అక్కడే శాటిలైట్ టౌన్‌షిప్పులు!


Sat,April 13, 2019 12:37 AM

హైదరాబాద్‌లో రియల్ రంగం ఎవర్ గ్రీన్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు! స్థలాల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలోనూ.. అందుబాటు ధరలో ఫ్లాట్లు దొరికే నగరమంటే.. కేవలం హైదరాబాదేనని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు పీఎస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం పీఎస్ రెడ్డి మాటల్లోనే..
Centre-garden
హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాల్ని నిర్మించే సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే రెండు నుంచి మూడేండ్లలో అధిక శాతం ఐటీ, ఆఫీసు స్థలం అందుబాటులోకి వస్తుంది. పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రోత్సాహాకర నిర్ణయాల కారణంగా, ఆఫీసు స్థలానికి మళ్లీ ఆదరణ పెరుగుతుందనే నమ్మకం ఉన్నది. ఇప్పటికే మాదాపూర్ వరకూ మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అక్కడ్నుంచి మెట్రో విస్తరణ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి పనుల్లో వేగం పెరిగింది. దీంతో నగరం నుంచి మాదాపూర్, గచ్చిబౌలి దాకా రాకపోకలు సులువుగా జరుగుతాయి. పైగా, వచ్చే మూడేండ్లలో ఒక్క హైదరాబాద్‌లోనే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.45 వేల కోట్లను ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఇది వాస్తవరూపం దాల్చితే, భాగ్యనగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య శాటిలైట్ టౌన్‌షిప్పులను నిర్మిస్తే.. హైదరాబాద్ విస్తరణకు, రానున్న రోజుల్లో విశ్వనగరం అయ్యేందుకు తోడ్పడుతుంది.

పర్యావరణ అనుమతులు..

ఫ్లాట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతమున్న భూముల ధరలకు, ఫ్లాట్ రేటుకు పొంతనే లేదు. వాస్తవానికి, ఫ్లాట్ల ధరలు ఇప్పటికీ చాలా తక్కువున్నాయనే చెప్పొచ్చు. పెరిగిన భూముల ధరలతో పోల్చితే, భవిష్యత్తులో ఫ్లాట్ల రేట్లు పెరగడానికి ఆస్కారమున్నది. కొత్త వాటికి పర్యావరణ అనుమతులు రావడంలో ఆలస్యమవుతున్నది. ఫలితంగా, ఫ్లాట్ల లభ్యతలో కొరత ఏర్పడే అవకాశమున్నది. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు అమ్ముడయ్యాక.. కొత్త వాటిలో రేటు పెరిగే అవకాశమున్నది. అందుబాటు గృహాల ప్రాజెక్టులను చేపడితేనే ఈ రంగం అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. ప్రస్తుతం తెలంగాణ నిర్మాణ రంగం పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నది. వాటి పరిష్కారానికి వివిధ నిర్మాణ సంఘాలిచ్చిన సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మరింత జోరుగా అడుగులు ముందుకేస్తాం.

జాతీయ స్థాయిలో నరెడ్కో..

మా నరెడ్కో (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్) సంస్థ కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్నది. దీనికి చీఫ్ ప్యాట్రన్‌గా కేంద్ర గృహనిర్మాణ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి వ్యవహరిస్తున్నారు. అదే శాఖకు చెందిన ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇక, రాష్ట్ర స్థాయిలోనూ పురపాలక, రెవెన్యూ, పలు పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించిన సభ్యులను మా నరెడ్కో తెలంగాణలో సభ్యులుగా చేర్చుకునే ప్రయత్నాల్ని జరుపుతున్నాం.
PS-REDDY

412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles