కమ్మగా ..కలర్‌పుల్‌గా!


Thu,March 21, 2019 02:54 AM

vantalu
హోలీ హోలీల రంగ హోలీ.. చమ్మకేళీల హోలీ.. అంటూ పాడడమే కాదు.. కడుపునిండా తిన్నప్పుడే.. ఆ ఆటకు ఊపు వస్తుంది.. ఇక గుచ్చే మండే వేసవిలో కాస్త కమ్మగా ఉంటేనే ముద్ద దిగుతుంది..అందుకే ఈ హోలీనే కాదు.. తినే ఫుడ్ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలని.. రకరకాల వంటకాలను మీ ముందుంచుతున్నాం.. ఈ పండుగను జాగ్రత్తగా జరుపుకొని.. ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి..

దహీ బల్లా

dahi-bhalla

కావాల్సినవి :

మినపపప్పు : 200 గ్రా. , కమ్మటి పెరుగు : 200 గ్రా., జీడిపప్పు : ఒక టేబుల్‌స్పూన్, కిస్‌మిస్ : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

మినపపప్పును మూడుగంటలు నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఈ పప్పును వడల పిండిలా రుబ్బుకొని, ఉప్పు వేసి కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. వడల పిండిని గుండ్రంగా చేసి మధ్యలో రంధ్రం చేసి నూనెలో రంగు మారే వరకూ వేయించాలి. ఇలా పిండి మొత్తం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నెలో పెరుగు వేసి గిలక్కొట్టాలి. దాంట్లో కొంచెం ఉప్పువేసి ఈ వడలను అందులో వేసుకోవాలి. చివరగా జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్‌చేయాలి. వీటిని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి స్వీట్ చట్నీతో చల్లగా తింటే యమ టేస్టీగా ఉంటాయి.

హిందుస్తానీ తవా పన్నీర్

tawa-panner

కావాల్సినవి :

పన్నీర్ : 250 గ్రా. పచ్చిమిర్చి : 4 కొత్తిమీర : 2 కట్టలు
పుదీనా : ఒక కట్ట
ఆవనూనె : 2 టీస్పూన్స్
క్యాప్సికమ్ : 1
టమాటాలు : 2
ఉల్లిగడ్డలు : 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
గడ్డ పెరుగు : అక కప్పు
నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్
ఉప్పు : తగినంత

తయారీ :

పన్నీర్, క్యాప్సికమ్, టమాటాలు, ఉల్లిగడ్డలను ఒకే రీతిలో పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో గడ్డ పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపాలి. ఇందులోనే పన్నీర్, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఆవనూనె వేసి మారినేట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత నాన్‌స్టిక్ ప్యాన్ పై కొంచెం నూనె వేసి పన్నీర్ ముక్కలను, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను ఒక రీతిలో అరేంజ్ చేసి రెండు వైపులా దోరగా వేయించాలి. వీటిని వేడిగా మింట్ చట్నీతో తింటే బాగుంటాయి.

రంగోళి పులావ్

pulav

కావాల్సినవి :

బాస్మతీ రైస్ : 250 గ్రా., నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, యాలకులు : 4 లవంగాలు : 4, దాల్చిన చెక్క : 2, బిర్యానీ ఆకులు : 2, కొత్తిమీర : ఒక కట్ట, ఉల్లిగడ్డ : 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, క్యారెట్ : 50 గ్రా., బీన్స్ : 50 గ్రా., కాలీఫ్లవర్ : ఒక కప్పు (తురుము), స్వీట్‌కార్న్ : అర కప్పు, జీడిపప్పులు : అర కప్పు, పచ్చిమిర్చి : 4, పుదీనా : చిన్న కట్ట, కుంకుమపువ్వు : చిటికెడు, పాలు : అర కప్పు, ఉప్పు : తగినంత

తయారీ :

బాస్మతీరైస్‌ని కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఈలోపు పాలను వేడి చేసి గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుతుండాలి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, స్వీట్‌కార్న్, జీడిపప్పులు వేసి కలుపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో బాస్మతీ రైస్ వేసి కలుపాలి. కాస్త నీళ్లు ఇంకే వరకు ఉంచి పై నుంచి పాలను పోసి ఒకసారి కలుపాలి. పైన కొత్తిమీర, పుదీనా చల్లి మూత పెట్టాలి. సన్నని మంట మీద అన్నం అయ్యే వరకు ఉంచి దించేయాలి. వేడి వేడి రంగోళి పులావ్ రెడీ!

డ్రైఫ్రూట్ గుజియా

gujia

కావాల్సినవి :

మైదా : 250గ్రా. , నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, రవ్వ : 50 గ్రా., కోవా : 100 గ్రా., బాదం : 25గ్రా., పిస్తా : 25గ్రా., చక్కెర : 250 గ్రా., నూనె : తగినంత

తయారీ :

నెయ్యి వేడి చేసి మైదాలో వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. కడాయి పెట్టి.. రవ్వను దోరగా వేయించుకోవాలి. ఇందులో బాదం, పిస్తా, సన్నగా తరిగిన కోవా వేసి కలుపాలి. చక్కెరలో కొన్ని నీళ్లు కలిపి పాకంలా చేయాలి. మైదా ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి చిన్న పూరీల్లా చేసుకోవలి. దీంట్లో కోవా డ్రైఫ్రూట్ మిశ్రమాన్ని చేసి అర్ధ చంద్రాకారంలో చుట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. మైదాతో చేసుకున్న గుజియాలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన వాటిని పాకంలో వేసి కాసేపు ఉంచాలి. పై నుంచి బాదం, పిస్తాలతో గార్నిష్ చేయాలి. ఇవి వెంటనే కాకుండా కాసేపు ఆగితే వాటికి పాకం బాగా పట్టి తియ్యగా, టేస్టీగా ఉంటాయి.

థండాయి

tandaif

కావాల్సినవి :

పాలు : ఒక లీటరు, చక్కెర : 250 గ్రా., యాలకుల పొడి : అర టీస్పూన్, పిస్తా : 50 గ్రా., బాదం : గార్నిష్ కొరకు

తయారీ :

పిస్తా పప్పును గోరువెచ్చని నీటిలో నానబెట్టి, పొట్టు తీసేయాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. గిన్నెలో పాలు పోసి సన్నని సెగపై బాగా వేడి చేయాలి. దాంట్లో పిస్తా పప్పు ముద్దను వేసి కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. దీంట్లో చక్కెర, యాలకుల పొడి వేయాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉంచి దించేయాలి. ఈ పాలను ఫ్రిజ్‌లో పెట్టి బయటకు తీయాలి. పై నుంచి బాదం, పిస్తా పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

774
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles