందే! 100 గ్రా.ల పసుపు, 50గ్రా. బంతిపువ్వు రెక్కలు, 20గ్రా. నారింజ తొక్కల పొడి, 200గ్రా. ఆరోవ్రూట్ పౌడర్ కలుపాలి. దీంట్లో 20చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్‌ని మిక్స్ చేస్తే మనకు మంచి పసుపు వర్ణం వస్తుంది. ఒకవేళ ఇంత చేయాలేము అనుకుంటే.. పసుపులో కాస్త శనగపిండి కలిపి కూడా పసుపు రంగును తయారు చేసుకోవచ్చు. నీళ్లల్లో కలిపేందుకు అయితే బంతిపువ్వుల రెక్కలను నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఈ రంగును పొందవచ్చు.
wkpvwoleao
నీలం : ఈ రంగు కావాలనుకుంటే కూడా కొంచెం కష్టపడాలి. ఎందుకంటే..ఈ రకం పూలు చాలా అరుదుగా కనిపిస్తాయి. జక్రాండా పువ్వులు ఈ బ్లూ షేడ్స్‌ని ఇస్తాయి. నీలం రంగు మందార పువ్వుల నుంచి కూడా ఈ రంగును తయారుచేయొచ్చు. బ్లూ బెర్రీలను క్రష్ చేసి కూడా ఈ రంగు పొందవచ్చు. నీళ్లలో ఈ బెర్రీలను కలిపి బాగా మిక్స్ చేస్తే కూడా ఈ రంగును పొందవచ్చు. ఇవే కాకుండా.. కొన్ని రకాల మొక్కలకు కూడా నీలం రంగు పువ్వులు పూస్తాయి. వాటి ద్వారా కూడా ఈ రంగును తయారుచేసుకోవచ్చు.

ఆకుపచ్చ : ఈ రంగు సంతోకరమైన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి రంగు తయారుచేయడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. ఎందుకంటే లోకమే పచ్చని రంగుతో నిండిపోయి ఉంది కదా! మైదాకు ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. దీన్ని ఆకుపచ్చని పొడి రంగుగా ఉపయోగించవచ్చు. వేపాకును కూడా ఇలా ఎండబెట్టి పొడి చేస్తే సరిపోతుంది. లేదా వేపాకులను నీళ్లల్లో నానబెట్టి బాగా ఉడికించి, చల్లార్చాలి. ఆ ఆకులను తీసేసి ఆ నీళ్లను హోలీ నీళ్లుగా వాడుకోవాలి. ఈ నీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి.

గులాబీ : తెలంగాణలో బుక్క గులాలు చల్లి సంబురాలు జరుపుకోవడం ఆనవాయితీ. అదే హోలీ రంగుల్లో కూడా ఈ రంగు లేకపోతే ఎలా? దీనికోసం గులాబీ రంగు మందారపూలు, గులాబీ పూలు పర్‌ఫెక్ట్ చాయిస్. బీట్‌రూట్‌ని పేస్ట్ చేసి కాస్త ఎండబెట్టి, దాంట్లో శనగపిండి లేదా బియ్యంపిండి కలిపితే పొడి రంగు వచ్చేస్తుంది. లిక్విడ్‌లా కావాలంటే బీట్‌రూట్ జ్యూస్‌ని నీళ్లలో కలిపి రంగులు చల్లుకోవచ్చు.

బ్రౌన్ : కొన్ని రకాల పొడుల మిశ్రమం చేస్తే ఈ బ్రౌన్ కలర్ వస్తుంది. హెన్నా పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంట్లో ఉసిరిపొడి కలిపితే మనం అనుకున్న రంగు వచ్చేస్తుంది.
Stock

మేషం :

ఎరుపు ఈ రాశి వారికి లక్కీ కలర్. గులాబీ రంగు కూడా వీరికి ప్రశాంతతను ఇస్తుంది. ఎరుపు రంగు పవిత్రమైనది, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ సంవత్సరం హోలీని ఈ రెండు రంగులతో ఆడితే మరింత కలిసొస్తుంది.

వృషభం :

అన్నీ రంగుల్లోని శక్తి.. తెలుపు రంగుకు ఉందని భావిస్తారు. ఈ రాశి వారికి తెలుపు రంగు కలిసొస్తుంది. ఈ రంగు శాంతి, అనుకూలతకు చిహ్నంగా చెబుతారు. అయితే స్వచ్ఛమైన తెల్ల రంగు మార్కెట్‌లో దొరకకపోవచ్చు. దానికి దగ్గరగా ఉండే రంగయినా ఓకే.

మిథునం :

ఈ రాశి వారి జీవితంలోకి సంతోషం, ప్రేమ కలిసి రావాలంటే పసుపు రంగుతో హోలీ ఆడాలి. అదృష్టం, సంపద కోసమైతే ఆకుపచ్చ రంగును వాడుకోవచ్చు. ఈ రెండు రంగులను వీరు పవిత్రంగా భావించి హోలీ ఆడితే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం :

వృషభరాశి వారికి వీరికి ఈ సంవత్సరం ఒకేలా ఉంది. వీరు కూడా తెలుపు.. దానికి దగ్గరలో ఉన్న రంగులను ఎంచుకోవచ్చు. సుఖ, సంతోషాల కోసం ఈ హోలీ సంతోషంగా గడువాలంటే ఈ రంగును ఎంచుకోవడం మరువొద్దు.

సింహం :

ఆరెంజ్, యెల్లో కలర్స్‌ని హోలీ రంగులగా ఎంచుకోవాలి. ఆరోగ్యం, తెలివి పెరుగాలంటే ఈ రెండు రంగులను ఎంచుకోవాలి. పసుపు రంగు అన్ని మంచి పనులు ప్రారంభించేటప్పుడు వాడుతారు. కాబట్టి ఈ రంగును వీళ్లు తప్పక వాడాల్సి ఉంటుంది.

కన్య :

ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే.. ఆకుపచ్చ రంగు ఈ సంవత్సరం మీకు మంచి చేస్తుంది. ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది. కొత్త శక్తిని, పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ హోలీని ఆకుపచ్చ రంగుతో నింపేయండి.

తులారాశి :

ఈ రాశి వారు.. పసుపు, తెలుపు రంగులను హోలీ రంగులుగా ఎంచుకోవాలి. మీ శ్రేయస్సును, అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే పసుపు రంగును వాడండి. జీవితంలో శాంతి పెంపొందాలంటే తెలుపు ఎంచుకుంటే సరి.

వృశ్చికం :

వీరికి మేషరాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఒకేలా ఉంటుంది. అందుకే ఎరుపు, గులాబీ రంగులను ఈ హోలీకి ఎంచుకోవాలి. ఇతరులు మీ పై ప్రేమ, శ్రద్ధ చూపించాలని భావిస్తే ఈ రంగులు వాడండి. మీ రోజుకు మరింత పవిత్రతను జోడించండి.

ధనుస్సు :

ఎరుపు, పసుపు వీరికి కలిసొచ్చే రంగులు. కాబట్టి ఈ రంగులను ఈ హోలీకి ఎంచుకోండి. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ రంగులయితే బెటర్. ఎరుపు ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందట.

మకరం :

ఈ రాశివారు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక భావనలో ఎక్కువగా ఉంటారట. అందుకే వీళ్లు.. ఆకుపచ్చ రంగు ఎంచుకోవాలి. ఇక నీలం రంగు కూడా వీరికి కలిసొస్తుంది. ఈ రంగు సహనాన్ని పొందడానికి సహాయం చేస్తుంది.

కుంభం :

నీలం రంగు ఈ రాశి వారికి చాలా పవిత్రమైనది. మీ స్వభావాన్ని తెలుపుతుంది. నిజాయితీ, న్యాయానికి మద్దతు ఇస్తుంది ఈ రంగు. ఇది ఆర్థిక విస్తరణ, మీ పురోగతి మరింత పెరుగాలంటే ఈ సంవత్సరం ఈ రంగుతో హోలీని సెలెబ్రేట్ చేయండి.

మీనం :

ఈ హోలీని ఎరుపు, పసుపు రంగులతో నింపేయండి. పసుపు రంగు సంపదను పొందడంలో ఈ రాశి వారికి సహాయం చేస్తుంది. మెరుగైన జీవితాన్ని పొందాలంటే మాత్రం ఎరుపు రంగును ఈ రంగుల్లో జోడించండి. మీ జీవితమే మారిపోతుంది.

1556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles