నరకం చూపిస్తున్న.. నాలా కన్వర్షన్


Sat,April 20, 2019 12:56 AM

నాలా కన్వర్షన్ అంటేనే తెలంగాణ బిల్డర్లు భయపడుతున్నారు.. కోట్ల రూపాయల్ని భూములపై వెచ్చించినా.. ఈ పత్రం కోసం ఏడాది, ఏడాదిన్నర దాకా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. ముడుపులు అందనిదే రెవెన్యు శాఖ ఉన్నతాధికారులు నాలాను క్లియర్ చేయడం లేదని నిర్మాణ రంగం వాపోతున్నది.
Land
ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిలో జరగాల్సిన ఈ పని పూర్తి కావడానికి నిర్మాణ సంఘాలు నరకాన్ని చవి చూస్తున్నాయి. ఒకవేళ, అట్టి భూమి ఏదైన ఏ చెరువుకు సమీపంలో ఉంటే.. అంతే సంగతులు. ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) కు సంబంధించిన సరిహద్దుల్ని నీటిపారుదల శాఖ అధికారుల చేత ధృవీకరించుకుని.. మళ్లీ రెవెన్యూ వద్దకెళ్లి నాలా క్లియరెన్స్ చేసుకోవడానికి నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తమకు వద్దని.. పదిహేను రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతుల్ని మంజూరు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే విధానాన్ని నిర్మాణ రంగానికీ వర్తింపజేయాలని తెలంగాణ రియల్ రంగం ముక్తకంఠంతో కోరుతున్నది.

-2006లో నాలా ఛార్జీలను పది శాతం కట్టాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్‌లో హెచ్‌ఎండీఏ ఒక జోన్‌ను నిర్థారించాక.. అందులో మళ్లీ నాలా కట్టడమెందుకని చాలామంది డెవలపర్లు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ సమస్య హైకోర్టుకు చేరుకున్నది. సమస్యలను కూలంకషంగా పరిశీలించిన న్యాయస్థానం.. భూమిని వ్యవసాయం నుంచి వ్యవసాయేతరకు మార్పిడి చేయాలంటే రెవెన్యూకు కచ్చితంగా పది శాతం నాలా ఛార్జీలను చెల్లించాల్సిందేనని అప్పటి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక జోన్లు అంటారా? అది పురపాలక శాఖ నిర్థారించింది తప్ప రెవెన్యు శాఖ కాదని గుర్తు చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాలా ఛార్జీలను సగం తగ్గించేశారు. దీంతో, నిర్మాణ రంగానికి పెద్ద భారం తప్పింది.

ప్రక్రియే ఆలస్యం?

నాలా ఛార్జీలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగానికి గొప్ప మేలు చేసింది. కాకపోతే, ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర అవుతుంది. అందుకే, అనుమతులిచ్చే సమయంలోనే.. నాలా ఛార్జీల నిమిత్తం ఫీజెంత కట్టాలో చెబితే ముందే కట్టేస్తామని నిర్మాణ రంగం చెబుతున్నది. దీని వల్ల తమ సమయం వృథా అవ్వదని పేర్కొంటున్నది. ఈ క్లియరెన్స్ కూడా త్వరగా అవుతుందని అంటున్నది. లేఅవుట్ల అనుమతి ఆలస్యమవుతున్నదని హెచ్‌ఎండీఏ ఒక వెసులుబాటును గతంలో కల్పించింది. అదనపు తనఖా ఇచ్చి లేఅవుట్‌ను రిలీజ్ చేసుకోవాలని తెలియజేసింది. ఈ విషయంలో డిపార్టుమెంట్ కాస్త భిన్నంగా స్పందించింది. అనుమతి రాకముందే పనుల్ని ప్రారంభించినట్లయితే.. ఒకటిన్నర రెట్లు సొమ్ము ఎక్కువ కట్టాలని అంటున్నారు. ఇదే విషయమై రియల్ రంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నది.

పంచాయతీ వద్దకు వెళ్లమంటే వెళ్లం..

భారత రాజ్యాంగం పంచాయతీకి స్పష్టమైన అధికారాల్ని కట్టబెట్టింది. అయితే, వారికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల.. హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ సాంకేతిక అనుమతుల్ని మంజూరు చేసి.. తుది అనుమతిని మాత్రం పంచాయతీ నుంచి తీసుకోమని చెబుతున్నది. ఒక్కసారి ఫైలు హెచ్‌ఎండీఏ నుంచి పంచాయతీకి వెళ్లిందంటే చాలు.. ఇక, వారి ఆశలకు అంతే లేకుండాపోతున్నది. ముందుగా విలేజ్ సెక్రెటరీ తన డిమాండ్‌లను బిల్డర్ ముందు పెడతారు. ఆతర్వాత, వార్డు సభ్యులు, సర్పంచి నానా రభస చేస్తున్నారు. ఆయా పంచాయతీ పరిధిలో వచ్చే ప్రతి వెంచర్ నుంచి ముక్కుపిండి సొమ్ము వసూలు చేస్తున్నారు. కొందరైతే, ఏకంగా ప్లాట్లు, ఫ్లాట్లను కూడా ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. లేకపోతే, పనుల్ని మధ్యలో నిలిపివేస్తామని భయపెడుతున్నారు. దీంతో, లేఅవుట్లను అభివృద్ధి చేసే రియల్టర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతున్నది.

సింగిల్ విండో.. సరైన పరిష్కారం..


PS-REDDY
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని నిర్మాణ రంగానికీ వర్తింపజేయాలి. అనుమతులిచ్చే సంస్థకే.. వివిధ శాఖలకు చెల్లించే ఫీజులన్నీ కట్టేలా నిర్ణయం తీసుకోవాలి. సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమల్లోకి తేవాలి. అప్పుడే, నిర్మాణ రంగానికి ఎలాంటి ఇబ్బందులు రావు. అనుమతుల్లో పారదర్శకమైన విధానం అమల్లోకి వస్తే.. హైదరాబాద్‌లో పెట్టుబడుల్ని పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఇప్పటికే హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. ఈ స్థాయి నుంచి మరో మెట్టుకు నిర్మాణ రంగం ఎదగాలంటే.. సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేవాలి.
- పీఎస్‌రెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ

1236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles