ఐబీఎస్ ఎందుకు సోకుతుంది?


Thu,May 16, 2019 01:15 AM

నా వయస్సు 21 సంవత్సరాలు. నేనొక బంగారం షాపులో పనిచేస్తుంటాను. పనిమీద ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. దీనివల్లనో ఏమోగానీ నాకు మలబద్దకం సమస్య వచ్చింది. పొట్టలో తరచూ నొప్పి కలుగుతున్నది. ఉబ్బసంగా కూడా ఉంటున్నది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అని ఓ టీవీ కార్యక్రమం ద్వారా తెలిసింది. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలుపగలరు.
- పి. సంపత్‌కుమార్, జనగాం

Councelling
మీరు టీవీ కార్యక్రమంలో చూసి మీ వ్యాధిని ఫలానా అని మీరే నిర్ధారించుకున్నారు. ఇది చాలా తప్పు. శరీరం మీదే అయినా మీ సమస్య ఏంటో తెలియజేసేది డాక్టర్. అంతేకానీ మీరే ఊహించుకుంటే ఎట్లా? మీరు ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. వారే మీకున్న లక్షణాలను పరిశీలించి టెస్టులు చేస్తారు. వ్యాధి ఏంటో కూడా నిర్ధారిస్తారు. మీరు ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ అంటున్నారు కాబట్టి దీని గురించి చర్చించుకుందాం. సాధారణంగా జీర్ణవ్యవస్థలో కనిపించే వ్యాధుల్లో ఇదీ ఒకటి. ఇది అనేక సమస్యల సమాహారం. ప్రత్యేకించి ఫలానా కారణం అని చెప్పలేం. చిన్నపాటి ప్రేరణకే పెద్ద పేగు అతిగా స్పందించటం ఈ వ్యాధికి ఒక కారణం. నెమ్మదిగా, ఒక క్రమం ప్రకారం ఉండే పెద్దపేగు కండరాల కదలికలు ఈ అతి స్పందన వల్ల జీర్ణవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తుంటాయి. అదే సమయంలో కొన్ని ఆహారపదార్థాలు, మందులు, మానసిక ఉద్వేగాలు కూడా ప్రేరేపిస్తుంటాయి. ఈ వ్యాధి వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడుతుంది. మరికొందరికి విరేచనాలు అవుతుంటాయి. ఇంకొందరిలో ఈ రెండు లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు, మితిమీరిన మానసిక ఒత్తిడి వంటివి ఈ సమస్యలను కలిగిస్తాయి. వ్యాధి లక్షణాల ఆధారంగా ఐబీఎస్‌కు చికిత్స చేస్తారు. డాక్టర్ సిఫార్సుచేసిన మందులు వాడతుండటంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చు. మలబద్దకం సమస్య ఉంటే పీచు పదార్థాలు, కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని గోధుమ పిండి, జొన్న ఆహారం తీసుకోవాలి. అతి చల్లగా లేదా అతి వేడిగా ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవద్దు. జంక్‌ఫుడ్ అసలే వద్దు. మానసిక ప్రశాంతతను అలవరుచుకోండి.

-డాక్టర్: శ్రీకాంత్ అప్పసాని
-సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
-యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ

550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles