పెరిగిన ధరలే.. పెద్ద విఘాతం


Sat,April 13, 2019 12:41 AM

గత ఏడాది కాలంలో.. రాష్ట్రంలో భూముల ధరలు పెరగని ప్రాంతమంటూ లేదు. హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్.. ఇలా ఎక్కడ చూసినా ఒకట్రెండు రెట్లు స్థలాల రేట్లు అధికమయ్యాయి. దీంతో, కొత్తగా అపార్టుమెంట్లను నిర్మించాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని అధిక శాతం మంది డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. సరికొత్త రేట్ల ప్రాతిపదికన.. అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నా.. అటు స్థల యజమానులకు కానీ ఇటు బిల్డర్లకు కానీ గిట్టుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
BANNER
ఐదేండ్ల నుంచి దేశమంతటా అందుబాటు గృహాల గురించే చర్చ. కేంద్రం కూడా చౌక గృహాల్ని ప్రోత్సహించడానికి అనేక రాయితీలను ప్రకటించింది. ప్రైవేటు సంస్థలను ఈ క్రతువులో భాగస్వామ్యులు కావాలని కోరింది. అయినా, నేటికీ మధ్యతరగతి ప్రజానీకం సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు. కారణం.. పెరుగుతున్న భూముల ధరలే. హైదరాబాదే ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడి మార్కెట్ పూర్తిగా ఐటీ నిపుణుల మీద ఆధారపడింది. అందులో పని చేసే అధిక శాతం ఉద్యోగుల జీతం రూ.50 వేల లోపే ఉంటుంది. వాటిలో సగం ఇంటి ఖర్చుల కోసం మినహాయిస్తే.. మిగతా సొమ్ముతో సొంతిల్లు ఎలా కొనుక్కోగలుగుతారు? ఒకవేళ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే తప్ప.. సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి నెలకొన్నది. మరి, మన రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరాలంటే ఏం చేయాలి?

అమెరికాలో ఇలా చేస్తారు..

అమెరికా వంటి దేశాల్లో ముందుగా రోడ్లను అభివృద్ధి చేశాకే.. ఆయా ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతిని మంజూరు చేస్తారు. దాంతో, ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా కాకుండా, మన వద్ద రహదారులను అభివృద్ధి చేయకపోయినా, ఎక్కడ పడితే అక్కడ, లేఅవుట్లకు అనుమతినిచ్చేస్తున్నాం. ఈ తంతు గత కొన్నేండ్ల నుంచి జరుగుతున్నది. అందుకే, హైదరాబాద్‌లో అభివృద్ధి మొత్తం అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నది. అక్కడక్కడా విసిరేసినట్లు అభివృద్ధి జరుగుతున్నది. అలా కాకుండా, ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల కొంత సొమ్ము ఖర్చు పెట్టి గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేస్తే.. అక్కడ లక్షల ఎకరాలు అందుబాటులోకి వస్తుంది. అక్కడొచ్చే కొత్త నిర్మాణాల వల్ల ప్రభుత్వ సంస్థలకు ఫీజుల రూపంలో కొంత సొమ్ము వారి ఖాతాలో జమ అవుతుంది. అధిక స్థలం అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేటు నిర్మాణ సంస్థల కొత్త నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి. సరఫరా పెరిగితే.. గిరాకీ తగ్గుతుంది కాబట్టి.. డెవలపర్లు చౌక ధరలకే ఇండ్లను విక్రయించే ఆస్కారం ఉంటుంది.

నివాస అవసరాలకు ఎక్కువ..

మాస్టర్ ప్లాన్ రచించేటప్పుడు కనీసం ముప్పయ్యేండ్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ప్రస్తుత అవసరాల నిమిత్తం ప్రణాళికల్ని రచిస్తే.. నగరమంతా అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత అవసరాల నిమిత్తం రహదారులను 60 అడుగులే అభివృద్ధి చేసినా.. భవిష్యత్తులో దాన్ని 100 అడుగులైనా సులువుగా విస్తరించేలా ఏర్పాట్లు ఉండాలి. గతంలో హౌసింగ్ బోర్డు సామాన్యుల సొంతింటి కలను తీర్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే, మాస్టర్ ప్లాన్‌లో నివాస అవసరాలకు అధిక స్థలాన్ని కేటాయించాలి. రెసిడెన్షియల్ యూజ్ కోసం అవసరమయ్యే స్థలంపై నియంత్రణ వల్ల.. అపార్టుమెంట్లను నిర్మించడానికి స్థలం దొరక్క.. ఇండ్ల కొరత ఏర్పడుతున్నది. ఇదే తప్పును, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో గత ప్రభుత్వాలు చేశాయి. అలా కాకుండా, మాస్టర్ ప్లాన్‌లో నివాస అవసరాల నిమిత్తం అధిక భూమి ఉండేలా ప్రణాళికల్ని రచిస్తే.. స్థలాల కొరత ఏర్పడదు. వాటి ధరలకూ రెక్కలు రావు. సామాన్యులు సులువుగా సొంతింటి కల సాకారం చేసుకుంటారు.
SHEKAR-REDDY
- సి.శేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్

381
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles